‘పంట’ఆరబోత ప్రమాదకరం..


Wed,November 13, 2019 02:30 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రోడ్లు ప్రగతికి మార్గాలు.. ప్రభుత్వం ఎన్నో నిధులను వెచ్చించి ప్రజా రవాణాకు అవసరమయ్యే రోడ్లను అత్యంత సుందరంగా నిర్మిస్తోంది. ఈ రోడ్ల ద్వారానే ప్రజారవాణా పరుగులు పెడుతోంది. ప్రజావసరాలకు అనుగుణంగా ప్రభుత్వం రోడ్లను నిర్మిస్తుంటే రైతులు పంటల సీజన్‌లో రోడ్లపైనే దాన్యపు రాశులను ఆరబోసి వాహనదారులకు అడ్డుగా నిలుస్తూ అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో వేగంగా వచ్చే వాహనాలు ప్రమాదాలకు గురై అనేక మంది మృత్యువాత పడుతున్నారు. రోడ్డు సాఫీగా ఉందనే ధీమాతో వాహనదారులు వేగాన్ని పెంచి ప్రయాణిస్తుంటారు. కొన్ని ఊళ్ల పొలిమేరకు వాహనాలు వచ్చే సరికి రోడ్డుకు ఒక పక్కంతా ధాన్యపు రాశులతో రైతులు నింపేస్తున్నారు. దీంతో రెండు వైపులా వెళ్లే మార్గాల్లో ఒక మార్గాన్ని ధాన్యపు రాశులతో నింపేసి బ్లాక్‌ చేస్తున్నారు. దీంతో వచ్చిపోయే వాహనదారులు ఒక వైపే వెళ్తుండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రైతులు పండించిన ధాన్యపు రాశులను తమ పొలాల్లోనే ఉన్న కల్లాల్లోనే ఆరబెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.


సగానికి పైగా రోడ్లను ఆక్రమిస్తున్న ధాన్యపు రాశులు
రైతులు తాము పండించిన పంటలను అమ్మకానికి ముందు ఆరబెట్టేందుకు రోడ్లపైకి తీసుకొస్తున్నారు. రోడ్లపైనే పెద్ద పెద్ద రాశులు పోసి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించే విధంగా రాళ్లను అడ్డుగా పెడుతున్నారు. పెద్ద పెద్ద రాళ్లను అడ్డంగా పెట్టి ఆ గ్రామంలో ఉన్న ఎక్కువ మంది రైతులు ధాన్యపు రాశులను పోస్తుండటంతో రోడ్లన్నీ ధాన్యంతో నిండిపోతున్నాయి. మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వరిధాన్యం రోడ్లపై ఆరబోస్తున్నారు.

ఫుల్‌వీల్స్‌తో రోడ్లు నాశనం
తొలకరి ప్రారంభానికి ముందు రైతులు తమ పంటపొలాలను ట్రాక్టర్లతో దుక్కులు చేయిస్తుంటారు. దుక్కులు చేసే సమయంలో రైతులు ఫుల్‌వీల్స్‌తో రాకపోకలు సాగిస్తారు. రోడ్లపై ఫుల్‌వీల్స్‌తో ప్రయాణించడం వల్ల రోడ్లన్నీ గుంతల మయంగా మారుతున్నాయి. ఫుల్‌వీల్స్‌తో ట్రాక్టర్లు యథేచ్ఛగా తారు రోడ్లపైకి వస్తుండటంతో రోడ్లు దెబ్బతింటున్నాయి. ఒక లైన్‌గా రోడ్డు గుంత ఏర్పడటంతో వేగంగా వచ్చే ద్విచక్రవాహనదారులు ఆ గుంతల వల్ల కిందపడి ప్రమాదానికి గురవుతున్నారు. సంబంధిత పోలీస్‌ స్టేషన్ల ఎస్సైలు, సీఐలు పలుమార్లు రైతులను, ట్రాక్టర్ల యజమానులను ఫుల్‌వీల్స్‌తో రోడ్లపైకి రావొద్దని హెచ్చరిస్తున్నా వారు మాత్రం లెక్కచేయకుండా రోడ్లపైకి వచ్చి రోడ్లను పాడు చేస్తున్నారు.

రైతులను చైతన్యపర్చాలంటున్న ప్రజానీకం
తాము పండించిన పంటలను కల్లాల్లోనే ధాన్యపు రాశులుగా పోసుకొని ఆరబెట్టుకునే విధంగా సంబంధిత అధికారులు రైతులను చైతన్యపర్చాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యపు గింజలపై ద్విచక్రవాహనాలు వెళ్లే సమయంలో టైర్లు జారి కిందపడి ప్రమాదాలకు గురవుతారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటల దిగుబడి సమయంలో ప్రతీసారి రోడ్లపైనే పంటలను ఆరబెడుతుండటం, పోలీసులు రైతులపై అరకొర కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఈ సీజన్‌లో అలా కాకుండా రైతులను చైతన్యపర్చి రోడ్లపై ధాన్యపురాశులు లేకుండా చూడాలని జిల్లా ప్రజలు ఇటు పోలీసు వారిని, అటు రైతులను కోరుతున్నారు.

కల్లాల్లోనే ధాన్యం ఆరబెట్టుకోవాలి..: రవీందర్‌రెడ్డి, డీఎస్పీ, ఇల్లెందు
రైతులు పండించిన ధాన్యాన్ని కల్లాల్లోనే ఆరబెట్టుకోవాలి. రోడ్లపైకి ధాన్యపురాశులను తీసుకొని రావొద్దు. రవాణాకు సౌకర్యవంతంగా ఉన్న రహదారులను ఎవరు ఆక్రమించినా శిక్షార్హులే. గ్రామాల్లో ప్రధాన రహదారులపై పంట ఉత్పత్తులు ఆరబెట్టడం ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. సగానికి పైగా రహదారిని ఆక్రమించడం వల్ల వాహనాలు గింజలపై జారి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ద్విచక్ర వాహనాలపై ఇలాంటి చోట ప్రయాణం ఇబ్బందికరమే. ఇలా ఆరబెట్టే పద్ధతులను మార్చుకోవాలని గ్రామాలలో రైతులకు పలు సందర్భాల్లో అవగాహన కల్పిస్తున్నాం. నలుగురికి అన్నం పెట్టే అన్నదాత ప్రమాదాలకు అవకాశం ఇచ్చేలా వ్యవహరించడం సరైంది కాదు. రహదారులపై పంట ఉత్పత్తులు ఆరబెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

సగం రోడ్డును ఆక్రమిస్తున్న మొక్కజొన్న
ఇల్లెందు రూరల్‌: ప్రస్తుత ఖరీఫ్‌లో అన్ని రకాల పంటల దిగుబడి ఆశించిన దానికంటే అధికంగా ఉంటోంది. మొక్కజొన్నను కంకి నుంచి వేరు చేసిన రైతులు విక్రయించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. తేమశాతం నిబంధనలకు అనుగుణంగా ఉండేందుకు అనువైన స్థలాల్లో మొక్కజొన్న ఆరబెడుతున్నారు. కానీ చాలా మంది రబీ పంటలు సాగు చేసేందుకు పంట చేలను సన్నద్ధం చేసుకుంటూనే మొక్కజొన్న పంటను రహదారులపై ఆరబెడుతున్నారు. ఏకంగా సగం రహదారిని ఆక్రమించేస్తున్నారు. మూలమలుపుల వద్ద కూడా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. మండలంలోని మస్సివాగు, కొమరారం, మామిడిగుండాల రహదారులపై ఇటువంటి దృశ్యాలు అధికంగా కనిపిస్తున్నాయి. కానీ ఇవే ప్రాంతాలు ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. మూడు రోజుల క్రితం మస్సివాగు రహదారిలో మాణిక్యారం గ్రామానికి చెందని ఓ యువకుడు మొక్కజొన్న ఆరబెట్టిన ప్రాంతంలో వాహనంపై వెళుతూ ప్రమాదానాకి గురయ్యాడు. ఇటువంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. రహదారిపై మొక్కజొన్న ఆరబెడుతున్న రైతులు కల్లాల్లోనే తమ పంటను ఆరబెట్టుకోవాలి.. కానీ అలా చేయకపోవడంతో వాహన చోదకులు ముఖ్యంగా మూలమలుపుల వద్ద ప్రమాదాలకు గురవుతున్నారు.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles