ముక్కోటి ఉత్సవాలకు ముహూర్తం ఖరార్..!


Fri,November 8, 2019 12:46 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ : ప్రతీ ఏటా సాంప్రదాయబద్దంగా రాములోరి సన్నిధి భద్రగిరిలో జరిగే శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయన మహోత్సవాల ముహూర్తంను దేవస్థానం వైదిక కమిటీ ఖరార్ చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందివ్వనుంది. డిసెంబర్27 నుంచి జనవరి16వ తేదీ వరకు భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయన మహోత్సవాలు జరగనున్నాయి. జనవరి17 నుంచి 19వ తేదీ వరకు విలాసోత్సవాలు నిర్వహించనున్నారు.
జనవరి5న స్వామివారి తెప్పోత్సవం,


6న ఉత్తర ద్వారదర్శనం..
వైకుంఠ మహోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామివారు ప్రతిరోజు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. డిసెంబర్27న మత్స్యావతారంలో స్వామివారు భక్తులను కనువిందు చేస్తారు. దీంతో పగల్‌పత్తు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. డిసెంబర్28న కూర్మావతారం, 29న వరాహవతారం, 30న నృసింహావతారం, 31న వామనావతారం, జనవరి1న పరశురామావతారం, జనవరి2న శ్రీరామావతారం, జనవరి3న బలరామావతారం, జనవరి4న శ్రీకృష్ణావతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. కాగా జనవరి5న శ్రీతిరుమంగైళ్వార్ పరమపదోత్సవం నిర్వహించి సాయంత్రం 4గంటల నుంచి శ్రీసీతారామచంద్రస్వామివారికి తెప్పోత్సవం వేడుక గోదావరి నదిలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవంతో పగల్‌పత్తు ఉత్సవాలు పూర్తవుతాయి. జనవరి6న తెల్లవారు జామున 4నుంచి 6గంటల వరకు ఉత్తర ద్వారదర్శనం వేడుక జరుపుతారు. అదేరోజు రాత్రి నుంచి రాపత్తు ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

తొలిరోజు శ్రీరామరక్ష మండపంలో రాపత్తు సేవ నిర్వహిస్తారు. జనవరి7వ తేదీన శ్రీఅంబాసత్రంలో, 8న శ్రీకృష్ణదేవాలయం, 9న శ్రీఅభయాంజనేయస్వామి ఆలయం, 10న తాతగుడి సెంటర్‌లోని గోవింద మండపం, 11న పునర్వసు మండపం, 12న వనవిహార మండపం, 13న విశ్రాంత మండపం, 14న దసరా మండపం, 15న చిత్రకూట మండపం, 16న దమ్మక్క మండపంలో రాపత్తు సేవలు నిర్వహిస్తారు. అనంతరం విలాసోత్సవాలు నిర్వహిస్తారు. జనవరి17న పంచాయతీ కార్యాలయం, 18న రెవెన్యూ కార్యాలయం, 19న దేవస్థానం సిబ్బంది సేవలో విలాసోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను ప్రతీ ఏటలాగే ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వాహక అధికారి తాళ్లూరి రమేష్‌బాబు, విశ్రాంత ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథచార్యులు నమస్తే తెలంగాణకు తెలిపారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles