పాత నేరస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలి


Fri,November 1, 2019 11:48 PM

కొత్తగూడెం క్రైం: నేరాలను నియంత్రించడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ, ఎప్పటికప్పుడు నేరగాళ్లను నియంత్రించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ సునీల్‌దత్ అన్నారు. రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు ఎస్పీ శుక్రవారం ఆయన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆర్థిక నేరాలకు పాల్పడే వారి వివరాలు, సైబర్ క్రైమ్స్, దొంగతనాలు, డ్రగ్స్ రవాణా చేస్తూ వివిధ కేసుల్లో ఉన్న వ్యక్తుల వివరాలు, రౌడీషీర్స్, గ్యాంబ్లింగ్, మట్కా, క్రికెట్ బెట్టింగ్, నకిలీ వస్తువుల విక్రయదారులు, హత్య కేసులో ఉన్న వ్యక్తులు, బెధిరింపులకు పాల్పడే వారు, ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేసేవారి పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని, తద్వారా ఎవరైన నేరాలకు పాల్పడితే వారి వివరాలను సులువుగా తెలుసుకోవచ్చన్నారు. నిత్యం నేరాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నిరంతరం జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి వారికి కోర్టు ద్వారా శిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతీ అధికారి, సిబ్బంది 5ఎస్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు.


పోలీస్ అధికారులు తమ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమారాలను ఏర్పాటు చేసి, నేరాలను నియంత్రించడంలో పటిష్టమైన చర్యలు తీసుకొని బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్‌స్పెక్టర్ బూర రాజగోపాల్, కొత్తగూడెం వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ లావుడ్యా రాజు, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ, త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ లింగనబోయిన ఆదినారాయణ, జూలూరుపాడు సీఐ నాగరాజు, మణుగూరు సీఐ ఎంఏ షుకూర్, భద్రాచలం సీఐ వినోద్ రెడ్డి, అశ్వారావుపేట సీఐ ముసుకు అబ్బయ్య, టేకులపల్లి సీఐ బీ రాజు, అశ్వాపురం సీఐ ఎస్ రాజు, ఎస్సైలు ప్రవీణ్, దరురిశెట్టి వరుణ్ ప్రసాద్, ఎల్ రవీందర్, ఏకుల రతీష్, ప్రవీణ్ కుమార్, మధు ప్రసాద్, శ్రీపతి తిరుపతి, బాలకృష్ణ, మహేష్, రాజేష్, పోలీస్ పీఆర్‌వో వదాములూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles