ఇంకుడు గుంతల నిర్మాణాలను వేగవంతం చేయాలి..


Sat,November 16, 2019 12:16 AM

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: ఇంకుడు గుంతల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంకుడు గుంతలు, శ్మశాన వాటికలు, ఇంటింటా వ్యర్థ్ధాల సేకరణ తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 15వ తేదీ వరకు ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి చేసే విధంగా ప్రత్యేక అధికారులకు, ఎంపీడీవోలకు సర్క్యులర్ జారీ చేయాలని డీఆర్‌డీఏ పీడీకి సూచించారు. అశ్వారావుపేటలో ఇంకుడు గుంతల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయని, సంబంధిత ఎంపీడీవోకు, ప్రత్యేక అధికారికి షోకాజ్ జారీ చేయాలన్నారు.


ప్రతీ మండలంలో ఆరు గ్రామ పంచాయతీలకు మెటీరియల్ కాంపోనెంట్ కింద నిధులు మంజూరు చేశామని, పనులు సంతృప్తికరంగా జరగాలని సూచించారు. శ్మశానవాటికల ఏర్పాటుకు భూ సేకరణ జరిగిన గ్రామ పంచాయతీల్లో తక్షణం సివిల్ పనులు ప్రారంభించాలని చెప్పారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేసేందుకు ఐటీసీ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రానున్న ఏడాది చేపట్టనున్న హరితహారంలో మొక్కలు నాటేందుకు నర్సరీలలో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు రెవెన్యూ, అటవీ, ఎంపీడీవో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నందున కొరవడిన సమగ్ర నివేదికలతో అధికారులు నిర్దేశించిన సమయంలోగా వీడియో కాన్ఫరెన్స్ కేంద్రాలకు హాజరు కావాలన్నారు. ఈ సమావేశంలో జేసీ వెంకటేశ్వర్లు, ప్రత్యేక అధికారి ఇలా త్రిపాఠి, డీఆర్‌డీవో జగత్‌కుమార్‌రెడ్డి, ట్రైనీ కలెక్టర్ అనుదీప్, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

77
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles