ఖమ్మం మార్కెట్‌కు పోటెత్తిన పత్తి


Tue,November 5, 2019 12:32 AM

ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 4 : నగర వ్యవసాయ మార్కెట్‌కు బారీగా పత్తి రావడంతో పత్తియార్డు తెల్లబంగారంతో చాలా రోజుల తరువాత కళకళలాడింది. సోమవారం ఒక్కరోజే దాదాపు 15వేల పైగా పత్తిబస్తాలు రావడం ఈ సంవత్సరానికి ఇదే రికార్డుగా చెప్పవచ్చు. గత కొద్ది రోజుల నుంచి కేవలం రెండు, మూడు వేల బస్తాలకే పరిమితం అయింది. పంట చేతికి వచ్చే సీజన్ కావడం, ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం రైతులు పెద్ద మొత్తంలో పంటను తీసుకవచ్చారు. ఉదయం 7గంటలకు పత్తియార్డు నిండిపోవడంతో మార్కెట్ కమిటీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పత్తియార్డులో అన్ని షెడ్లతో పాటు ప్రాంగణం మొత్తం పత్తిబస్తాలు ఉంచడంతో యార్డు కిటకిట లాడింది. ఖమ్మం జిల్లా రైతులతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నుంచి సైతం అన్నదాతలు పంటను తీసుకవచ్చారు. ఉదయం 9 గంటల నుంచి ఖరీదు దారులు ఆన్‌లైన్‌లో బిడ్డింగ్ ప్రక్రియ చేపట్టారు. 10.15 గంటలకు విన్నర్స్ లిస్టును అధికారులు ప్రకటించారు.


దీంతో క్వింటాకు గరిష్ట ధర రూ. 5,050 చొప్పున పలికింది. మార్కెట్‌కు వచ్చిన పంటలో దాదాపు ఎక్కువ శాతం నాణ్యమైన పంట కావడంతో ఖరీదుదారులు పోటీపడి మరి బిడ్డింగ్‌లో పాల్గొన్నారు. ఈ సంవత్సరం జిల్లాలో దాదాపు 2.10 లక్షల ఎకరాలలో పత్తిసాగు జరిగింది. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, ఏపీలోని కృష్ణా జిల్లాలో సైతం బారీగానే సాగు జరిగింది. మరో వారం రోజుల్లో మార్కెట్లో భారత పత్తి సంస్థ కేంద్రం ప్రారంభించేందుకు మార్కెటింగ్‌శాఖ అధికారులు, చైర్మన్ కసరత్తులు చేస్తున్నారు. ఉదయం మార్కెట్‌కు పత్తిపంట బారిగా చేరుకున్న తరుణంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ యార్డు పరిస్థితిని సమీక్షించారు. పంటను తీసుకవచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన ఆదేశంచారు. సకాలంలో పంటల క్రయవిక్రయాలు, కాంటాల ప్రక్రియ ముగియడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles