జానపదం విందేసింది


Sun,November 17, 2019 12:14 AM

ఖమ్మం కల్చరల్: జానపదం చిందేసి విందు చేసింది... వనమే వేదికగా జానపద కళాకారుల ధూంధాంలు హోరెత్తించాయి.. కాలిగజ్జెల సవ్వడులే సంగీతభరితంగా, గొంగళ్లు పురివిప్పి నాట్యమాడాయి.. కంజరలు ఢమరుక నాదాలై ప్రతిధ్వనించాయి.. వెరసి జానపద కళాకారుల వన సమారాధన మహోత్సవం అట్టహాసంగా జరిగింది. నగర సమీపంలోని చెరుకూరి రామకోటి మామిడితోటలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కళా కుటుంబాల వన మహోత్సవం ఘనంగా జరిగింది. కళాకారుల కుటుంబాలు ఒక రోజు చెట్ల కింద సేదతీరి, పరస్పరం మంచి చెడులను పంచుకున్నారు. ఆటపాటలతో ధూంధాం చేసి రంజింపజేశారు. అనంతరం చెట్ల కింద రుచికరమైన భోజనాలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వంగా శ్రీనివాసగౌడ్, చుంచు లింగయ్యలు మాట్లాడుతూ సామాజిక రుగ్మతలు పారద్రోలడానికి కళారూపాలే సాధనాలని, ఎంతో కాలంగా ఆదరణ కరువైన జానపద కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనివ్వడం అదృష్టమన్నారు. టీజీవో రాష్ట్ర నాయకుడు ఏలూరి శ్రీనివాసరావు, టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు పొట్టపింజర రామయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక సారథి పోస్టులను సృష్టించి, వేలాది కళాకారుల కుటుంబాలను ఆదుకుందన్నారు.


ట్రైనీ కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ కులమతాలకతీతంగా కళాకారుల కుటుంబాలు వన భోజనోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కళాకారులు తమ వంతు పాత్ర నిర్వర్తించాలన్నారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు రూపొందించిన మిషన్ ప్లాస్టిక్ ఫ్రీ చైతన్య గీతాల సీడిని ఆయన ఆవిష్కరించారు. ఈ సభలో నూతనంగా ఎన్నికైన కళాకారుల సంఘం జిల్లా, మండల నూతన కమిటీలు ప్రమాణస్వీకారం చేశాయి. కళాకారులు మిమిక్రీ సుధాకర్, కాల్వకట్ట జాన్, ఎంఎస్ రాజు, పాగి వెంకన్న, పుల్లారావు, హుస్సేన్, నర్సింహారావు, పరకాల అజయ్, లక్ష్మణ్ ఇతర కళాకారులు ధూంధాం నిర్వహించారు. కార్పోరేటర్లు కమర్తపు మురళి, తోట రామారావు, బుర్రి వినయ్, సీఐలు సదా నిరంజన్, అంజలి, జిల్లా ప్రముఖులు నాగబత్తిని రవి, కూరపాటి వెంకటేశ్వర్లు, మల్లెల రవీంద్రప్రసాద్, అల్లిక వెంకటేశ్వర్లు, ఎఎస్ కుమార్, కళాకారుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పోలూరి రాము, ఆరెంపుల సతీశ్ తదితరులు పాల్గొన్నారు. కళాకారుడు పరకాల అజయ్ ప్లాస్టిక్ భూతంపై రచించిన పాటను చిన్నారి సుప్రజ ఆలపించి సభికులను ఆలోచింపజేసింది.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles