రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగాలి


Fri,November 1, 2019 11:48 PM

భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఈ ఏడాది వర్షాలు కురుస్తున్న కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, రవాణాకు ఆటంకం ఏర్పడిందని, ఈ నెల నుంచి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని, రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఆయన డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. నవంబర్ నెల నుంచి వర్షాలు ఉండే అవకాశం లేదని, తెరిపిగా ఉన్న కాలంలో వెనుకబడిపోయిన బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలతో పాటు నెలవారీ లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు.


ప్రత్యేక ప్రణాళికతో సింగరేణి మొత్తం మీద రోజుకు 2 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా సాధించేలా కృషి చేయాలన్నారు. రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. కొత్త ఓపెన్‌కాస్ట్ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి అతి త్వరలో ప్రారంభం కావాలని ఆదేశించారు. ఒడిస్సాలో సింగరేణి చేపట్టిన నైనీతో పాటు కొత్తగా కేటాయించిన న్యూపాత్రపద బ్లాక్‌కు సంబంధించిన పనులను దశల వారీగా, ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్లు శంకర్, చంద్రశేఖర్, బీ భాస్కర్‌రావు, బలరాం, ఈడీ జే ఆల్విన్, ఈడీ సురేందర్‌పాండే, జీఎం ఆంటోనీ రాజా, జీఎం (ఎంపీ) కేవీ రమణమూర్తి, జీఎం (సీపీపీ) కే రవిశంకర్, జీఎం(ఓసీ గనులు) వైజీకే మూర్తి, జీఎం (ఎంఎస్) రుష్యేంద్రుడు, జీఎం (ఎన్విరాన్‌మెంట్) జేవీఎల్ గణపతి, అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles