బంద్ పాక్షికం


Sun,October 20, 2019 03:57 AM

ఖమ్మం కమాన్‌బజార్, అక్టోబర్ 19 : జిల్లాలో ఆర్టీసీ, అద్దె బస్సులు రోడ్డు పైకి రాకపోయినా.. ప్రతి రోజు గ్రామాల్లో తిరిగే బస్సులు రోడ్డెక్కపోయినా.. ప్రజా రవాణాను మాత్రం అడ్డుకోలేకపోయారు ఆర్టీసీ కార్మికులు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రజా రవాణాకు ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ బంద్ పిలుపు మేరకు జిల్లాలో బంద్ పాక్షికంగా జరిగింది. పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన ఆటోలు, జీబులు, టాటా మ్యాజిక్‌లు వంటి వాహనాల్లో ప్రయాణికుల ఇబ్బందులు పడుతూనే తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఆందోళన కారులు కొంత మేరకు ఆయా వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రావడంతో తప్పుకున్నారు. అనంతరం ఆటోలు, ఇతర ప్రయాణికుల వాహనాలు యథావిధిగా ప్రజలను తమతమ గమ్యస్థానాలకు చేర్చాయి. పోలీసులు, జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలతో బంద్ పాక్షికంగా జరిగినప్పటికీ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిచడంలో అధికారులు కొంత ఊరటనిచ్చారు. వామపక్ష పార్టీల నాయకులు బంద్‌కు సంఘీభావం పిలుపునివ్వడంతో చాలా మంది ప్రయాణికులు వారివారి ప్రయాణాలను వాయిదా వేసుకోవడంతో జిల్లాలో ఖమ్మం, సత్తుపల్లి, మధిర బస్టాండ్‌లలో ప్రయాణికులుకు లేక వెలవెలబోయింది. జిల్లాలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. కార్మికుల సమ్మె శనివారానికి 15 రోజులు కావడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారివారి ప్రయాణాలు కొనసాగించారు. జిల్లాలో ప్రయాణికులను ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ప్రక్రియలో ప్రభుత్వం నియమించిన తాత్కాలిక సిబ్బందైన డ్రైవర్లు, కండక్టర్లు కూడా డ్యూటీలకు రాలేదు. జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఎన్‌డీ, కుల సంఘాల ఆధ్వర్యంలో బంద్ కొనసాగింది. జిల్లాలో వైద్యసేవలకు వస్తున్న రోగులు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. వైద్యులు కూడా వైద్యసేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆందోళనకారుల వల్ల కొంత ఇబ్బందులకు గురయ్యారు. ఆందోళన కారులు ఆసుపత్రులను కూడా బంద్ చేయాలని వైద్యులపై ఒత్తిడి తీసుకురావడంతో అప్పటికే వైద్యసేవలు పొందుతున్న రోగులతో పాటు అత్యవసరంగా వైద్యసేవలకు వచ్చిన వారు అసౌకర్యానికి గురయ్యారు. ఆందోళన కారుల తీరు పట్ల ప్రజలు కొంత మేరకు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు కనిపించింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యల్లో రవాణా సంస్థను మెరుగు పరుస్తున్న సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైనది కాదని ప్రయాణికులు, ప్రజలు ఆవెదన వ్యక్తం చేస్తున్నారు.


ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణాలు...
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే జిల్లాలో ఉన్న ప్రైవేట్ బస్సులకు, మ్యాక్సీ క్యాబ్‌లకు పర్మిట్లు జారీ చేయడంతో ప్రయాణికులకు కొంత ఊరట కలిగింది. దాంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణాలు కొనసాగించారు. ఖమ్మం, సత్తుపల్లి, మధిర బస్టాండ్‌లలో వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనాల ద్వారా ప్రయాణాలు చేసి వారి వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. శనివారం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 6 గంటలకు, రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు తవేరా, ఇన్నోవా, మినిబస్సులు హైదరాబాద్‌కు నడిపించారు. దీంతో ప్రయాణికులు అత్యవసర పనుల కోసం అందులో ప్రయాణించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లల్లో ఆర్టీఏ అధికారులు పర్యవేక్షించారు. ప్రైవేట్ వాహనాలు ఏ రూట్లల్లో తిరుగుతున్నాయో అనే అంశాన్ని ఆర్టీఏ అధికారులు తెలుసుకుంటున్నారు. ప్రయాణికుల రద్దీ ఉంటే ప్రైవేట్ వాహనాల ద్వారా ప్రయాణాలు కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో సాయంత్రం 4 గంటల నుంచి మ్యాక్సీ క్యాబ్‌లు నడిచాయి. జిల్లాలో 40 మ్యాక్సీ క్యాబ్‌లు నడిచినట్లు ఆర్టీఏ అధికారుల ద్వారా తెలుస్తుంది. శనివారం బంద్ ఉన్న నేపథ్యంలో చాలా మంది శుక్రవారం రాత్రివేళ్లల్లో ప్రయాణాలు కొనసాగించారు. ఖమ్మం, సత్తుపల్లి, మధిర బస్టాండ్‌లల్లో ప్రైవేట్ బస్సులు, మాక్సీ క్యాబ్‌ల ద్వారా ఖమ్మం టు హైదరాబాద్, ఖమ్మం టు వరంగల్‌కు ఎక్కువగా తిరిగాయి.

డిపో, బస్టాండ్‌ల వద్ద పోలీసుల బందోబస్తు..
ఆర్టీసీ కార్మికుల సమ్మె పోలీస్‌శాఖకు కంటి మీద కునుకులేకుండా చేసింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చి శనివారంతో 14 రోజులు పాటు బందోబస్తు నిర్వహిస్తునే ఉన్నారు. పోలీసుశాఖ డిపో, బస్టాండ్‌ల వద్ద ఏసీపీల నేతృత్వంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. డిపో, బస్టాండ్ ప్రాంతాల్లో ఏసీపీలు షిఫ్ట్‌ల వారీగా బందోబస్తును పటిష్టపరిచారు. డిపోల వద్ద కార్మికులు ఆందోళన, నిరసనలు చేసి డిపోలోపలికి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పోలీసు బలగాలను మోహరించి భద్రతను రెండింతలుగా కట్టుదిట్టం చేశారు. జిల్లాలో బంద్ నేపథ్యంలో పోలీస్‌శాఖ పటిష్టమైన చర్యలను తీసుకుంది. ఉదయం నుంచి కార్మికులు, నిరసన కారులు ఆందోళనలను సద్దుమనిగించేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో శాంతి భద్రతలను జిల్లా పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పర్యవేక్షించారు. ఆందోళన కారులు ఉద్యమాన్ని ఉదృతం చేస్తే ప్రత్యేక వాహనాల ద్వారా తరలించే విధంగా డిపోల వద్ద ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles