12న కార్తీక పౌర్ణమి పూజలు


Sat,November 9, 2019 11:51 PM

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈనెల 12వ తేదీన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో తాళ్లూరి రమేష్‌బాబు, దేవస్థానం విశ్రాంత ప్రధాన అర్చకుడు పొడిచేటి జగన్నాథాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. తెల్లవారుజామున 4గంటలకు ఆలయ శుద్ధి, 5గంటలకు రామయ్యకు సుప్రభాత సేవ, గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి అభిషేకం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తూము నృసింహదాసు కీర్తనలు ఆలపించుట, ఆరాధన, ఆరగింపు, సేవాకాలం, నిత్యబలిహరణం, నిత్యహోమం, పరివార దేవతల నివేదనలు నిర్వహించనున్నట్లు పేర్కాన్నారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తామని, రాత్రి 7గంటలకు స్వామి తిరువీధిసేవ నిర్వహించి, పవళింపు సేవ జరుపుతామని వారు పేర్కొన్నారు.


అనుబంధ ఆలయం శివాలయంలో కాశీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వరస్వామి సన్నిధి నుంచి సాయంత్రం 6గంటలకు ఆకాశదీపారాధన. గడ్డివాములో పార్వతీ పరమేశ్వరులను ఐదుమార్లు ఊరేగింపు, జ్వాలాలు వెలిగించుట ఉంటుందని, కిందపడిన గడ్డిని భక్తులు తీసుకెళ్లి వారి ఇంటి వద్ద ఉన్న ఆవులకు పెడితే పాడిపంటలు సస్యశ్యామలంగా ఉంటాయని భక్తుల విశ్వాసంగా చెబుతారని వివరించారు. ఈ మాసంలో రామాలయంలో కృత్తిక నక్షత్రం రానున్నందున కృత్తికా దీపోత్సవం చేయుటలేదన్నారు. వచ్చే మాసంలో మార్గశిర పౌర్ణమిరోజు ఈ కృత్తికా దీపోత్సవం (చొక్కాసురుడి దహన) చప్టాదిగువ సెంటర్‌లో ఈ వేడుకను నిర్వహించి తదుపరి దేవాలయం చుట్టూ లక్ష దీపాలు వెలిగించనున్నట్లు తెలిపారు. అదేరోజు స్వామికి గరుడసేవ ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles