దొంగ నోట్ల దందాలో కదులుతున్న డొంక


Mon,November 4, 2019 12:34 AM

-నకిలీ కరెన్సీ వ్యవహారంలో పలువురి ప్రమేయం
-పోలీస్ విచారణలో వెలుగులోకి రానున్న నిజాలు
-త్వరలో మరిన్ని అరెస్టులు
-కేసుపై ఖమ్మం సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ప్రత్యేక దృష్టి


సత్తుపల్లి, నమస్తే తెలంగాణ: సత్తుపల్లి కేంద్రంగా దొంగ నోట్ల కేసులో ప్రధాన ముద్దాయి షేక్ మదార్‌ను పోలీసులు పట్టుకున్నారు. మదార్ మాదిరిగానే ఆయన అనుచరులు, మరికొందరు వ్యాపారులు సత్తుపల్లి కేంద్రంగా పెద్ద మొత్తంలో నకిలీ నోట్ల్లు చెలామణీ చేస్తున్నట్లుగా పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందినట్లు తెలిసింది. పట్టణ శివారులోని గౌరిగూడెంలో నివాసముంటున్న షేక్ మదార్, అసలుకు రెండు రెట్లు నకిలీ కరెన్సీ ఇస్తానంటూ మోసగించిన వ్యవహారంపై పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. నకిలీ నోట్ల కోసం ఒరిజినల్ నోట్లు ఇచ్చి మోసపోయామంటూ హైదరాబాద్‌కు చెందిన కొందరు ఇచ్చిన ఫిర్యాదుతో మదార్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ నోట్ల వ్యవహారంపై ప్రత్యేక బృందాన్ని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఏర్పాటు చేశారు. దర్యాప్తులో ఒకొక్క నిజం వెలుగులోకి వస్తోంది. గత నెల 26న రాజీవ్‌నగర్‌లోని మదార్ ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.40లక్షల నకిలీ కరెన్సీ వ్యవహారం, 30న వేంసూరు మండలం మర్లపాడులో నడిపల్లి దామోదరరావు ఇంట్లో దాచిన రద్దయిన రూ.1000, రూ.500 నోట్లు లక్షల సంఖ్యలో పోలీసులకు దొరికాయి. అయినప్పటికీ, పోలీసులు దీనిని మీడియాకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఏడుకోట్ల రూపాయలు, రెండు కార్లు మాత్రమే దొరికాయి అని, ఖమ్మంలో శనివారం విలేకరుల సమావేశంలో కమిషనర్ వెల్లడించారు. మర్లపాడులోని డంప్ వ్యవహారాన్ని పోలీసులు ఇప్పటి వరకూ బయటపెట్టలేదు.

దొంగలెందరో...?
దొంగ నోట్ల కేరాఫ్‌గా మారిన మదార్‌తో సత్తుపల్లి పట్టణానికి చెందిన కొందరు వ్యాపారులు, యువకులు సాన్నిహిత్యం పెంచుకుంటూ, అతని బాటలో నడిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మదార్ పేరుతో నకిలీ వ్యాపారం సాగిస్తున్నారు. వేంసూరు మండలం మర్లపాడులో దొరికిన డంప్ వ్యవహారంలో అదే మండలానికి చెందిన ఒకరు, సత్తుపల్లి పట్టణానికి చెందిన ఓ ప్రముఖుడు, గంగారం గ్రామానికి చెందిన మరొకరు, పట్టణంలోని ఓ చిట్‌ఫండ్ షాపులో పనిచేస్తున్న ఇంకొకరు... వీరంతా మదార్ ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం.

కమిషనర్ ప్రత్యేక దృష్టి
మదార్ వ్యవహారంపై పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ప్రత్యేక దృష్టి సారించారు. టాస్క్‌ఫోర్స్ పోలీస్ బృందాన్ని రంగంలోకి దింపారు. మదార్ ఇళ్లపై ఈ బృందం దాడులు చేసి, పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీని స్వాధీనపర్చుకుంది. అయితే, మదార్‌కు ఇచ్చిన అసలు కరెన్సీ ఏమైంది...? అనే కోణంలో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. కమిషనర్ పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే... సత్తుపల్లిలోనే మరిన్ని అరెస్టులు జరిగేందుకు, కొందరు బడా బాబులు బయటికొచ్చేందుకు, విస్తుపోయేలా మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చేందుకు అవకాశముంది.

సీఐల బదిలీ ఆంతర్యమేమిటో...?
సత్తుపల్లి పట్టణ, రూరల్ సీఐలు సురేష్, విజయ్‌కుమార్ ఆకస్మిక బదిలీపై సత్తుపల్లి పట్టణ, మండల ప్రజల్లో చర్చ సాగుతోంది. దొంగ నోట్లు చెలామణీపై దృష్టి సారించని ఫలితంగా బదిలీ జరిగిందా...? అనే, సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles