రక్షణే శ్రీరామ రక్ష


Fri,April 21, 2017 12:41 AM

-వడదెబ్బతగలితే నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు
-శరీరంలో ఎంజైమ్స్ దెబ్బతినే ప్రమాదం
-కిడ్నీలు, మెదడు, కాలేయంపై ప్రభావం

సిటీబ్యూరో: ఎండలో బయటకు వెళ్తున్నారా జర భద్రం.... ఈ సంవత్సరం భానుడు నిప్పులు కురిపిస్తుండడంతో వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రమాదం పొంచి ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. గతేడాది వడదెబ్బ వల్ల గ్రేటర్‌లో 15మంది మృతిచెందగా ఈ సంవత్సరం నలుగురు దుర్మరణం చెందారు. రానున్న మేలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నందున బయట తిరిగే వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లోనే ఎండలు రికార్డు స్థాయిలో 43డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఈసారి ఉష్ణోగ్రతల్లో భారీ హెచ్చుతగ్గులు ఉంటాయని వాతావరణశాఖ ఇన్‌చార్జి డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. ఈ నెలలోనే ఉష్ణోగ్రతలు 44డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అంతే కాకుండా మే నెలలో 45డిగ్రీలు దాటవచ్చని చెప్పారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల వాతావరణం వేడెక్కి గాలిలోని తేమ శాతం తగ్గిపోతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఫలితంగా వడగాలులు(వేడిగాలులు) వీచే అవకాశం ఎక్కువగా ఉందని అటు వాతావరణశాఖ అధికారులు ఇటు వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో నగరంలో వడ దెబ్బ బాధితుల సంఖ్య కూడా పెరుగుతోందని వైద్యులు తెలిపారు.

అధిక ఉష్ణోగ్రతకు గురైతే....


మనిషి శరీర ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్. అంటే శరీరం 32 డిగ్రీల ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకుంటుంది. అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత మనిషిపై పడినప్పుడు రకరకాల వ్యాధులకు గురవుతారు. పలు సందర్భాల్లో మృత్యువాత కూడా పడతారు. అయితే సూర్యరశ్మివల్ల గాలి వేడెక్కి అందులోని తేమ శాతం తగ్గిపోతుందని, దీంతో అది వడగాలిగా మారిపోతుందని ఉస్మానియా వైద్యులు తెలిపారు. ఈ వేడిగాలి వల్ల అస్వస్థతకు గురవడాన్నే వడదెబ్బ అంటారని వివరించారు. సాధారణంగా 35డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగత్ర ఉన్నప్పుడు వడదెబ్బ సమస్య ఏర్పడుతుంది. 38-40డిగ్రీలు అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ వడదెబ్బ ప్రాణాంతకంగా మారుతుంది. అధిక ఉష్ణోగ్రతకు గురైన వ్యక్తి ఐదు రోజుల్లోనే మృతిచెందే అవకాశాలున్నట్లు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.

వడదెబ్బ వల్ల శరీరంలో జరిగే జీవక్రియలు


వడదెబ్బ అంటే కేవలం ఎండలో తిరిగే వారికే కాదు వేడి గాడ్పుతో కూడా శరీరంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. శరీరంలోని ఉష్ణోగ్రత 32డిగ్రీల సెల్సియస్ దాటి పెరిగితే దాన్ని హైపర్ థెర్మీ అంటారు. హైపర్ థెర్మీతో శరీరంలోని థెర్మోరెగులేషన్ దెబ్బతింటుంది. అంటే శరీరంలోని ఉష్ణోగ్రతలు అదుపు తప్పుతాయి. దీంతో శరీరంలోని ఎంజాయిమ్స్ (జీవరసాయనాలు) వేడెక్కి పలుచబడతాయి. జీవరసాయనాలు పలుచబడడంతో శరీరంలోని జీవకణాలు(సెల్స్) సక్రమంగా పనిచేయవు. జీవకణాలద్వా వచ్చే వేడితో కండరాలు వ్యాకోచిస్తాయి. దీంతో ఒళ్లునొప్పులు ఏర్పడి, శరీరంలోని నీరంతా ఆవిరై, శక్తిహీనులవుతారు. జీవకణాలు, కండరాలు దెబ్బతినడంతో మెదడు, గుండెకు రక్తప్రసరణ నిలిచిపోతుంది. అంతే కాకుండా కిడ్నీలు పనిచేయడం ఆగిపోతాయి. దీంతో మనిషి శరీరంలోని అవయవాలన్నీ పనిచేయడం మానేస్తాయి. చివరకు మనిషి మృత్యువాత పడతాడని ఉస్మానియా జనరల్ మెడిసిన్ వైద్యనిపుణులు డా.శ్రీనివాస్ తెలిపారు.

జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు: డాక్టర్ శ్రీనివాస్


ప్రతినిత్యం వివిధ పనులకోసం బయటకు వెళ్లే వారికి ఎండ నుంచి తప్పించుకోవడం కొంత కష్టమే అయినా కొన్ని జాగ్రతలు తీసుకుంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చని ఉస్మానియా వైద్యశాల ఫిజీషియన్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. వడదెబ్బ గురైన వారిని, ఎండలో తిరిగి మూర్చపోయిన వారిని వెంటనే చల్లటి ప్రదేశానికి తరలించాలని సూచించారు. ముఖంపై చల్ల నీటిని చల్లి, స్పృహ వచ్చిన తరువాత నెమ్మదిగా కొంత చల్లటి మంచినీరు తాగించాలి. ఐస్(బరఫ్)ముక్కలతో చంకలు, గజ్జల్లో తుడవడం వల్ల శరీర ఉష్ణోగ్రత త్వరగా తగ్గుతుందన్నారు. వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలని సూచించారు. కొబ్బరి నీళ్లు, పళ్లరసాలు, ఉప్పు, చక్కెర కలిపిన నీటిని తాగించాలని సూచించారు.

266
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...