అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి


Tue,November 5, 2019 12:31 AM

అశ్వాపురం: మండలంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, ఇంకుడుగుంతల ఏర్పాటుకు చేపట్టిన అభివృద్ధి పనులను త్వరతగతిన పూర్తిచేయాలని ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు, చింతిర్యాలకాలనీ, అశ్వాపురం గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించి గ్రామాల్లో వైకుంఠదామం, డంపింగ్‌యార్డు, ఇంకుడుగుంతల నిర్మాణ పనులను సందర్శించారు. తొలుత మల్లెలమడుగులో నిర్మిస్తున్న శ్మశానవాటిక పనులను పరిశీలించారు. గ్రామంలో వైకుంఠదామాల స్థితిపై ఎంపీడీవో సీహెచ్ శ్రీనివాసరావును అడగగా, 24 పంచాయతీలకు 9 పంచాయతీల్లో మాత్రమే స్థలాలు సేకరించామని, ఇందులో ఒక మల్లెలమడుగులో మాత్రమే నిర్మాణం కొనసాగుతుందని తెలుపగా పీవో ఆగ్రహం వ్యక్తంచేశారు. మల్లెలమడుగులో నిర్మిస్తున్న వైకుంఠదామం పనులను పరిశీలించిన ఆయన సర్పంచ్ కృష్ణవేణిని, పాలకవర్గాన్ని అభినందించారు.


అన్ని గ్రామాల్లో ఇదే తరహాలో పనులు త్వరతగతిన పూర్తిచేయాలని సూచించారు. అనంతరం చింతిర్యాలలో ప్రతీ ఇంటిలో ఇంకుడుగుంతలను ఏర్పాటు చేసేవిధంగా పాలకవర్గం చొరవ తీసుకోవాలని సర్పంచ్ పాయం భద్రయ్య, ఉపసర్పంచ్ వెన్నా అశోక్‌కి సూచించారు. కాగా అశ్వాపురంలోని డంపింగ్‌యార్డును పరిశీలించి, గ్రామపంచాయతీలో పారిశుధ్యపనుల నిర్వహణపై సర్పంచ్ బానోత్ శారదను అడిగి తెలుసుకున్నారు. అన్ని గ్రామాల్లో వైకుంఠదామం, డంపింగ్‌యార్డు, ఇంకుడుగుంతల నిర్మాణాలకోసం స్థలాలను సేకరించి త్వరతగతిన పనులు పూర్తిచేపించాలని ఎంపీడీవో, ఈజీఎస్ అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాసరావు, సర్పంచ్‌లు కోడి కృష్ణవేణి, పాయం భద్రయ్య, బానోత్ శారద, ఉపసర్పంచ్‌లు వెన్నా అశోక్, చావా వీరరాఘవులు, భూక్యా చందూలాల్, ఎంపీవో శ్రీనివాస్, ప్రత్యేక అధికారి అభిమన్యుడు, ఈజీఎస్ జీ విజయకుమారి, ఫీల్డ్ అసిస్టెంట్‌లు, టెక్నికల్ అసిస్టెంట్‌లు, గ్రామస్తులు కోడి అమరేందర్, వార్డు మెంబర్లు దాసు పాల్గొన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles