గిరిజన చట్టాలు అమలయ్యేలా దృష్టి సారించాలి


Fri,October 18, 2019 11:29 PM

-భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్
భద్రాచలం, నమస్తే తెలంగాణ: ఏజెన్సీ ఏరియాలోని మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనుల కోసం రూపొందించిన చట్టాలు గిరిజనులకు మాత్రమే అనుకూలంగా అమలయ్యే విధంగా ప్రత్యేకంగా తహసీల్దార్లు, ఈవోఆర్‌డీ, పంచాయతీ సెక్రెటరీలు దృష్టి సారించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ అన్నారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశపు హాల్లో గిరిజన సంక్షేమశాఖ హైదరాబాద్ టీసీఆర్ అండ్ టీఐ శాఖ ఉన్నతాధికారుల ద్వారా ఉమ్మడి ఐటీడీఏ పరిధిలో గల వివిధ మండలాల తహసీల్దార్లు, పంచాయతీ సెక్రెటరీలు, సబ్ రిజిస్టార్లు, ఏటీడీవోలకు గిరిజన చట్టాలపై ఒక్కరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ఏజెన్సీలో చట్టాల అమలుపై శిక్షణ కలెక్టర్ అనుదీప్‌తో కలిసి పీవో గౌతమ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భద్రాచలం ఐటీడీఏ ఏజెన్సీ పరిధిలో పనిచేసే వివిధ శాఖల అధికారులు గిరిజనులకు వర్తించే ఏజెన్సీ చట్టాలను అమలు చేసే విషయంలో ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించాలన్నారు. ఏజెన్సీ గ్రామాలు 9 రాష్ర్టాల్లో ఉన్నాయని, తెలంగాణలో 3 జిల్లాల్లో ఖమ్మం, ఆదిలాబాద్, ములుగులో ఉన్న ఏజెన్సీ గ్రామాలు చాలా వెనుకబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లకు, ఈవోపీఆర్‌డీలకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.


భూములకు సంబంధించినవి తహసీల్దార్లకు.., ఇళ్ల కొనుగోలు, ప్లాట్స్ లేఅవుట్స్ పంచాయతీ అధికారుల పరిధిలో ఉంటాయన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులకు సంబంధించిన భూమి, ఏమైనా వనరులు గిరిజనేతరులు కొనడం, అమ్మడం చేయరాదని, అలాగే గిరిజనుల భూముల విషయంలో ఎల్‌టీఆర్ కేసులు గుర్తించి ప్రత్యేకంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. 2006లో ఆర్‌వోఎఫ్‌ఆర్ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత 2006లోపు గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు అది కూడా ఫారెస్ట్‌కు సంబంధించింది కాకుండా ప్రభుత్వ భూములు ఉంటే తప్పకుండా పట్టాలిచ్చే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గిరిజన గ్రామాల్లో ఆర్థిక వనరులు అటవీ ఫలాలు గ్రామాల అభివృద్ధి చేసుకోవడానికి పీసా చట్టం అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు.

ఏజెన్సీ సర్టిఫికెట్స్ జారీ చేసే విషయంలో తహసీల్దార్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే భూములు రిజిస్టర్ చేసేటప్పుడు కొనుగోలకు సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించి చట్టంలో పొందుపరిచిన నియమ నిబంధనలకు పాటించాలని సూచించారు. అనంతరం చండికా ట్రస్ట్ మణుగూరు అధ్యక్షుడు సోడె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పీసా చట్టంపై రూపొందించిన కరపత్రాలను, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తయారు చేసిన గిరిజన చట్టాల బుక్‌లెట్స్‌ను పీవో గౌతమ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీసీఆర్ అండ్ టీఐ ఓఎస్‌డీ (రిటైర్డ్) ఎంఏ అలీమ్, రిటైర్డ్ జేడీ సుబ్బారావు, ఏపీవో జనరల్ కుమ్రం నాగోరావు, డీడీ జహీరుద్దీన్, ఏవో భీమ్, మేనేజర్ సురేందర్, సంబంధిత ఉమ్మడి జిల్లాల తహసీల్దార్లు, పంచాయతీ సెక్రెటరీలు, ఈవో పీఆర్‌డీలు, ఏటీడీవోలు, ఐటీడీఏలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles