అమర వీరులారా వందనం..


Tue,October 22, 2019 02:23 AM

-జిల్లా కేంద్రంలో సంస్మరణ దినోత్సవం
-శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు
-త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
-ఎస్పీ సునీల్ దత్


కొత్తగూడెం క్రైం / చర్ల రూరల్ : ప్రజల మాన, ప్రాణాల సంరక్షణ కోసం, దేశం కోసం ప్రాణాలను తృణపాయంగా పెట్టిన వీర జవానుల స్ఫూర్తితో ప్రతీ ఒక్కరు ముందుకు నడవాలని జిల్లా ఎస్పీ సునీల్‌దత్ అన్నారు. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో గల పోలీస్ హెడ్ కార్వర్టర్స్‌లోని మైదానంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన స్మృతి పెరేడ్‌లో సోమవారం ముఖ్యఅతిథులుగా పాల్గొన్న జిల్లా ఎస్పీ సునీల్‌దత్, జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు వారి త్యాగాలను స్మరిస్తూ ప్రసంగించారు. ముందుగా జిల్లా సాయుధ బలగాల నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశరక్షణలో ప్రజాసేవ చేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం అన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రస్తుత సమాజంలో ప్రజలు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారన్నారు. ప్రతీ ఏడాది ఎంతో మంది పోలీసులు దేశ రక్షణలో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం పాటుపడుతూ సంఘ విద్రోహ శక్తుల చేతిలో అమరులవుతున్నారని తెలిపారు. వారందరి త్యాగాలను ప్రతీ ఒక్కరు గుర్తుంచుకుని, వారి బాటలో దేశ రక్షణ కోసం పాటుపడాలని కోరారు. పోలీస్ అమరవీరుల ఆశయాల సాధన కోసం ప్రతీ పౌరుడు నడుంబిగించాలన్నారు. అనంతరం అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) దేవరపల్లి ఉదయ్‌కుమార్‌రెడ్డి ఈ ఏడాది కాలంలో విధి నిర్వహణలో అమరులైన 292మంది అమరవీరుల పేర్లను చదివి వారిని స్మరించుకున్నారు.

అనంతరం ఎస్పీ సునీల్ దత్, జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు, పోలీస్ అధికారులందరూ మైదానంలో ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల స్తూపానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అర్‌ఐ(అడ్మిన్) సీహెచ్‌ఎస్వీ కృష్ణ నేతృత్వంలో పోలీస్ అమరవీరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి స్మృతి పెరెడ్‌ను నిర్వహించారు. వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎస్పీ, జేసీలు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ బీ కిష్టయ్య, ఐఆర్ బెటాలియన్ కమాండెంట్ కే సుబ్రమణ్యం, కొత్తగూడెం డీఎస్పీ షేక్ మహమ్మద్ ఆలీ, అసిస్టెంట్ కమాండెంట్లు నరసింహస్వామి, మోర్ల శ్రీనివాసరావు, మచ్చ శ్రీనివాసరావు, ఆర్‌ఐలు పిన్నింటి ప్రసాద్, బీ సోములునాయక్, ప్రగడ కామరాజు, తుత్తురు దామోదర్, విద్యాసాగర్, శివ, నరసింహారాజు, శ్రీనివాస్, ఉదయ్‌కుమార్, ఆర్‌ఎస్సైలు రమణారెడ్డి, గిరిధర్‌రెడ్డి, మద్దెల స్వాతి, రామకృష్ణ, గణేష్, ఓం ప్రకాశ్, జగన్‌మోహన్‌రెడ్డి, పోలీస్ పీఆర్‌వో శ్రీనివాస్, ఏఆర్ సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.

చర్ల రూరల్ : చట్టవ్యతిరేక శక్తుల ఆటకట్టిస్తూ ప్రాణాలు ఫణంగాపెట్టి పోలీసులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని చర్ల మండలం కలివేరు కేంద్రంగా పనిచేస్తున్న సీఆర్‌పీఎఫ్ 151 బీఎన్ క్యాంపులో సోమవారం ఘనంగా నిర్వహించారు. పోలీసుల త్యాగాలను జవాన్లు స్మరించుకొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద సీఆర్‌పీఎఫ్ 151 బీఎన్ సెకండ్ కమాండెంట్ మిచేల్, డిప్యూటీ కమాండెంట్ జయ మాధవన్, వైద్యాధికారి డాక్టర్ జీ అరుణ్‌కుమార్, సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరవీరులకు నివాళి అర్పించారు. అమరవీరుల స్ఫూర్తితో చట్ట వ్యతిరేక శక్తులను తుదముట్టించడానికి, ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడటం కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేస్తామని జవాన్లు ప్రతిజ్ఞ చేశారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles