మలక్‌పేట మార్కెట్‌కు పోటెత్తుతున్న మిర్చి


Tue,March 21, 2017 01:58 AM

మలక్‌పేట : మలక్‌పేట మార్కెట్‌కు రికార్డుస్థాయిలో మిర్చి దిగుమతి అవుతుంది... ఫలితంగా ధరలు పడిపోయా యి.. దీంతో తమకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మిర్చి రైతులు మార్కెట్‌లో ఆందోళనకు దిగారు. మామూలుగా మార్కెట్‌కు రోజుకు 12 వేల నుంచి 15 వేల బస్తాల వరకు వచ్చే మిర్చి... మార్చి నుంచి రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. సోమవారం ఏకంగా 30 వేల బస్తాల మిర్చి రావడంతో ధరలు పడిపోయాయి. దీంతో తమకు గిట్టుబాటు ధర కల్పించాలని నినాదాలు చేస్తూ మార్కెట్లో ర్యాలీ నిర్వహించారు.

ఆ తర్వాత మార్కెట్ ప్రధానద్వారం వద్ద విజయవాడ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. సమాచారాన్ని అందుకున్న చాదర్‌ఘాట్ ఇన్‌స్పెక్టర్ సత్తయ్య విషయాన్ని సుల్తాన్‌బజార్ ఏసీపీ చక్రవర్తికి తెలిపారు. ఏసీపీ జోన్ పరిధిలోని సుల్తాన్‌బజార్, అఫ్జల్‌గంజ్ సీఐలు శంకర్‌రాజ్, అంజయ్యతోపాటు మలక్‌పేట ఇన్‌స్పెక్టర్ గంగారెడ్డి, మలక్‌పేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐలను, సిబ్బందిని రప్పించి ఆందోళనను విరమింపజేసేందుకు యత్నించారు.

ఇంతలో అక్కడికి చేరుకున్న మార్కెట్ చైర్మన్ షాహిన్ అఫ్రోజ్, డైరెక్టర్లు రాధ, దుగ్గు జగదీష్‌కుమార్, ఎస్‌జీఎస్ మల్లేశంలు సమస్యలు ఉంటే చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, రైతులు ఆందోళనకు గురికావాల్సిన అవసరంలేదని, కార్యాలయంలో మాట్లాడి పరిష్కరించుకుందామని చెప్పడంతో ఆందోళనను విరమించారు. అనంతరం మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ షాహిన్ అఫ్రోజ్ మార్కెట్ ఎస్‌జీఎస్ మల్లేశం, రైతులు, ట్రేడర్లతో సమావేశాన్ని ఏర్పాటుచేసి చర్చించారు.

ఈ సందర్భంగా రైతులు గిట్టుబాటు ధరలు, తాము ఎదుర్కొంటున్న సమస్యలను మార్కెట్ అధికారులు, చైర్మన్‌కు విన్నవించారు. తాము మహబూబ్‌నగర్, గద్వాల, ఖమ్మం, కర్నూలు, గుంటూ రు, మాచెర్ల ప్రాంతాలనుంచి మిర్చిని మార్కెట్‌కు తెస్తే ధరలు పడిపోయాయని, కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు చిన్నారెడ్డి, నర్సింహులు ఆవేదనను వ్యక్తం చేశారు.

గతేడాది రూ.13-15వేలు ధర పలికిన మిర్చి ఈ ఏడాది రూ.7-8వేలు కూడా లేకపోవడంతో తాము తీవ్రంగా నష్ట్టపోవాల్సి వస్తుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ప్రభుత్వం మార్క్‌ఫెడ్, నాఫెడ్‌ద్వారా కొనుగోలు చేయాలని హైదరాబాద్ చిల్లీ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ సాయ భువనేశ్వరీ, డైరెక్టర్లు సీహెచ్ రాధ, దుగ్గు జగదీష్‌కుమార్, మార్కెట్ గ్రేడ్-2 కార్యదర్శి సాంబయ్య, సూపర్‌వైజర్లు మురళీ తదితరులు పాల్గొన్నారు.

దిగుబడులు రెట్టింపు కావడంతోనే ధరలు తగ్గాయి


ఈ ఏడాది మిర్చి దిగుబడులు రెట్టింపు అవడం, మార్కెట్‌కు రోజుకు రికార్డుస్థాయిలో మిర్చి దిగుమతి అవుతుండటంతో ధరలు తగ్గాయని మార్కెట్‌కమిటీ చైర్మన్ షాహిన్ అఫ్రోజ్ తెలిపారు. మరోవైపు తెలుగురాష్ర్టాల్లో అత్యంత పెద్దదైన గుంటూరు మిర్చి మార్కెట్‌కు కూడా రోజుకు లక్ష బస్తాల మిర్చి వస్తుంది. ఓపెన్ యాక్షన్‌లో అమ్మకాలు జరిపినా ధరలు అంతంత మాత్రంగానే ఉండడంతో మిర్చిని మలక్‌పేట మార్కెట్‌కు తెస్తున్నారు. దాంతో మార్కెట్‌కు రోజు 30 వేల బస్తాలు వస్తుంది.

మరోవైపు కమీషన్ ఏజెంట్లు, ట్రేడర్లు కొనుగోళ్లు చేసిన సరుకు సకాలంలో అమ్మకపోవడంతో కొత్త సరుకును కొనేందుకు ఆసక్తిని చూపటంలేదు. ఫలితంగా ధరలు తగ్గిపోతున్నాయ్నరు. రైతుల సమస్యలను మార్కెటింగ్ శాఖమంత్రి తన్నీరు హరీష్‌రావు దృష్టికి, మార్కెట్ ఓఎస్‌డీ, డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

ఎగుమతులు నిలిచిపోయాయి : మల్లేశం


గతేడాది దిగుమతులు తక్కువగా ఉన్నప్పటికీ పొరుగు రాష్ర్టాలకు, దేశాలకు ఎగుమతులు జరిగేవి. కానీ ఈ ఏడాది అక్కడ కూడా సరిపడ పంటలు పండడంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయని మార్కెట్ ఉప సంచాలకులు ఇ.మల్లేశం తెలిపారు. మరోవైపు రెండు తెలుగు రాష్ర్టాల్లో పంట దిగుబడులు రెట్టింపు కావడంతో ధరలు తగ్గిపోయాయన్నారు. సోమవారం మార్కెట్లో సూపర్ 10 రకం మిర్చి రూ.4.500-5,200లకు అమ్మగా, వైష్ణవి రూ.4000-5000లు, 334 రకం రూ.4000-4,500, సి5 రకం రూ.4200-4500లకు అమ్మినట్లు తెలిపారు.

409
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS