రెండు వేలిస్తేనే టీసీ..!


Tue,March 21, 2017 01:59 AM

ఆదిబట్ల: జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలనే ఆశయం ఆమెది. దీని కోసం ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి నగరానికి వచ్చింది. అడిగినంత ఫీజులు చెల్లించి కష్టపడి బీటెక్ పూర్తి చేసింది. అంతా సవ్యంగా సాగిందని, వరంగల్‌కు వెళ్లి ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్న సద రు యువతికి టీసీ ఇవ్వకుండా చుక్కలు చూపిస్తోంది ఇబ్రహీంపట్నం మంగల్‌పల్లిలోని భారత్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం. జేఎన్‌టీయూ నిబంధనలతో తమకు సంబంధం లేదని, తమ రూల్స్ తమకు ఉంటాయని, టీసీ కావాలంటే రెండు వేలు ముట్ట జెప్పాల్సిందేనంటూ మొండికేస్తున్నారు. వారం రోజులుగా రేపు మాపు అంటూ కళాశాల చుట్టూ తిప్పించుకుంటుండడంతో ఏం చేయాలో తెలియని సదరు బాధితురాలు నమస్తే తెలంగాణతో తన గోడును వెల్లబోసుకుంది.

క్రమం తప్పకుండా ఫీజుల చెల్లింపు


మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన భీమిని రమ్య ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలోని భారత్ ఇంజినీరింగ్ కళాశాలో 2012లో కన్వీనర్ కోటా కింద ఈసీఈ గ్రూప్‌లో చేరి 2015లో ఉత్తీర్ణత సాధించింది. క్రమం తప్పకుండా ఫీజులన్నీ చెల్లించింది. 2016లో సర్టిఫికెట్లన్నీ తీసుకున్నా నో డ్యూ ఫాంపై కొన్ని డిపార్ట్‌మెంట్ల ఇన్‌చార్జీల సంతకాలు కాని కారణంగా ఎస్సెస్సీ మెమో, డిప్లొమా సర్టిఫికెట్, టీసీ తీసుకెళ్లలేదు.

తర్వాత ఉద్యోగం సంపాదించాలని శిక్షణ తీసుకోవడానికి వరంగల్‌కు వెళ్లింది. వారం క్రితం వీలు చూసుకుని నగరానికి వచ్చిన రమ్య టీసీ కోసం రూ.100ను ఆన్‌లైన్‌లో చెల్లించింది. తర్వాత కళాశాలకు వెళ్లి నో డ్యూ ఫాంపై మిగతా డిపార్ట్‌మెంట్ల సంతకాలు తీసుకుంది. అది చూపించి మిగతా సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరింది. దీంతో ఇంకా రెండు వేలు కట్టాలని, అలా అయితేనే టీసీ ఇస్తామని చెప్పారు. దీంతో అవాక్కయిన రమ్య తాను మొత్తం డబ్బులు కట్టానని, నో డ్యూ సర్టిఫికెట్ కూడా తన చేతిలోనే ఉందని, ఆన్‌లైన్‌లో టీసీ కోసం రూ.100 కట్టినట్టు కూడా చెప్పింది.

అవన్నీ తమకు తెలియవని, జేఎన్‌టీయూ నిబం ధనలతో తమకు సం బంధం లేదని, తమ మేనేజ్‌మెంట్ నిర్ణయమే తమకు శిరోధార్యమన్నారు. మరి రశీదు ఇస్తారా అని అడిగితే.. అలాంటివి ఏవీ ఉండవని సమాధానమిచ్చారు. టీసీ ఇవ్వకుండా ఎస్సెస్సీ మెమో, డిప్లొమా సర్టిఫికెట్ మాత్రమే ఇచ్చారు. ఏమైనా ఉంటే చైర్మన్‌తో మాట్లాడుకోమని ఉచి త సలహా ఇచ్చారు. చైర్మన్‌ను కలిసి చెప్పు కోవాలని వారం రోజులుగా వరంగల్ నుంచి కళాశాలకు వస్తూనే ఉంది. అయితే రేపు..మాపు అంటూ సమాధానం చెబుతూ దాటవేస్తున్నారు. చైర్మన్ ఎక్కడ ఉం టారు...ఎప్పుడు వస్తారు అని అడిగితే ఆమెకు సమాధానం చెప్పేవారే లేరు. దీంతో సోమవారం మధ్యా హ్నం వరకూ వేచి చూసి తిరిగి వరంగల్‌కు వెళ్లిపోయింది.

మాట్లాడేది లేదు..రూ.2 వేలు కట్టాల్సిందే..


అది మేనేజ్‌మెంట్ నిర్ణయం : ప్రిన్సిపాల్ వెంకట్‌రెడ్డి
ఏమ్మా..టీసీ ఎందుకు తీసుకోలేదు. నీ టీసీకి కాపలా కాయాలా? నీ సర్టిఫికెట్లకు భద్రత కల్పించాలా అంటూ టీసీ అడిగిన రమ్యను ప్రిన్సిపాల్ వెంకట్‌రెడ్డి నిష్టూరాలాడారు. పరిస్థితి వివరించి చెప్పినా వినిపించుకోలేదు. ఇప్పుడు టీసీ కావాలంటే రూ.2000 కట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. అది మేనేజ్‌మంట్ నిర్ణయమని, ఇంకా మాట్లాడాల్సింది ఏమీ లేదని, ఏమైనా ఉంటే చైర్మన్‌తో మాట్లాడుకోమని చెప్పారు. సార్ చైర్మన్ గారి కోసం కాలేజీకి వస్తూనే ఉన్నా. ఆయన కలవడం లేదని రమ్య సమాధానం చెప్పగా ఇన్ని రోజులు ఆగారుగా ఇంకొన్ని రోజులు ఆగండి అర్జంట్ ఏముందని బయటకు పంపించి వేశారు.

అందుబాటులో లేని చైర్మన్


రమ్య టీసీ విషయంలో భారత్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ వేణుగోపాల్ రెడ్డిని వివరణ కోరేందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఎత్తలేదు. కళాశాల అధికారులతో మాట్లాడించాలని ప్రయత్నించిన అందుబాటులోకి రాలేదు. మెసేజ్ చేసినా స్పందన లేదు.

500
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS