ఆగని బస్సు చక్రం


Sat,November 9, 2019 05:29 AM

-ప్రయాణికుల సేవలో ఆర్టీసీ
-రోడ్డెక్కిన 200 బస్సులు
-గమ్యస్థానాలకు 60 వేల మంది
-బస్టాండుల్లో ఫుల్ రద్దీ
-అధికారుల నిరంతర పర్యవేక్షణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లా వ్యాప్తంగా ఉన్న మూడు డిపోల పరిధిలో రెండొందలకు పైగా బస్సు సర్వీసులను నడిపి ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ సంస్థ సూచనల మేరకు జిల్లా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టి అధిక సంఖ్యలో బస్సులను యథావిధిగా నడుపుతూ డిపో ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మె చేపడుతున్నప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. అన్నిరూట్‌లలో బస్సు సర్వీసులను నడిపి సుమారు 60 వేల మందికి పైగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చింది. సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడొద్దని ముందునుంచి ప్రభుత్వం చెప్తూ వస్తూ దానికి అనుగుణంగానే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ప్రజారవాణాకు అంతరాయం కలగకుండా చూస్తోంది.


35 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె తాలూకు ప్రభావం ఎక్కడా పడకుండా ప్రధానమైన రూట్లే కాకుండా పల్లెలకు కూడా బస్సు సర్వీసులను నడుపుతోంది. కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల నుంచి బస్సులను అన్ని ప్రధాన రూట్‌లకు నడుపుతూ వచ్చారు. శుక్రవారం కూడా హైదరాబాద్, ఖమ్మం, భద్రాచలం, విజయవాడ, వరంగల్, పల్లె ప్రాంతాలకు సర్వీసులన్నింటినీ సాధారణ రోజుల్లాగానే నడిపారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న మూడు డిపోలలో బస్సు సర్వీసులు నడిచాయి. కొత్తగూడెం డిపోలో 48 ఆర్టీసీ, 20 హైర్ బస్సులు, భద్రాచలంలో 63 ఆర్టీసీ, 23 హైర్ బస్సులు, మణుగూరు డిపోలో 50 ఆర్టీసీ, 21 హైర్ బస్సు సర్వీసులు నడిచాయి. కాంట్రాక్టు క్యారియర్స్ 53, మోటార్ క్యాబ్స్ 191 నడిపి సుమారు 60 వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చినట్లు జిల్లా అధికారులు తెలిపారు.

అన్ని రూట్‌లకు బస్సులు
ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సమ్మెలో ఉండటంతో ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపిస్తున్నారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా జిల్లా రవాణాశాఖ అధికారులు డ్రైవర్లకు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ ప్రయాణికుల మన్ననలు పొందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం డిపోల పరిధిలోని డ్రైవర్లు క్రమశిక్షణగా డ్రైవింగ్ చేస్తుండటంతో ఇప్పటి వరకు ఒక్క ప్రమాదం కూడా చోటు చేసుకోలేదు. దీంతో వారిపై మరింత నమ్మకం ఏర్పడింది.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles