బొగ్గు ఉత్పత్తిలో ముందంజ


Fri,November 1, 2019 11:52 PM

-రవాణాలో దూసుకెళ్తున్న కొత్తగూడెం రీజియన్
-మిగతా ఏరియాల కంటే మెరుగైన వృద్ధి
-జిల్లాలో ఇల్లెందు ఏరియా టాప్


కొత్తగూడెం సింగరేణి, నవంబర్ 1: సింగరేణి సంస్థ 2019-20 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిలో కొత్తగూడెం రీజియన్ లక్ష్యాన్ని అధిగమించి ముందంజలో ఉంది. రీజియన్ పరిధిలోని ఇల్లెందు ఏరియాలో అత్యధికంగా సెప్టెంబర్ నెలాఖరు వరకు 127 శాతంతో ప్రథమ స్థానం, కొత్తగూడెం ఏరియాలో సెప్టెంబర్ నెలాఖరు వరకు 102 శాతం, మణుగూరు ఏరియాలో 102 శాతంతో బొగ్గు ఉత్పత్తి సాధించింది. సంస్థ వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాలతో పాటు ఆండ్రియాలా ప్రాజెక్టు 104 శాతంతో లక్ష్యాన్ని అధిగమించాయి. మిగతా ఏరియాలు బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించలేక వెనుకబడ్డాయి. ఈ ఏడాది వర్షాకాలంతో పాటు సెప్టెంబర్ నెలలో అధిక వర్షాలు పడటంతో బొగ్గు ఉత్పత్తికి, రవాణాకు ఆటంకం కలిగింది. ఓపెన్‌కాస్ట్ గనుల్లో భారీగా నీరు చేరడం వల్ల బొగ్గు వెలికితీసేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో బొగ్గు రవాణాకు అంతరాయం కలగకుండా యార్డుకోల్‌ను రవాణా చేసినప్పటికీ లక్ష్యాన్ని సాధించలేక కొద్దిగా వెనుకబడ్డాయి. సెప్టెంబర్ నెలాఖరు వరకు ఆర్జీ-1లో 76 శాతం, ఆర్జీ-2లో 94 శాతం, ఆర్జీ-3లో 98 శాతం, భూపాలపల్లిలో 76, బెల్లంపల్లిలో 67, మందమర్రి 72 శాతం, శ్రీరాంపూర్ 98 శాతం బొగ్గు ఉత్పత్తి చేసి సంస్థ వ్యాప్తంగా 96 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించాయి.

సెప్టెంబర్ నెలలో కొత్తగూడెం ఏరియా 11.43 లక్షల టన్నులకు గాను 11.52 లక్షల టన్నులు (101 శాతం), ఇల్లెందు ఏరియా 4.64 లక్షల టన్నులకు గాను 5.16 లక్షల టన్నులు (111 శాతం), మణుగూరు ఏరియా 8.17 లక్షల టన్నులకు గాను 8.38 లక్షల టన్నులు (103 శాతం), ఆర్జీ-1 ఏరియా 3.14 లక్షల టన్నులకు గాను 2 లక్షల టన్నులు (64 శాతం), ఆర్జీ-2 ఏరియా 6.40 లక్షల టన్నులకు గాను 5.8 లక్షల టన్నులు (91శాతం), ఆర్జీ-3 ఏరియా 6.0 లక్షల టన్నులకు గాను 5.5లక్షల టన్నులు (92 శాతం), అండ్రియాలా ప్రాజెక్టు ఏరియా 1.7 లక్షల టన్నులకు గాను 2.0 లక్షల టన్నులు (113 శాతం), భూపాలపల్లి ఏరియా 2.39 లక్షల టన్నులకు గాను 1.51 లక్షల టన్నులు (64 శాతం), బెల్లంపల్లి ఏరియా 4.0 లక్షల టన్నులకు గాను 1.59 లక్షల టన్నులు (40శాతం), మందమర్రి ఏరియా 6.4 లక్షల టన్నులకు గాను 2.94 లక్షల టన్నులు (63 శాతం), శ్రీరాంపూర్ ఏరియా 4.41 లక్షల టన్నులకు గాను 4.13 లక్షల టన్నులు (94 శాతం) మొత్తం 57.09 లక్షల టన్నులకు గాను 50.65 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసి 89 శాతం సాధించింది.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles