భద్రాద్రి బాలోత్సవాన్ని జయప్రదం చేయండి


Mon,November 11, 2019 01:52 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ నవంబర్ 10 : భద్రాచలం పట్టణంలో ఈ నెల 15, 16, 17వ తేదీలలో జాతీయస్థాయి భద్రాద్రి బాలోత్సవం-2019ని నిర్వహిస్తున్నట్లు బాలోత్సవం నిర్వాహక కమిటీ అధ్యక్షులు, ప్రముఖులు తాళ్లూరి పంచాక్షరయ్య తెలిపారు. ఆదివారం స్థానిక బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బాలోత్సవంకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ బాలోత్సవం వేడుకకు రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు సమీపంలో ఉన్న ఇతర రాష్ర్టాల నుంచి కూడా 10వేల మందికి పైగా బాల, బాలికలు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో తగు ఏర్పాట్లు చేశామన్నారు. మైదానంలో 6 వేదికలు, బీఈడీ కళాశాలలో ఒక వేదికను నిర్మించామన్నారు. పోటీల్లో పాల్గొనే బాల, బాలికలకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 100కు పైగా ఎంట్రీలు వచ్చాయని, ఈ నెల 13వ తేదీ వరకు కూడా ఎంట్రీలకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.


తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్, తానా, ఐటీసీ పీఎస్‌పీడీ, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ విభాగం సహకారంతో ఈ బాలోత్సవం జరుపుతున్నట్లు వెల్లడించారు. తెలుగు బాలల పండుగ భద్రాచలం దివ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చే పిల్లలందరినీ స్థానికులు ఆశీర్వదించాలని కోరారు. బాల, బాలికల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రగతి పథంలో నడిపేందుకు ఈ బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నిర్వాహక కమిటీ కన్వీనర్ ఎన్‌సీహెచ్ చక్రవర్తి, కార్యదర్శి వంశీకృష్ణ, ఎస్‌కే అజీమ్, అల్లం నాగేశ్వరరావు, చారుగుళ్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles