బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది


Wed,November 13, 2019 11:52 PM

-డీఈవో సరోజినీదేవి
పాల్వంచ : బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా విద్యాశాఖ అధికారిణి పీ సరోజినీదేవి అన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయం సమావేశ మందిరంలో చైల్డ్‌లైన్ 1098 జిల్లా ఆధ్వర్యంలో జరిగే బాలల స్నేహ పూరిత వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. బాలల హక్కులపై అవగాహన, బాల్య వివాహాలు, అనర్థాలు, బాలలపై వేదింపులు జరగకుండా ఉండేందుకు అవగాహన అవసరమని, ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు మంచి స్పర్శ, చెడు స్పర్శల గురించి చైల్డ్‌లైన్ 1098 వారు పాఠశాలల్లో నిర్వహిస్తున్నారన్నారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ..మున్సిపాలిటీ పరిధిలో బాలకార్మికులు, బాల్య వివాహాలు, బాలల హక్కులకు భంగం కలిగే సంఘటనలు సంభవిస్తే చైల్డ్‌లైన్ 1098కి కాల్ చేయాలని, వారికి మేము ఎప్పుడు సహకరించి బాలల స్నేహ పూర్వక మున్సిపాలిటీగా చేయడానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. పాల్వంచ డీఎస్పీ మాట్లాడుతూ..పిల్లల విషయంలో తమ శాఖ అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తుందని, బాలలపై వేదింపులు, బాల కార్మికులు, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చైల్డ్‌లైన్ జరిపే వారోత్సవాల్లో పోలీస్‌శాఖ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.


జిల్లా చైల్డ్‌లైన్ సమన్వయ కర్త రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. 0-18 సంవత్సరాల్లోపు బాలబాలికల కోసం పనిచేసే ఉచిత ఫోన్ సేవా కేంద్రమని జిల్లాలో గతసంవత్సర కాలంగా సుమారు 900 కేసులు కాల్ రిసీవ్ చేసుకొని పరిష్కరించినట్లు చెప్పారు. మరింత బాలలకు చేరువ అవ్వాలనే ఉద్దేశంతోనే బాలల స్నేహపూరిత వారోత్సవాలు జరుపుతున్నట్లు చెప్పారు. రెండవ రోజు బాలల దినోత్సవం, 3వ రోజు వ్యాసరచన పోటీలు,4వ రోజు ఆన్‌లైన్ సేఫ్టీ, స్వచ్ఛ కళాశాల, 5వ రోజు సీఎంపీవో, పోలీస్ విభాగానికి బాల్య వివాహాలపై ట్రైనింగ్ తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ సీఐ నవీన్, ఎన్‌ఐసీ పీవో యశోద, ఐసీపీవో శివకుమారి, 1098 టీమ్ సిబ్బంది సుబ్రహ్మణ్యం, బషీర్, రమేష్, ప్రసాద్, కల్యాణి, లత, అంబికా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles