వర్షాలు సమృద్ధిగా పడితే రోజూ మంచినీరు..


Fri,April 21, 2017 12:47 AM

-హైదరాబాద్ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తాం
-జనాభా ఐదింతలు పెరిగినా తాగునీటికి ఇబ్బంది ఉండదు
-కేశవాపూర్ వద్ద 20 టీఎంసీల రిజర్వాయర్ నిర్మిస్తాం
-హడ్కో ప్రాజెక్టు కింద కొత్తగా లక్ష కనెక్షన్లు ఇస్తున్నాం
-భవిష్యత్తులో ఎన్ని లక్షల కనెక్షన్లకైనా నీరందిస్తాం
-త్వరలో ఔటర్ లోపలి 180 గ్రామాలకు జలమండలి నీరు
-వాటర్‌బోర్డును మనమే నష్టాలనుంచి గట్టెక్కించాలి
-11 నెలల ముందే పనులు పూర్తి చేసిన ఘనత జలమండలిదే
-రిజర్వాయర్ల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్

చందానగర్/శేరిలింగంపల్లి/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశ్యంతో నగర నీటి సమస్య పరిష్కారాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నాం. హైదరాబాద్‌లో దాదాపు కోటి జనాభా ఉంది.. భవిష్యత్తులో ఇది ఐదింతలు పెరిగినా మంచినీటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. కరువు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఉండవద్దని సీఎం కేసీఆర్ ఖర్చుకు వెనుకాడకుండా దాదాపు రూ. 7700కోట్లతో కేశవాపూర్ వద్ద 20 టీఎంసీల సామర్థ్యం కలిగిన భారీ రిజర్వాయర్ చేపట్టాలని సూచించారు. భూ సేకరణ చేసి, టెండర్లకు వెళతాం. హైదరాబాద్ తాగునీటి విషయంలో సీఎం కేసీఆర్ పూర్తి కమిట్‌మెంట్‌తో పల్లెలు, పట్టణం అంతరాలు లేకుండా మిషన్ భగీరథ రూరల్, అర్బన్ పథకాలను సమాంతరంగా తీసుకువెళ్తూ నాణ్య మైన నీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పార్టీకి 99 సీట్లు అందించి పట్టం కట్టిన ప్రజల రుణాన్ని తీర్చుకుంటాం.
- మంత్రి కేటీఆర్

నగరంలో సమృద్ధిగా వర్షాలు పడితే ఈ సంవత్సరం చివరినుంచే నిత్యం నీటి సరఫరా చేస్తామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. ఇప్పటికే 160 బస్తీల్లో ప్రతి రోజూ నీటి సరఫరా చేస్తున్నామని, నగరంలోని ప్రతి గల్లీకి, డివిజన్‌కు నిత్యం నీటి సరఫరా చేయాలనే కమిట్‌మెంట్‌తో ప్రభుత్వం ఉందన్నారు. శరవేగంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగర జనాభా ఐదురెట్లు పెరిగినా నీరందించాలన్న సదుద్ధేశ్యంతో 20 టీఎంసీల సామర్థ్యంతో శామీర్‌పేటలోని కేశవాపుర్ దగ్గర భారీ రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నట్టు మంత్రి వివరించారు. అర్బన్ మిషన్ భగీరథ కింద రూ.1900కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుతో లక్ష మందికి అదనంగా నీటి కనెక్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ప్రతి మనిషికి ప్రతి రోజూ 150 ఎల్‌పీసీడీ (లీటర్ల చొప్పున) నీళ్లు అందిస్తామని, రాబోయే రోజుల్లో ఎన్ని నల్లా కనెక్షన్లు కావాలన్నా ఇవ్వడానికి జలమండలి సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. జలమండలి అధ్వర్యంలో గోపన్‌పల్లి, హుడా మియాపూర్, కేపీహెచ్‌బి ఫేజ్-4, నలగండ్లలో ఏర్పాటైన భారీ స్టోరేజీ రిజర్వాయర్లను గురువారం మంత్రులు మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్ధీన్‌లతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అంతకు ముందు కూకట్‌పల్లి నుంచి జగద్గిరిగుట్ట దారిలో రూ. 3కోట్లతో జీహెచ్‌ఎంసీ చేపట్టిన నాలా బ్రిడ్జిని మంత్రి ప్రారంభించారు. నలగండ్ల చెరువు, ముల్కం చెరువులను పరిశీలించి పరిరక్షణ చర్యలు చేపట్టాలని ఆయా శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. నగరంలో మంత్రి నిర్వహించిన సుడిగాలి పర్యటనలో హైదరాబాద్ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తామనిప్పారు..

మిగతా వివరాలు ఆయన మాటల్లోనే...


ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ జీహెచ్‌ఎంసీలో విలీనమైన 11 మున్సిపల్ సర్కిళ్ల ప్రజలకు మెరుగైన నీటి సరఫరాపై దృష్టి పెట్టారు. ఇందుకు గానూ రూ. 1900కోట్లతో 56 భారీ రిజర్వాయర్లు, 1800కిలోమీటర్ల పైపులైన్ విస్తరణ పనులు చేపట్టి సకాలంలో నీటి సరఫరాను అందించాం. ఇదే సమయంలో జీహెచ్‌ఎంసీ పరిధికే పరిమితమైన జలమండలి సేవలను జీహెచ్‌ఎంసీ బయట, ఔటర్ లోపల, 180 గ్రామాలకు జలమండలి నీరందించాలని నిర్ణయించాం. త్వరలోనే మిషన్ భగీరథలో భాగంగానే ఈ 180 గ్రామాల తాగునీటి అవసరాల కోసం రూ. 628కోట్ల పనులకు టెండర్లు పిలుస్తున్నాం. వీటితో పాటు రూ. 400కోట్లతో మంజీరా జలాల స్థానంలో గోదావరి జలాల అనుసంధానం కోసం రింగ్ మెయిన్ పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేశాం.

లక్ష కొత్త నల్లా కనెక్షన్లకు తాగునీరు


హడ్కో ప్రాజెక్టు పూర్తితో లక్ష నల్లా కనెక్షన్లకు నీరిందించబోతున్నాం. హైదరాబాద్‌లో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం నగరంలో 21 లక్షల కుటుంబాలు ఉన్నాయని లెక్కలుంటే నీటి కనెక్షన్లు మాత్రం 9.20లక్షల కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. నీటి కనెక్షన్లు లేని వారంతా కనెక్షన్లు తీసుకోవాలి. ఇటువంటి వారి కోసం స్పెషల్ డ్రైవ్‌ల ద్వారా కనెక్షన్లు సకాలంలో అందజేస్తాం.

జలమండలిని మనమే కాపాడుకుందాం


ప్రజలకు విజ్ఞప్తి ఒక్కటే.. జలమండలి నష్టాల్లో ఉంది..మనం సైప్లె చేస్తున్న నీటిలో 40% నీటికి తిరిగి రెవెన్యూ రావడం లేదు. దీనిని నాన్ రెవెన్యూ వాటర్ (ఎన్‌ఆర్‌డబ్ల్యూ) అంటారు.. క్వాలిటీ, మెరుగైన నీటి సరఫరా జరగాలంటే మన జలమండలిని మనమే కాపాడుకోవాలి. ఎన్‌ఆర్‌డబ్ల్యూను తగ్గించేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించి మీటర్లు లేని వారికి మీటర్లు బిగిస్తున్నాం.

11వేల కోట్లతో సీవరేజీ వ్యవస్థ బలోపేతం


నగరంలో సివరేజీ వ్యవస్థను బలోపేతం చేయడానికి రూ. 11వేల కోట్లు వెచ్చించనున్నాం. పురాతన పైపులైన్లతో ఎన్టీఆర్ మార్గ్ లాంటి చోట్ల రోడ్లు కుంగిపోవడంలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ట్రెంచ్‌లెస్ టెక్నాలజీ సహాయంతో పునరుద్ధరణ పనులు చేపడుతున్నాం. అత్యవసరమైన ప్రాంతాల్లో సీవరేజీ పైపులైన్ పనులు చేపడుతున్నాం. వీటితో జలమండలికి భారంగా మారిన కరెంట్ బిల్లులు విషయంలో తగిన చర్యలు తీసుకుంటాం. చెరువులు, నాలాల అక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తాం. కిర్లోస్కర్ నివేదిక ఆధారంగా నాలాల అక్రమణలపై తిరిగి సర్వే చేశాం. బఫర్‌జోన్ కాకుండా వెలిసిన 12వేల అక్రమణలను గుర్తించాం. వీరి విషయంలో మానవతా దృక్పథంలో వీరికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఈ అక్రమణకు కూల్చే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 185 చెరువులను మిని ట్యాంక్ బండ్‌లా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

జలమండలికి అభినందనలు..


ఎర్రటి ఎండల్లోనూ ప్రజలకు కొరతలేకుండా మంచినీటిని అందించాలన్న సదుదేశ్యంతో సీఎం కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తిని, పిలుపును అందుకుని అహర్నిశలు శ్రమించి భగీరథ ఫలాలు అందించిన జలమండలి ఎండీ దానకిశోర్, ఆయన బృందానికి అభినందనలు. ప్రభుత్వాలు ఏం అనుకున్నా? మంత్రులు ఏం చెప్పినా? అల్టిమేట్‌గా వర్క్ జరగాలని అనుకున్నప్పుడు ప్రజలకు మేలు చేయాలన్న తలంపుతో అధికారులు పనిచేసినప్పుడే రికార్డు సమయంలో పనులు పూర్తి చేస్తారు. రూ. 1900కోట్ల ప్రాజెక్టును 11 నెలలకు ముందుగానే పూర్తి చేసిన ఘనత జలమండలిదే.

లో ప్రెషర్‌కు చెల్లుచీటి


గతంలో ఎండాకాలం వచ్చిందంటే లో ప్రెషర్‌తో ఇబ్బంద పడేవాళ్లం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు రిజర్వాయర్ల ప్రారంభంతో నీటికి సమస్య ఉండదు. టీఆర్‌ఎస్ హామీలు నిలబెట్టుకుంటోంది.
- చంద్రకాంత, స్థానిక మహిళ, 4వ ఫేజ్, కేపీహెచ్‌బీకాలనీ

వేసవిలోనీటి కొరత లేదు..


వేసవి కాలం వస్తే నీటి కష్టాలు వచ్చేవి, గత 20 ఏండ్లుగా కాలనీలో నివసిస్తున్నాం. ప్రతి ఎండాకాలంలో నీటి కోసం అల్లాడాల్సి వచ్చేది. ఈ ఎండాకాలంలో నీటి కష్టాలు పోయి సరిపడినంత తాగునీరు సరఫరా కావడం గొప్ప విషయం.. ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు ఊహించలేదు.
-ధనలక్ష్మి, స్థానిక మహిళ, 4వ ఫేజ్, కేపీహెచ్‌బీకాలనీ

రాత్రి వేళలో జాగరణ తప్పేది కాదు


కాలనీలో ఏ రాత్రి నీటి సరఫరా చేస్తారోనని జాగారం చేయాల్సి వచ్చేది. రాత్రుళ్లు మేలుకోకుంటే నీరు దొరకక పోయేది. దీంతో మరల నీటి సరఫరా చేసే వరకు నీటి కష్టాలను ఎదుర్కోవలసి వచ్చేది. పగలు పనులు, రాత్రుళ్లు నీటి కోసం జాగారం చేయాల్సి వచ్చేది. నేటితో కాలనీలో సరిపడ నీటి సరఫరా అందుతుందని తెలిసి కాలనీ వాసులంతా సంతోషంగా ఉన్నారు.
-జ్యోతి జ్యోయెల్, స్థానిక మహిళ, కేపీహెచ్‌బీకాలనీ

కూలి చేసుకునే ప్రజలకు ఎంతో ఉపయోగకరం


కేపీహెచ్‌బీకాలనీలో కూలి చేసుకునే ప్రజలే ఎక్కువగా నివాసం ఉంటున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ నివసిస్తున్న వారికి నీటిని కొనుక్కునే స్థోమత ఉండదు. జలమండలి సరఫరా చేసే తాగునీటి మీదే ఆధారపడి జీవిస్తున్నాం. కొత్త రిజర్వాయర్ల నుంచి నీళ్లు వస్తాయని తెలవడంతో సంతోషిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వం పనితీరు బాగుంది.
-రమాదేవి, స్థానిక మహిళ, 7వ ఫేజ్, కేపీహెచ్‌బీకాలనీ

తాగునీటి కష్టాలుండవు


25 ఏండ్లుగా కాలనీలో తాగునీటి కష్టాలను ఎదురుకుంటున్నాం, గతంలో ప్రభుత్వాలు, నాయకులు హామీలు ఇచ్చారే తప్ప నీటి కష్టాలు తీర్చలేదు, ఎమ్మెల్యే కృష్ణారావు చొరవతో కేపీహెచ్‌బీకాలనీ 4వ ఫేజ్‌లో నీటి కష్టాలు తీరనున్నాయి. ప్రభుత్వం నిర్మించిన రిజర్వాయర్ అందుబాటులోకి రావడం సంతోషకరం.
-రవి చంద్రకళ, స్థానిక మహిళ, 4వ ఫేజ్, కేపీహెచ్‌బీ

ఆనందంగా ఉంది


తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం ఆనందంగా ఉంది. ప్రజల మంచినీటి ఇబ్బందులు గుర్తించి ప్రభుత్వం స్పందించి పెద్ద ఎత్తున ప్రాంతాల వారీగా భారీ రిజర్వాయర్లను నిర్మించి అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామం. -నిర్మల, గోపన్‌పల్లి

రిజర్వాయర్లు.. మా అదృష్టం


గ్రేటర్ పరిధిలో మొత్తం 56 రిజర్వాయర్లకుగాను శేరిలింగంపల్లిలోనే ఎక్కువ ఏర్పాటు చేయడం మా అదృష్టం. గతంలో ఎన్నడూ లేని విధంగా మా నియోజకవర్గంలో తాగునీటిపై దృష్టిపెట్టిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వచ్చే ఏడాది ప్రారంభం కావలసిన రిజర్వాయర్లను పట్టుబట్టి ఈ ఏడాదే పూర్తి చేయించిన ఎమ్మెల్యే గాంధీకి రుణపడి ఉంటాం.
-చంద్రిక ప్రసాద్ గౌడ్, మయూరీనగర్

మహిళల కష్టాలను గుర్తించిన ఏకైక సీఎం కేసీఆర్


కేసీఆర్ సార్ ఇంటింటికి నీళ్లిస్తా అని మాటిచ్చినప్పుడు ఇది అయ్యే పనేనా అనుకున్నాం. కానీ మిషన్ భగీరథ పేరుకు తగ్గట్టుగానే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి నేడు ప్రతీ గడపకు తాగునీరు అందించే పరిస్థితులను కల్పించడం ఆయనలోని పట్టుదలకు నిదర్శనం. ఆడపడుచుల కష్టాలను గుర్తెరిగిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. మహిళాలోకం ఆయనకు రుణపడి ఉంటుంది.
-రోజా కలిదిండి, జేపీఎన్ నగర్

ఇకపై బిందెలతో ధర్నాలు చేయాల్సిన పనిలేదు


గత ప్రభుత్వాలన్నీ తాగునీటి విషయంలో వాగ్దానాలు చేసి చేతులెత్తేసేవి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఇంటింటికి తాగునీరు ఇస్తున్నారు. వచ్చే ఏడాది పూర్తవుతాయనుకున్న రిజర్వాయర్లను సంవత్సరం ముందే ప్రారంభించడం సంతోషకరం. ఇకపై రోడ్లపై బిందెలు పట్టుకుని ధర్నాలు చేయాల్సిన పనేలేదు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైంది.
-రజియా బేగం, సుభాష్ చంద్రబోస్ నగర్

షెడ్యూల్ కంటే ఏడాది ముందే పనులు పూర్తి చేశాం


మియాపూర్ హుడా మయూరీనగర్ కాలనీలో నిర్మించతలపెట్టిన మంచినీటి రిజర్వాయర్ షెడ్యూల్ ప్రకారం 2018 మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. జలమండలి ఎండి దానకిషోర్ ఆదేశాల మేరకు 11 నెలల్లోనే నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇందుకు సహకరించిన కాలనీ వాసులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు.
-నాగప్రియ, మేనేజర్, మియాపూర్ సెక్షన్, జలమండలి

కేసీఆర్‌కు రుణపడి ఉంటాం


గతంలో ఎన్నడూ లేని విధంగా మంచినీటి సమస్య పరిష్కారం కోసం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేయడం శుభపరిణామం. మా కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లకు రుణపడి ఉంటాం. బడుగుల జీవితాలు, కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం మా అదృష్టం.
-ఇందిరా, గోపన్‌పల్లి

పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ముఖ్యంగా అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుతం టీఆర్‌ఏస్ ప్రభుత్వం. పేద, మధ్యతరగతి వర్గాల వారి అభివృద్దికి తెలంగాణ రాష్ట్రం అహర్నిషలు కృషి చేస్తోందని చెప్పడానికి ఇది నిదర్శనం.
-అంజమ్మ, స్థానికురాలు

ఇచ్చిన మాట నిలబెట్టుకుంది


తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మంచినీటి సమస్య లేకుండా, ఖాళీ బిందెలు కనపడకుండా చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఆ దిశగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇంటింటికీ రూ.1 నల్లా కనెక్షన్ ఇచ్చి పేదల తాగునీటి కష్టాలు తీరుస్తానని చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారు.
-సౌజన్య, గచ్చిబౌలి డివిజన్

705
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...