ఆక్రమణల తొలగింపునకు కార్యాచరణ రూపొందించాలి


Fri,October 18, 2019 11:28 PM

కొత్తగూడెం అర్బన్: మండల, మున్సిపాలిటీ పరిధిలోని ఆక్రమణలు తొలగింపునకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ ఒక ప్రకటనలో తెలిపారు. అవెన్యూ ప్లాంటేషన్, ఆక్రమణల తొలగింపుపై మున్సిపల్ అధికారులకు సర్క్యూలర్ జారీ చేస్తున్నట్లు తెలిపారు. నిషేధించిన ప్లాస్టిక్ విక్రయించినా, వినియోగించినా వారికి జరిమానా విధించడంతో పాటు విక్రయించిన వారిపై పోలీస్ కేసులు నమోదు చేయాలన్నారు. ప్రతీ మండలంలో మూడు గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించాలని, ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల జాబితాను తనకు తక్షణం అందజేయాలని ఎంపీడీవోలను ఆదేశించినట్లు చెప్పారు. వచ్చేవారం నుంచి 30 రోజుల కార్యక్రమం అమలు తీరును పర్యవేక్షించేందుకు జిల్లాకు నియమించిన ప్రత్యేక అధికారుల బృందం పరిశీలిస్తుందని పేర్కొన్నారు. మండల, మున్సిపల్ స్థాయిల్లో వ్యాపారులు నిషేధించిన ప్లాస్టిక్ కవర్లు విక్రయించకుండా తనిఖీలు నిర్వహించాలని, తనిఖీల్లో ప్లాస్టిక్ లభ్యమైతే తక్షణం పోలీసు కేసులు నమోదు చేయాలన్నారు.


ప్లాస్టిక్ వస్తువుల సేకరణ ప్రక్రియ 80శాతం పూర్తైందని, మిగిలిన వస్తువులను కూడా సేకరించి ఐటీసీ సంస్థకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అవెన్యూ ప్లాంటేషన్‌ను జిల్లాలో ఆశించినంతంగా జరగలేదని, ఈ విషయాన్ని ఎంపీడీవోలు చాలా సీరియస్‌గా తీసుకొని మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తన పర్యటనలో అవెన్యూ ప్లాంటేషన్ చేసిన ప్రాంతాలను పరిశీలిస్తానని, ఈ విషయంలో అలసత్వం వహిస్తే అటువంటి వారిని సస్పెండ్ చేస్తానన్నారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులకు గుర్తించిన భూముల్లో తక్షణం సివిల్ పనులు ప్రారంభించాలన్నారు. ఇంకుడు గుంతలు నిర్మాణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles