ఏజెన్సీ పోలీస్‌స్టేషన్లలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి


Fri,October 18, 2019 11:28 PM

కొత్తగూడెం క్రైం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పోలీస్‌స్టేషన్లలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసుకోవాలని సీఐడీ ఐజీ, వరంగల్ ఇంచార్జి ఐజీపీ ప్రమోద్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ సునీల్‌దత్ ఐజీపీకి పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టు ప్రభావిత పోలీస్‌స్టేషన్లకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు మావోయిస్టుల గురించి సమాచారాన్ని సేకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పోలీస్ అధికారుల పనితీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు.


జిల్లా ప్రస్తుత స్థితిగతులను, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న కార్యక్రమాలను గురించి ఎస్పీ సునీల్‌దత్ ఐజీపీకి వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని రకాల ఎన్నికలను సమర్థవంతంగా పూర్తి చేయడంలో జిల్లా పోలీసుల పనితీరును ఆయన అభినందించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సునీల్‌దత్‌తో పాటు అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి, అదనపు ఎస్సీ రాయిళ్ల సాయిబాబా, ఏఆర్ ఏఎస్పీ బి.కృష్ణయ్య, భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌చంద్ర, కొత్తగూడెం డీఎస్పీ ఎస్‌ఎం ఆలీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles