ఓపెన్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం


Tue,November 5, 2019 12:32 AM

-పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డీఈవో సరోజినీదేవి
కొత్తగూడెం ఎడ్యుకేషన్, నవంబర్ 4 : తెలంగాణ ఓపెన్ స్కూల్ పదవ తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ కోసం చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓపెన్ పదవ తరగతి కోసం సింగరేణి ఉన్నత పాఠశాల, సెయింట్ మేరీస్ హైస్కూల్, లిటిల్ బడ్స్ ఉన్నత పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలిరోజు పదవ తరగతిలో 121 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 76 మంది మాత్రమే హాజరయ్యారు. 45 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియట్‌లో 127 మంది విద్యార్థులకు గాను 91 మంది హాజరు కాగా, 36 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.


విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాలకు వంద మీటర్ల లోపు పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేశారు. సమీపంలోని జిరాక్సు షాపులను కూడా మూసివేయించారు. ఈ పరీక్ష కేంద్రాలను డీఈవో సరోజిని దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల వద్దకు వెళ్లి ఆమె పరిశీలించారు. లిటిల్‌బడ్స్ హైస్కూల్‌లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నట్లు తేలడంతో సదరు విద్యార్థిపై కేసు నమోదు చేసినట్లు డీఈవో తెలిపారు. సింగరేణి ఉన్నత పాఠశాలలో ఒక విద్యార్థి పుట్టిన తేదీ మార్పు కోసం తప్పుడు ధృవీకరణ పత్రం సమర్పించి అడ్మిషన్ పొంది పరీక్ష రాస్తూ పట్టుబడటంతో అతనిపై కూడా కేసు నమోదు చేశారు. పరీక్షల నిర్వహణ, తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తనిఖీ చేసిన నోడల్ ఆఫీసర్
జిల్లా కేంద్రంలో ఈ నెల 4 నుంచి 16వ తేదీ వరకు జరుగుతున్న ఓపెన్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాన్ని జిల్లా నోడల్ ఆఫీసర్ సయ్యద్ జహీర్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఆయన సందర్శించి పరీక్ష నిర్వహణ తీరు తెన్నులను పరిశీలించారు. అభ్యర్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట చీఫ్ సూపరింటెండెంట్ వసంతలక్ష్మి ఉన్నారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles