పల్లె పల్లెకూ ప్రగతి చక్రం


Fri,October 18, 2019 11:32 PM

-జిల్లాలో 70 శాతానికి పైగా రోడ్డెక్కిన బస్సులు
-పెరిగిన రద్దీ నిరంతరం నోడల్ ఆఫీసర్ల పర్యవేక్షణ
-నేడు రాష్ట్ర బంద్‌కు ఆర్టీసీ జాక్ నాయకుల పిలుపు
భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ జాక్ నాయకులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రయాణికులు తాము చేరాల్సిన గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకుంటున్నారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణం జరిగేందుకు జిల్లా ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్నీ ఏర్పాట్లు చేయడంతో సమస్యలు లేకుండా సాగింది. గత 13రోజుల కంటే శుక్రవారం మూడు బస్టాండ్‌లలో ప్రయాణికుల రద్దీ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. జాక్ నాయకులు శనివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంతో ముందస్తుగానే వివిధ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు శనివారం, ఆదివారం రెండురోజులు సెలవులు కలిసి వస్తుందనే ఉద్దేశంతో శుక్రవారం రోజే తమ తమ ప్రాంతాలకు వెళ్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఆర్టీసీ జాక్ నాయకులు చేస్తున్న సమ్మె 14వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా నడుపుతుండటంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.


బస్సుల్లో పెరిగిన ప్రయాణికులు
గత వారంతో పోలిస్తే ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మరణించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండురోజులపాటు బంద్‌ను నిర్వహించారు. దీంతో ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించిన ప్రయాణికులు బంద్ తర్వాత ఆర్టీసీ యాజమాన్యం యథావిధిగా బస్సులు నడుపుతుండటంతో ఆర్టీసీలో ప్రయాణించేందుకు ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలోని మూడు డిపోల నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులను నడిపారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లే కాకుండా డీలక్స్, సూపర్ లక్సరీ బస్సులు, రాజధాని ఏసీ బస్సులను సైతం నడిపారు. భద్రాచలం, ఇల్లెందు, మణుగూరు, ఖమ్మం, హైదరాబాద్, మిర్యాలగూడ, విజయవాడ, వరంగల్, హన్మకొండ తదితర ప్రాంతాలకు బస్సులు తిరిగాయి.

నోడల్ ఆఫీసర్ల పర్యవేక్షణ
టీఎస్ ఆర్టీసీ జాక్ నాయకులు తలపెట్టిన నిరవధిక సమ్మె ప్రభావం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో శుక్రవారం కూడా కొనసాగింది. అయినప్పటికీ సమ్మె ప్రభావం ప్రయాణికులపై ఏ మాత్రం కనిపించలేదు. జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆదేశాల మేరకు కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం డిపోలకు ప్రత్యేక నోడల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు బస్సుల రూట్లను పర్యవేక్షిస్తూ డ్రైవర్లకు, కండక్టర్లకు సూచనలు చేశారు. ఆర్టీసీ డీవీఎం వేములవాడ శ్రీకృష్ణ, మూడు డిపోల మేనేజర్లు, జిల్లా ఎస్సీ సునీల్‌దత్ ఆదేశాలతో కొత్తగూడెం డీఎస్పీ ఎస్‌ఎం ఆలీ, సీఐలు సత్యనారాయణ, ఎల్ రాజు, కరుణాకర్, జిల్లా రవాణాశాఖాధికారి రవీందర్, అధికారులు డ్రైవర్లకు సూచనలు చేస్తూ బాధ్యతగా విధులు నిర్వహించాలని హెచ్చరించారు.

జిల్లాలో 70శాతంపైగా రోడ్డెక్కిన బస్సులు
మూడు డిపోలలో మొత్తం 70శాతంపైగా బస్సులు రోడ్డెక్కి ప్రయాణికులను సాఫీగా వారి గమ్యస్థానాలకు చేరారు. మూడు డిపోలలో మొత్తం ఆర్టీసీ, హైర్‌బస్సులు 268బస్సులు ఉండగా 214బస్సులు గురువారంనాటికి నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. కొత్తగూడెం డిపోలో 65బస్సులు ఉండగా 53బస్సులు, భద్రాచలం డిపోలో 81బస్సులు ఉండగా 50బస్సులు, మణుగూరు డిపోలో 54బస్సులు ఉండగా 50బస్సులు నడుపగా, హైర్‌బస్సుల విషయానికి వస్తే కొత్తగూడెంలో 22 బస్సులకుగాను 19, భద్రాచలంలో 25బస్సులకు గాను 21,మణుగూరు డిపోలో 21బస్సులకు 21బస్సు సర్వీసులను నడిపామని చెప్పారు. మొత్తంగా 70శాతంపైగా శుక్రవారం నాటికి బస్సులు జిల్లా వ్యాప్తంగా నడిపినట్లు చెప్పారు.

నేడు రాష్ట్ర బంద్
ఆర్టీసీ జాక్ నాయకులు శనివారం రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చారు. సోమవారం జాక్ నాయకులు నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఈ నెల 19న రాష్ట్రబంద్ చేపట్టాలని పిలుపునిచ్చారు. పట్టణంలో జాక్ నాయకులు, వివిధ సంఘాల నాయకులు దుకాణాల యజమానుల వద్దకు వెళ్లి బంద్‌కు మద్దతు ఇవ్వాలని షాపులు తెరవవద్దని సూచించారు. స్వచ్ఛందంగా బంద్ పాటించి ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలపాలని మహిళా సమాఖ్య నాయకులు ఈసం రమాదేవి, మేదినిలక్ష్మీ తదితరులు ప్రచారం చేపట్టారు.

ఆర్టీసీ సమ్మెకు పలు సంఘాల మద్దతు
14వ రోజు డిపో ఆవరణలో పలు కార్యక్రమాలను నిర్వహించి నిరసన తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ నాయకులు సమ్మెకు మద్దతు తెలుపుతూ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఆశావర్కర్లు, వైద్యసిబ్బంది, వివిధ సంఘాల నాయకులు జాక్ చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles