యుద్ధ ప్రాతిపదికన సీతారామా పనులు


Sun,November 17, 2019 12:16 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి పాలకుల కాలంలో తెలంగాణలో సాగునీటి రంగం కుదేలైంది. రైతన్నకు సరిపడా సాగునీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రబీ, ఖరీఫ్‌లో ఏదో ఒక దానితో సరిపెట్టుకొని ఉన్న నీళ్లతోనే వ్యవసాయం చేసేది. స్వరాష్ట్ర పాలన పగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్ రైతు బాగుంటే దేశం బాగుంటుందని నమ్మి రైతుకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రచించారు. సుమారు రూ.80వేలకు పైగా కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు నడుంబిగించారు. ఇటీవల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. అదే విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లా రైతుల ఆయకట్టును స్థిరీకరించేందుకు గోదావరి నదిపై సీతారామా ప్రాజెక్టును శరవేగంగా నిర్మిస్తున్నారు. సుమారు 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని సీతారామా నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. వర్షాకాలం కారణంగా కొంత నెమ్మదించిన పనులు వర్షాకాలం పూర్తి కావడంతో తిరిగి పనులు ఊపందుకున్నాయి. ఎప్పటికప్పుడు పనులను సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలిస్తూ అధికారులకు సూచనలు చేస్తూ పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు. నేడు స్వయంగా స్మితా సబర్వాల్ పనులను పర్యవేక్షించేందుకు జిల్లాకు రానున్నారు.


యుద్ధ ప్రాతిపదికన పనులు 2016 సంవత్సరంలో స్వయంగా సీఎం కేసీఆర్ జిల్లాలోని ఇల్లెందు నియోజకవర్గంలోని రోళ్లపాడు రిజర్వాయర్ వద్ద భూమిపూజ చేసి సీతారామా ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి సాధ్యమైనంత త్వరలో రైతులకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకొని పూర్తి చేయాలని ప్రారంభోత్సవం నాడే సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. అప్పటి నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ స్వీయ పర్యవేక్షణలో పనులు శరవేగంగా ప్రణాళికా బద్ధంగా కొనసాగుతూ వస్తున్నాయి. భూ సేకరణ, అటవీ, పర్యావరణ అనుమతుల జాప్యం కారణంగా కొన్ని రోజులు నెమ్మదించిన పనులు అనుమతుల రాకతో జోరందుకున్నాయి.

పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం
జిల్లాలోని పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సుమారు రూ.13వేల కోట్లతో నిర్మాణం చేపట్టి శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. నిర్మాణ పర్యవేక్షణ పనులను సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ నిత్యం పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేసేలా ఆదేశాలిస్తున్నారు. 2020 జనవరి నాటికి తొలిదశ పనులు పూర్తి చేసేందుకు అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి పాల్వంచ కిన్నెరసాని రిజర్వాయర్ వరకు నిర్మిస్తున్న గ్రావిటీ కెనాల్ నిర్మాణంలో భాగంగా కాలువలపై వంతెన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆక్విడక్డ్‌లే కాకుండాలో మణుగూరు, కొత్తగూడెం ప్రధాన రహదారులపై భారీ వంతెనల నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా అధికారులు శ్రమిస్తున్నారు. ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతూ వచ్చే ఏడాది జనవరిలో తొలిదశ పూర్తి చేసేలా పనులు చేపడుతున్నారు. డిసెంబర్ చివరి నాటికి బీజీ కొత్తూర్ మొదటి దశ పంప్‌హౌజ్‌కు సంబంధించి మోటార్లు సిద్ధంగా ఉన్నాయని, వాటిని బిగించి డ్రైరన్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

సీతారామాతో ఉభయ జిల్లాలు సస్యశ్యామలం..
తెలంగాణ సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన జల ప్రాజెక్టులలో సీతారామా ప్రాజెక్టు ఒకటి. ఉభయ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలు రైతులకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించనున్నారు. రూ.13,000 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం రెండు ఫేజ్‌లుగా నిర్మించబోతున్నారు. మొదటి ఫేజ్‌లో 6.74లక్షల ఎకరాలకు, రెండవ ఫేజ్‌లో 3.26లక్షల ఎకరాలకు సీతారామా ద్వారా రైతులకు నీటిని అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఆనాడు సర్ ఆర్థర్ కాటన్ అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద గొదావరిపై నిర్మించిన దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని రిజర్వాయర్లు, చెరువులు నింపనున్నారు. ఈ ప్రక్రియలో నాలుగు పంప్ హౌజ్‌లను నిర్మించనున్నారు. ఒక్కో పంప్ హౌజ్ లో 35 మీటర్ల లోతునుంచి నీటిని లిప్ట్ చేసి పంపనున్నారు.

మొదటి ఫేజ్‌లో అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద పంప్‌హౌజ్ నిర్మిస్తున్నారు. అక్కడి నుంచి ములకపల్లి మండలం వీకే రాఘవపురం, కమలాపురం వద్ద రెండు పంప్‌హౌజ్‌లను నిర్మిస్తున్నారు. కమలాపురం వద్ద నిర్మిస్తున్న పంప్‌హౌజ్‌లో 7 పంప్‌లను ఏర్పాటు చేసి 5 పంప్‌ల ద్వారా సింగరేణి మండలం చీమలపాడు, రోళ్లపాడు వద్దకు ప్రధాన కాలువ ద్వారా నీటిని పంపిస్తారు. చీమలపాడు వద్ద 21ఎల్ డిస్ట్రిబ్యూటరీ ఏర్పాటుచేసి అక్కడినుంచి పాలేరు రిజర్వాయర్‌కు గోదావరినీరు చేరేట్లు చేస్తున్నారు. కమలాపురం నుంచి మరో రెండు పంప్‌ల ద్వారా ప్రధాన కాలువ నుంచి దమ్మపేట, అశ్వారావుపేట, సత్తుపల్లి మండలాల్లోని బేతుపల్లి కెనాల్, వెంకమ్మ చెరువులకు నీరు సరఫరా చేయనున్నారు. అధికారులు తొలుత మొదటి ఫేజ్‌ను పూర్తి చేసి రెండవ ఫేజ్‌ను మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం అశ్వాపురం మండలంలోని కుమ్మరిగూడెం నుంచి బీజీ కొత్తూరు కెనాల్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అంతేకాక బీజీ కొత్తూరు వద్ద నిర్మిస్తున్న పంప్‌హౌజ్ పనులు సైతం శరవేగంగా కొనసాగుతున్నాయి.

నందికొండ: తెలంగాణలోని రెసిడెన్షియల్ పాఠశాలలు దేశానికే తలమాణికంగా నిలుస్తున్నాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ హిల్‌కాలనీ బీసీ గురుకుల పాఠశాల మైదానంలో ప్రారంభమైన మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనకబడిన తరగతరుల బీసీ గురుకుల పాఠశాలల ఉమ్మడి 10 జిల్లాల రాష్ట్రస్థాయి ఆటలపోటీలకు ముఖ్యఅతిథి హాజరయ్యారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనకబడిన తరగతుల బీసి గురుకుల పాఠశాల సంస్థల కార్యదర్శి మల్లయ్యభట్టులతో కలసి క్రీడాజ్యోతిని ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో రెండు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలో 963 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాల్లో ముందున్నారన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేజీ టూ పీజీ విద్య అందుతుందన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్నారని రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో నూతన పాఠశాల భవనం ఏర్పాటుతో పాటు మౌలిక వసతులను కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతుల బీసీ గురుకుల పాఠశాల సంస్థల కార్యదర్శి మల్లయ్యభట్టు, ఎంపీపీ అనురాధరెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ నందికొండ మున్సిపాలిటీ ఇన్‌చార్జ్ కర్న బ్రహ్మానందరెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్ ఇరిగి పెద్దులు, విజయేందర్‌రెడ్డి, ఎన్నెస్పీ ఈఈ యలమంద, తాహసీల్దార్ ప్రేమ్‌కుమార్, డీటీ శరత్‌చంద్ర, ఆర్‌సీఓ షేకినా, ప్రిన్సిపాల్ లక్ష్మయ్య, భాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు సుదీర్, బత్తుల సత్యనారాయణ, ఇర్ల రామకృష్ణ, సుందర్‌రెడ్డి, మోహన్, సత్యనారాయణ, పెద్దులు, కారంపుడి విష్ణుమూర్తి, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles