ధాన్యం కొనుగోళ్లలో జిల్లాను ఆదర్శంగా నిలపాలి


Fri,November 1, 2019 12:47 AM

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను ప్రణాళిక బద్దంగా చేపట్టి జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా నిలపాలని జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం కొత్తగూడెం క్లబ్‌లో పౌరసరఫరాల శాఖ, సంస్థల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్ల సంస్థల నాణ్యతా ప్రమాణాలపై శిక్షణ నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ధాన్యం కొనుగోళ్లపై రూపొందించిన పోస్టర్లను సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ధాన్యం కొనుగోళ్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో 1.40 లక్షల రైతులకు 1.12 లక్షల పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. జిల్లా ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు, పోడు భూములు లాంటి సమస్యలతో ఇబ్బందులు చోటు చేసుకున్నాయన్నారు. జిల్లాలో అధిక వర్షాలు కురవడంతో ధాన్యం ఉత్పత్తులు పెరిగాయన్నారు. నవంబర్ 10 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నామని తెలిపారు. ప్రతీ రోజు ధాన్యం కొనుగోలుకై ఒక క్రమపద్దతి ప్రవేశపెట్టినట్లు చెప్పారు. దీనికి ప్రత్యేక యాప్ ఉందని, ధాన్యం విక్రయించే రైతులు ఈ యాప్‌లో ఆన్‌లైన్ చేసుకోవాలని చెప్పారు.


రైతులు తమ పేర్లు, ఆధార్ నంబర్, పట్టా పాస్ బుక్, బ్యాంకు ఖాతా నంబర్‌తో సహా అప్‌లోడ్ చేసుకుంటేనే విక్రయించిన ధాన్యానికి 48 గంటల్లోపు సొమ్ము జమ అవుతుందన్నారు. ధాన్యం విక్రయించే రైతులు ముందుగా గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద టోకెన్ పొందాలని, ఏరోజు తన ధాన్యం విక్రయించాలో ముందుగా తేదీ ఇస్తున్నందున అదే తేదీన విక్రయించుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. తేమ 17 శాతం లోపు ఉండేలా చూసుకోవాలన్నారు. తడిసిన ధాన్యం కొనుగోళ్లకు వేరు చేయాలని, లేని పక్షంలో మంచి ధాన్యం కూడా తక్కువ ధర పలుకుతుందన్నారు. డీఆర్‌డీవో జగత్‌కుమార్‌రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాష్, డీఎం సివిల్ సైప్లెస్ టీ.ప్రసాద్, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, మార్కెటింగ్ అధికారి నరేందర్, సహకారశాఖ అధికారి మైఖేల్ బోస్, కార్మికశాఖ అధికారి కుటుంబరావు, తూనికల కొలతల శాఖ అధికారి మనోహర్, జీసీసీ మేనేజర్ వాణి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జుగల్ కిషోర్, తహసీల్దార్లు, వ్యవసాయశాఖ ఏవోలు, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles