బోర్డులే మారాయి..!


Fri,November 1, 2019 11:51 PM

-పాత దుకాణాల్లోనే కొత్తవి ఏర్పాటు
-జోష్‌గా ప్రారంభమైన తొలిరోజు మద్యం అమ్మకాలు
-వైరా ఐఎంఎల్ డిపో నుంచి రూ. 9.5కోట్ల మద్యం కొనుగోళ్లు


ఖమ్మం క్రైం: మద్యం దుకాణాలన్నీ పాతవే.. మద్యం తాగేవాళ్లంతా పాతవారే..! అయితే మార్పులేమీ లేవనుకుంటున్నారా..? ఉన్నాయండీ బాబూ.. మద్యం దుకాణాలకు తగిలించిన పేర్లు మారాయి.. అంతేకాదు ఆబ్కారీ (ఎక్సైజ్) అధికారుల నుంచి లైసెన్సులు పొందిన వారు ఒకరైతే.. శుక్రవారం దుకాణాల్లో కూర్చుని అమ్మకాలు నిర్వహించిన వారు మరొకరు.. ఇవీ ఉమ్మడి జిల్లాలో తొలిరోజు మద్యం అమ్మకాల్లో చోటు చేసుకున్న చిత్ర.. విచిత్రాలు.. ఉమ్మడి జిల్లాలో లాటరీ ప్రక్రియ ద్వారా ఎంపికైన 165 మంది మద్యం షావులకు నవంబర్ 1 నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించారు. అయితే కొత్తగా లైసెన్సులు పొందిన వారి జాడ మాత్రం ఎక్కడా కనిపించక పోవడం విశేషం. లాటరీ ప్రక్రియ ముగియగానే ఎంపికైన వారితో కుదుర్చుకున్న (గుడ్‌విల్) ఒప్పందం ప్రకారం అనేక దుకాణాల్లో పాతవారే వ్యాపార లావాదేవీలు నిర్వహించారు.

గుడ్‌విల్ కింద షాపుల అమ్మకాలు..
నూతన మద్యం పాలసీ అమల్లో భాగంగా ప్రభుత్వ నిర్ణయం మేరకు అధికారులు నిర్వహించిన లాటరీ ప్రక్రియలో ఏళ్ల తరబడి మద్యం వ్యాపారంలో ఆరితేరిన వారికి దుకాణాలు దక్కలేదు. అదేక్రమంలో ఎటువంటి అనుభవం లేని కొత్తవారిని లాటరీలో మద్యం విజయలక్ష్మి వరించింది. దీంతో చేసేదేం లేక ఇప్పటికే ఈవ్యాపారంలో ఉన్న వ్యాపారులు కొత్తవారికి అనేక పోత్సాహకాలు(కోట్ల రూపాయలు) చెల్లించి దుకాణాలను సొంతం చేసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్సైజ్ శాఖ నిర్వహించిన టెండర్ ప్రక్రియలో ఒక్కొక్కరూ 10 నుంచి 15 వరకు దరఖాస్తులు బినామిల పేర్ల మీద దరఖాస్తులు చేసుకున్నారు. అదృష్టం కాస్త లక్ష్మీ వారి ఇంటి తలుపు తట్టింది. దీంతో షాపులను గుడ్‌విల్ కింద అమ్మకాలు జోరుగా నడిచాయి. కొంత మంది సిండికేట్‌గా ఏర్పడి వారికి వచ్చిన షాపులను ఒకటి ఉంచుకుని మిగతావి అమ్ముకున్నారు. ఇక ఏజెన్సీ దుకాణాలకు లైసెన్సులు పొందిన వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. వారంతా బినామీలేనని దరఖాస్తులు చేసినప్పుడే తేటతెల్లం అయ్యింది. అందుకే మొదటిరోజు మద్యం అమ్మకాల్లో దుకాణాల బోర్డులు, వాటికి వేసిన రంగులు తప్ప పెద్దగా మార్పులేమీ జరగలేదని చెప్పవచ్చు. అయితే ఈ తతంగమంతా ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుండటం ప్రత్యేకతను సంతరించుకుంది.

తొలి రోజు మద్యం అమ్మకాలు ఫుల్..
నూతన మద్యం పాలసీలో భాగంగా వ్యాపారుల ఎంపిక అనంతరం మద్యం అమ్మకాలకు మొదటి రోజు శుక్రవారం కావడంతో వ్యాపారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దుకాణాలకు మామిడి తోరణాలు కట్టి, కొన్ని చోట్ల రంగులు వేసి ముస్తాబు చేశారు. ఉమ్మడి జిల్లాలోని 165 షాపులకు వైరా ఐఎంఎల్ డిపో నుంచి రూ. 9.5 కోట్ల మద్యం కొనుగోలు జరిగింది. ఐఎంఎల్ 17000 బాక్స్‌లు, బీర్ కేసులు 12000 బాక్సు లు కొనుగోలు జరిగాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వైరా డిపోనే కావడంతో కొంత రద్దీ ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో 165 షాపుల్లో ఐదు మద్యం షాపుల వ్యాపారులు కొనుగోళ్లు చేయలేదని అధికారులు తెలుపుతున్నారు. జిల్లాలో నూతన మద్యం పాలసీలో నిబంధనలు ఎక్కడా కూడా కనిపించలేదు. అక్టోబర్ 31 వరకు వ్యాపారాలు నిర్వహించుకుని నవంబర్ 1 నుంచి అదే షాపులను వేరే వ్యాపారస్తులు మారి సరుకులను తెచ్చుకున్నారు. కొన్ని కొన్ని వైన్ షాపులల్లో ప్లాస్టిక్ గ్లాసులు కూడా ఎక్కువ శాతం అమ్మకాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బోనకల్ క్రాస్ రోడ్‌లో ఉన్న షాపు నెంబర్ 8 వ్యాపారస్తులు స్టాక్ తెచ్చుకున్నప్పటికీ ముహుర్తం బాలేదని షాపు ప్రారంభించలేదు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles