హైందవ ధర్మంతో ప్రపంచ శాంతి..


Thu,October 17, 2019 01:45 AM

-విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర స్వామి
-ఖమ్మం చేరుకున్న స్వరూపానందేంద్ర సర్వసతి స్వామి


ఖమ్మం కల్చరల్: హిందు ధర్మం పరిఢవిల్లుతోంది... ప్రపంచ శాంతి, సమాజ హితానికి హైందవ ధర్మమే శరణ్యమని హిందు ధర్మ ప్రచార యాత్ర చాటుతోంది... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు రోజులుగా సాగిస్తున్న విశాఖ శ్రీశారదా పీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి హిందు ధర్మ ప్రచార యాత్ర హైందవుల్లో మరింత విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగిస్తోంది.. యాత్రలో భాగంగా స్వామి వారు ప్రతి రోజు జిల్లాలో పురాణ క్షేత్ర మహిమ గల పలు ఆలయాలను దర్శిస్తూ, భక్తులకు హిందు ధర్మాన్ని ప్రభోదిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి రోజు సాయంత్రం భక్తుడు, గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర స్వగృహంలో శ్రీశారదా అమ్మవారి స్వరూపమైన శ్రీరాజశ్యామల పీఠ పూజలను అత్యంత శాస్ర్తోక్తంగా నిర్వహిస్తున్నారు. స్వామి వారిని భక్తులు ఇండ్లకు స్వాగతించి పాదపూజలు చేసి తరిస్తున్నారు.

ఆలయాలను సందర్శించిన స్వాత్మానందేంద్ర స్వామి..
బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం, ఎన్‌ఎస్‌పీ క్యాంప్ రామాలయం, రఘునాధపాలెంలోని సాయిబాబా ఆశ్రమం, కమాన్‌బజార్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయాలను ఆయన సందర్శించి, ఆలయాల్లో కొలువైన స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో వేద పండితుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వామికి శాస్ర్తోక్తంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి భక్తులకు అనుగ్రహభాషణం చేస్తూ ప్రస్తుత సమాజాన్ని హిందు ధర్మమే సంరక్షిస్తుందని, హిందూ ధర్మంలోని పలు నైతిక, మానవీయ విలువలు ప్రపంచ శాంతికి, లోక హితానికి తోడ్పడుతున్నాయన్నారు. ఆయా ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

పూజలో పాల్గొన్న ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియ
శారదా మాత స్వరూపిణిగా శ్రీరాజశ్యామలాదేవి అమ్మవారికి శ్రీస్వాత్మానందేంద్ర స్వామి శాస్ర్తోక్తంగా పూజలు చేశారు. గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర విజయలక్ష్మి స్వగృహంలో ఆవాహన చేసి కొలువుంచిన శ్రీరాజశ్యామల అమ్మవారికి స్వాత్మానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు చేశారు. కోరిన కోరికలు తీర్చే జగన్మాతగా, విజయ సంకల్పాలకు సంకేతంగా అమ్మవారిని భక్తులు అత్యంత భక్తిప్రపత్తులతో సేవించారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియలు రాజశ్యామలాదేవి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార యాత్ర సమన్వయకర్త, దరువు ఎండి సీహెచ్ కరణ్‌రెడ్డి, మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, దేవత అనిల్‌కుమార్, కొత్తమాసు హేమసుందర్‌రావు, శెట్టి రంగారావు, రాపర్తి శరత్, ఆకుల సతీశ్, తదితరులు పాల్గొన్నారు.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles