యథావిధిగా రోడ్డెక్కిన బస్సులు


Sun,November 17, 2019 12:15 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి , నమస్తే తెలంగాణ: టీఎస్ ఆర్టీసీ జాక్ నాయకులు తలపెట్టిన నిరవదిక సమ్మె ప్రభావం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతున్నప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం చేపట్టిన చర్యలతో సమ్మె తాలుకు ప్రభావం కనిపించలేదు. శనివారం 43వ రోజు ఆర్టీసీ జాక్ నాయకులు, డ్రైవర్లు, కండక్టర్లు సమ్మె కొనసాగించినప్పటికీ యథావిధిగా ఆర్టీసీ యాజమాన్యం బస్సులను ఆపరేట్ చేసింది. మొత్తంగా మూడు డిపోలో కలిపి డిపో, హైర్ బస్సులు 217 నడిపింది. కొత్తగూడెం డిపో పరిధిలో 42 డిపో, 21 హైర్ బస్సులు.. మణుగూరు డిపో పరిధిలో 52 డిపో, 20 హైర్ బస్సులు.., భద్రాచలం డిపో పరిధిలో 60 డిపో, 22 హైర్ బస్సులు నడిచాయి. మొత్తంగా మూడు డిపోల పరిధిలో 217 బస్సులు నడిచాయి.
అన్ని ప్రాంతాలకూ..
జిల్లావ్యాప్తంగా ఉన్న మూడు డిపోల పరిధిలో శనివారం ఆర్టీసీ బస్సులు యధావిధిగా తిరిగాయి. హైదరాబాద్, వరంగల్, ఖమ్మంతో పాటు ఆంధ్రాలోని విజయవాడ, గుంటూరు, అమలాపురం, రాజమండ్రి తదితర ప్రాంతాలకు కూడా బస్సు సర్వీసులను నడిపిస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు హైర్‌బస్సు సర్వీసులు కూడా అధిక సంఖ్యలో తిరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్టాండ్ ప్రాంగణాలు ప్రయాణికులతో నిండిపోతున్నాయి. వివాహాలు, గృహప్రవేశాలకు, ఇతర శుభకార్యాలకు వెళ్లే వారు సైతం ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇల్లెందు, మణుగూరు, ఖమ్మం, హైదరాబాద్, విజయవాడ, మిర్యాలగూడ తదితర ప్రాంతాలకు యథావిధిగా బస్సులు నడిపారు.


ఇబ్బందులు లేకుండా సాఫీగాసాగిన ప్రయాణాలు
జాక్ నాయకులు సమ్మెకు దిగుతామని ప్రకటించడంతో ప్రభుత్వం ముందస్తుగా చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలు సత్ఫలితాలను ఇచ్చింది. కార్మికులు సమ్మె చేసినప్పటికీ ప్రయాణికులు సమ్మె ప్రారంభం నుంచి ఎక్కడా ఇబ్బందిపడినట్లుగా కనిపించలేదు. పోలీస్, రవాణశాఖా సిబ్బంది, ఆర్టీసీ ఉన్నతాధికారుల సూచనలతో ముందస్తుగా నిర్ణయించిన రూట్లలో బస్సులను నడిపారు. బస్సు రూట్లను ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు చెబుతుండటంతో ఆయా బస్సులలో ప్రయాణించి సాఫీగా వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్నప్పటికీ ఎక్కడా ఏ చిన్న సంఘటన కూడా జరగకపోవడం పట్ల ఆర్టీసీ అధికారులపై ప్రయాణికులకు మరింత నమ్మకం పెరిగింది.

83
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles