రోగాన్ని కాదు.. రోగిని అర్థం చేసుకోవాలి


Tue,March 21, 2017 01:58 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ;కార్పొరేట్ దవాఖానాలలో సీనియర్ వైద్యులు చికిత్స చేసినా తగ్గని జబ్బు, బస్తీలో ఉండే వైద్యుడి చేయి తగలగానే మాయమవుతుంది. దానికి కారణం మందులు, చికిత్స కంటే, వైద్యుడు రోగితో వ్యవహరించే తీరే కారణం. రోగాన్ని అర్థం చేసుకోవడం, దానికి కారణాలు అంచనా వేయడం, అవసరమైన చికిత్స అందించడం, రోగికి విశ్వాసాన్ని కలిగించడం వల్లే అది సాధ్యమవుతుంది. ఇవాల్ట్టితరం వైద్యుల్లో చాలామందిలో అలాంటి నైపుణ్యం కనిపించపోవడం వల్ల యాంత్రికంగా వైద్యచికిత్స చేస్తున్నారు. ఈ వెలితిని భర్తీ చేసేందుకు ముందుకు వచ్చారు డాక్టర్ రవికుమార్. మిషన్ పేషెంట్ ఫ్రెండ్లీ డాక్టర్‌లో భాగంగా యువవైద్యులకు ఉచిత సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ అందిస్తున్నారు.

ప్రముఖ ఆంకాలజిస్ట్, ఫొటోగ్రాఫర్, ఆర్టిస్ట్, క్లాసికల్ మ్యుజిషియన్ డాక్టర్ రవికుమార్ వైద్య వృత్తిలో నైపుణ్యాలను పెంపొందించేందుకు యువ వైద్యులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. వైద్యవృత్తిలో 62 సంవత్సరాల పాటు సేవలందించిన ఆయన తండ్రి డాక్టర్ రాంప్రసాద్ స్మృతిలో ఈ శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఆ విశేషాలను నమస్తే తెలంగాణతో పంచుకున్న డాక్టర్ రవికుమార్ సాంకేతికత మాత్రమే సర్వస్వం కాదు.. జీపీఎస్ అపెండెక్స్‌ని కనిపెట్టలేదు. రోగాన్ని మాత్రమే కాదు... రోగి మానసిక స్థితిని కూడా అర్థం చేసు కోవాలి. అప్పుడు మాత్రమే వైద్య వృత్తిలో సత్ఫలితాలు సాధించగలుతాం అంటారు.

పేషెంట్ సైకాలజీ...


వైద్యం అనేది యధాలాపంగా చేసేది కాదు. రోగం తో పాటు రోగి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది. కొన్నిసార్లు చిన్న విషయానికే కొంత మంది ఎక్కువ ఆందోళన చెందుతుంటారు. అలాం టి వారిని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. పేషెంట్ ఫ్రెండ్లీ డాక్టర్లుగా మారినప్పుడు మాత్రమే రోగి విశ్వాసాన్ని పొందగలుతాం. పేషెంట్ సైకాలజీని అర్థం చేసుకోవాలంటే, వాళ్ల లాంగ్వేజ్ దగ్గరి నుంచి ప్రతి విషయాన్ని గమనించాలి. అనేక విషయాల్ని వర్క్‌షాప్‌లో నిపుణులతో చెప్పిస్తున్నాం. ప్రిస్కిప్షన్ ఎలా రాయాలి. వాటిని పేషెంట్‌కి ఎలా అర్థం చేయించాలి.. వంటి అంశాలపై కూడా అవగాహన కల్పిస్తున్నాం.

న్యాయపరమైన అంశాలు


ప్రతి వైద్యుడు క్లీనికల్ రీసెర్చ్ గురించి తెలుసుకోవలసి ఉంటుంది. రీసెర్చ్ గైడ్‌లైన్స్, ఎథిక్స్ గురించి అవగాహన కలిగి ఉండాలి. అంతేకాదు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల గురించి తెలిసి ఉండాలి. కొన్నిసార్లు పేషెంట్‌తో, పేషెంట్ సంబంధీకులతో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల చిక్కుల్లో ఇరుక్కోవలసి వస్తుంది. సరైన డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవడం ద్వారా అలాంటి వాటిని ఎదుర్కోవచ్చు. ప్రొఫెషనల్ ఇండిమ్నెటీ ఇన్య్సూరెన్స్ కలిగి ఉండడం వల్ల ఏదైనా సందర్భంలో నష్ట పరిహారం లాంటి చెల్లించాల్సి వచ్చినా ఇబ్బంది ఉండదు. మా శిక్షణా శిబిరాల్లో ఇలాంటి విషయాలపై అవగాహన కల్పిస్తున్నాం.

విదేశీయులతో ఎలా వ్యవహరించాలి...


నగరానికి వైద్యం కోసం వస్తున్న విదేశీ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి భాష, సంస్కృతులు భిన్నంగా ఉంటాయి. వాళ్లతో ఎలా వ్యవహరించాలి? వారిని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా వారికి అర్థం చేయించాలనే విషయంలో స్పష్టత అవసరం. ఇలాంటి అన్ని కోణాల్లో వైద్యులకు శిక్షణ ఇవ్వడం ద్వారా మంచి వైద్యులను తయారు చేయగలం. గత నెలలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో 200 కు పైగా వైద్యులు పాల్గొన్నారు. ప్రతి మూడు నెలలకోసారి ఇలాంటి వర్క్‌షాప్స్ ద్వారా వైద్య వృత్తిలో విలువలతో పాటు, నైపుణ్యాన్ని పెంచగలుగుతాం.

413
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS