జోరు పెంచిన ఆర్టీసీ


Sat,November 9, 2019 11:54 PM

-ప్రతీరోజు 200 బస్సులకు పైగా కేటాయింపు
-పల్లె పల్లెకూ ప్రజారవాణా
-రవాణా సౌకర్యాలపై ప్రజానీకం హర్షం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రయాణికుల ప్రయాణం సులభతరం అవుతున్నది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు బస్సులను నడిపిస్తున్నారు. జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల పరిధిలో 230 బస్సు సర్వీసులను నడిపి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గమ్యస్థానాలకు చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ సంస్థ సూచనల మేరకు జిల్లా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టి అధిక సంఖ్యలో సర్వీసులను యథావిధిగా నడుపుతూ డిపో ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు నిరవదిక సమ్మె చేపడుతున్నప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. అన్నిరూట్లలో మొత్తం 230 బస్సు సర్వీసులను నడిపి సుమారు 52 వేల మందికి పైగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చింది. సమ్మె కారణంగా ఏ ఒక్క ప్రయాణికుడు ఇబ్బందులు పడొద్దని ముందునుంచి ప్రభుత్వం చెప్తూ వస్తూ దానికి అనుగుణంగానే ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టి ప్రజారవాణాకు అంతరాయం కలగకుండా చూస్తున్నది. గత 36 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె తాలూకు ప్రభావం ఎక్కడా పడకుండా ప్రధానమైన రూట్లే కాకుండా పల్లెలకు కూడా బస్సు సర్వీసులను నడిపిస్తున్నది. కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల నుంచి బస్సులను అన్ని ప్రధాన రూట్లకు నడుపుతూ వచ్చారు. శనివారం కూడా హైదరాబాద్, ఖమ్మం, భద్రాచలం, విజయవాడ, వరంగల్, పల్లె ప్రాంతాలకు సర్వీసులన్నింటినీ సాధారణ రోజుల్లాగానే నడిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మూడు డిపోలలో మొత్తం 230 బస్సు సర్వీసులు నడిచాయి.

జిల్లాలో 230 బస్ సర్వీసులు..
జిల్లాలోని మూడు డిపోల పరిధిలో శనివారం 230 బస్సులు రోడ్డెక్కాయి. కొత్తగూడెం డిపోలో 52 ఆర్టీసీ, 21 హైర్ బస్సులు, భద్రాచలంలో 63 ఆర్టీసీ, 23 హైర్ బస్సులు, మణుగూరు డిపోలో 50 ఆర్టీసీ, 21 హైర్ బస్సు సర్వీసులు నడిచాయి. కాంట్రాక్టు క్యారియర్స్ 53, మోటార్ క్యాబ్స్ 191 నడిపి సుమారు 56 వేల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చినట్లు జిల్లా అధికారులు తెలిపారు.

సరిపడా బస్సులు
ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సమ్మెలో ఉండటంతో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపిస్తున్నారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా డ్రైవర్లకు అవసరమైన సూచనలు, సలహాలను జిల్లా రవాణాశాఖ అధికారులు ఇస్తున్నారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ మన్ననలు పొందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం డిపోల పరిధిలోని డ్రైవర్లు క్రమశిక్షణగా డ్రైవింగ్ చేస్తుండటంతో ఇప్పటి వరకు ఒక్క ప్రమాదం కూడా చోటు చేసుకోలేదు. దీంతో వారిపై మరింత నమ్మకం ఏర్పడింది.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles