ఒడిశా టు హైదరాబాద్..వయా భద్రాచలం


Tue,November 12, 2019 03:20 AM

-గంజాయి రవాణాకు అడ్డాగా మన్యం
-యథేచ్ఛగా సరుకు రవాణా
-రెండు, మూడు వారాల్లో రూ.5 కోట్ల సరుకు పట్టివేత
-జిల్లాలో బూర్గంపాడు, సింగరేణి భద్రాచలంలో పారిశ్రామిక ప్రాంతాలే టార్గెట్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గంజాయి... ఇదో రకమైన మత్తు పదార్థం... ఈ మత్తు పదార్థాన్ని ఏజెన్సీ ప్రాంతాలైన ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో సాగు చేస్తున్న మాఫియా అతి చౌకగా కొనుగోలు చేసి పౌడర్ రూపంలోకి మార్చి చిన్నచిన్న బ్యాగులలో ప్యాక్ చేసి లారీలు, డీసీఎంలు, ఇన్నోవాలు, కార్లు, ఇతర సులువైన పద్ధతుల్లో రాజధాని నగరానికి, ఇతర ప్రాంతాలకు యథేచ్చగా సరఫరా చేస్తూ అతి సులువుగా డబ్బు సంపాదిస్తూ యువతను నిర్వీర్యం చేస్తున్నాయి కొన్ని ముఠాలు... ఎన్నిసార్లు పట్టుబడ్డా గంజాయి అక్రమ రవాణ, అమ్మకమే తమ ప్రధాన వృత్తిగా చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. పోలీసులు సాధారణ తనిఖీల్లో గంజాయిని పట్టుకుంటూ మాఫియాపై కేసులు నమోదు చేస్తున్నా... బెయిల్ అనంతరం తిరిగి ఇదే పద్ధతిని ఎంచుకొని అక్రమ రవాణాదారులు పెట్రేగిపోతున్నారు. దీంతో గంజాయి అక్రమ రవాణా, పట్టివేత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిత్యకృత్యంగా మారింది.

ఒడిశా మీదుగా హైదరాబాద్ వయా భధ్రాచలం...
హైదరాబాద్‌లో నిర్మాణ రంగం నుంచి మొదలుకొని పారిశ్రామిక రంగంలో అనేక రాష్ర్టాల వారు వలసకూలీలుగా జీవనం సాగిస్తుంటారు. అంతేకాకుండా అన్ని రాష్ర్టాల యువత హైదరాబాద్‌లో విద్యను అభ్యసిస్తుంచేందుకు వస్తుంది. వారిని లక్ష్యంగా చేసుకొని గంజాయి మాఫియా అమ్మకానికి తెరలేపి కోట్లకు పడగలెత్తుతోంది. పోలీసులకు ఎన్ని సార్లు పట్టుబడ్డా ముఠాలు కొత్తరూపును సంతరించుకొని తిరిగి ఆంధ్రా, ఒడిస్సా రాష్ర్టాల నుంచి సీలేరు, చింతూరు, భద్రాచలం మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈ అక్రమ రవాణా ఎంతగా పెరిగిపోయిందంటే జిల్లాలోని ఏదో ఒక పోలీస్‌స్టేషన్ పరిధిలో వారంలో కనీసం మూడు సార్లు గంజాయి పట్టుబడుతూనే వస్తుంది. గంజాయి పట్టుకోవడం ఎస్పీ లేదా డీఎస్పీలు ప్రెస్‌మీట్‌లు పెట్టడం సాధారణమైపోయింది.

చెక్‌పోస్టుల సిబ్బంది కండ్లుగప్పి ఆంధ్రా, ఒడిశా చత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు గంజాయి అక్రమ రవాణా యధేచ్చగా మూడు పువ్వులు-ఆరు కాయలుగా సాగుతున్నది. గంజాయి సాగుకు పెట్టింది పేరుగా ఉన్న ఒడిస్సా నుంచి ఆంధ్రాలోని లక్ష్మీపురం, నెల్లిపాక, చట్టీ ప్రాంతాల్లో ఉన్న చెక్‌పోస్టులను దాటి గంజాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా రాజధానికి తరలి వెళ్తోంది. వలసవెళ్లి రోజువారీ కూలీ పనులు చేస్తున్న వారిని స్మగ్లర్లు ప్రలోభపెట్టి బ్యాగుల్లో చిన్న చిన్న కట్టలుగా ప్యాక్ చేసి రవాణా చేస్తున్నారు.

సింగరేణి పారిశ్రామిక ప్రాంతాలకూ సరఫరా...
ఆంధ్రా-ఒరిస్సా-చత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి అతి తక్కువ ధరకు గంజాయిని చిన్నచిన్న సంచుల్లో ప్యాక్‌చేసి హైదరాబాద్, తెలంగాణలోని తదితర ప్రాంతాలకు గంజాయి మాఫియా తరలిస్తుంది. మార్గమధ్యంలో బూర్గంపాడు, సారపాక కేంద్రంగా ఉన్న పారిశ్రామిక ప్రాంతాలపై దృష్టి సారించి వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న యువత, వలస జీవులను లక్ష్యంగా చేసుకొని గంజాయి అమ్మకానికి తెగబడుతుంది. తక్కువ ధరకు దొరకడం, ముఠాలు తమ ప్రాంతాలకే సరఫరా చేసి అమ్ముతుండటంతో అటు యువత, ఇటు వలస జీవులు వాటిని కొనుగోలు చేసి మత్తులో చిత్తవుతూ తమ ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు.

రెండు క్వింటాళ్ల గంజాయి...
జిల్లా మీదుగా గంజాయిని రాజధానికి సరఫరా చేస్తూ ఒక మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు స్మగ్లర్లు. కొన్ని రోజులుగా సుమారు రూ.5 కోట్లకు పైగా గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక ఎవరున్నారు, చిన్నా చితక ముఠాలు ఉన్నాయా, లేక పెద్ద తలకాయలు ఉన్నాయనేది అంతుపట్టడం లేదు. పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తూ గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నా రవాణా మాత్రం కొనసాగుతూనే ఉంది. వారంలో ఏదో ఒక రోజు జిల్లాలో గంజాయి తరలిస్తూ పట్టుబడటం పరిపాటిగా మారింది.

102
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles