రోడ్డెక్కిన రథ చక్రాలు...


Wed,October 16, 2019 01:03 AM

ఖమ్మం కమాన్‌బజార్, అక్టోబర్ 15: జిల్లాలో బస్సులు రోడ్డెక్కాయి. మూడు డిపోల పరిధిలో చీమల దండులా ఒకదాని వెంట ఒకటి ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేశాయి. ప్రయాణికుల ఇబ్బందులకు అనుగుణంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంది. జిల్లాలో మూడు డిపోల పరిధిలో ఉన్న ఆర్టీసీ, అద్దెబస్సులు ఆయా ప్రాంతాల్లో విరివిగా తిరిగాయి. దీంతో జిల్లాలో సమ్మె ప్రభావం కనిపించలేదు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ పిలుపులో భాగంగా జిల్లాలో మంగళవారం నాటికి సమ్మె 11వ రోజుకు చేరింది. గత పది రోజుల నుంచి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా ఆర్టీసీలో ఉన్న బస్సులను తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లను నియమించి బస్సులు నడుపుతుంది. శనివారం జిల్లాలో కొన్ని సంఘటనలు చోటుచేసుకోవడంతో రెండు రోజుల పాటు ప్రజా రవాణా వ్యవస్థ కుంటుపడింది. సోమవారం సాయంత్రం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బస్సులు తిప్పాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించడంతో కలెక్టర్ నేతృత్వంలో బస్సులు జోరుగా తిరిగాయి. ఖమ్మం, మధిర, సత్తుపల్లి డిపోల పరిధిలో ఉన్న మండలాల్లో, గ్రామాల్లో బస్సులు రావడంతో ప్రయాణికులకు కొంత ఊరటను కలిగించింది. తాత్కాలికంగా నియమించిన డ్రైవర్లను, కండక్టర్లను ఆయా డిపో మేనేజర్లు సోమవారం రాత్రే వారితో మాట్లాడి ఉదయమే విధుల్లోకి రావాలని ఆదేశించారు. మంగళవారం ఉదయం 4 గంటల నుంచి షెడ్యూల్ ప్రకారంగా ఆర్టీసీ, ఆర్టీసీలో ఉన్న అద్దె బస్సులను తిప్పారు.


రద్దీకి అనుగుణంగా బస్సులు...
ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రజల ఇబ్బందులు కలగకుండా ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా బస్సులు తిప్పేందుకు కలెక్టర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలో సత్తుపల్లి, ఖమ్మం, మధిర డిపోల్లో బస్సులను నడపాలని జిల్లా ఆర్టీసీ అధికారులకు, డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా డిపోలకు చెందిన బస్సులు వివిధ ప్రాంతాల్లో తిప్పారు. జిల్లాలోని సత్తుపల్లి, మధిర, ఖమ్మం డిపోలలో ఆర్టీసీ 174 బస్సులు, ఆర్టీసీలో ఉన్న అద్దె బస్సులు 109 రోడ్లపై తిరిగాయి. ఆర్టీఏ అధికారులు జారీ చేసిన పర్మిట్ల ప్రకారంగా బయటి నుంచి ప్రైవేట్ బస్సులు 40, మ్యాక్సీక్యాబ్‌లు 60 నడిచాయి. జిల్లాలో మొత్తం 383 బస్సులను వివిధ మార్గాల్లో ప్రయాణిలకు ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేర్చాయి. ఖమ్మం డిపోలో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, సత్తుపల్లి డిపోలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, డిలాక్స్, మధిరలో పల్లె వెలుగు బస్సులను తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల ద్వారా రోడ్డెక్కించారు. ఖమ్మం డిపోకు చెందిన బస్సులు ఖమ్మం-బోనకల్, ఖమ్మం-ఇల్లందు, ఖమ్మం-హైదరాబాద్, ఖమ్మం-వరంగల్, ఖమ్మం-తొర్రూర్, ఖమ్మం - కోదాడకు తిప్పారు. మధిర డిపోల నుంచి ఎక్కువగా మండలాలకు, గ్రామాలకు తిప్పారు. సత్తుపల్లి డిపో నుంచి సత్తుపల్లి- విజయవాడ, సత్తుపల్లి- భద్రాచలం, సత్తుపల్లి - మణుగూరు, సత్తుపల్లి - వరంగల్, సత్తుపల్లి - హైదరాబాద్‌లకు నడిపించారు. ఖమ్మం డిపో నుంచి ఆర్టీసీ 59, సంస్థ అద్దె 56, సత్తుపల్లి డిపో నుంచి సంస్థ 80, సంస్థ అద్దె 32, మధిర డిపో నుంచి ఆర్టీసీ 35, సంస్థ అద్దె 21 బస్సులను తిప్పారు.

డిపోలకు నోడల్ అధికారులను నియమించిన కలెక్టర్...
ప్రజా రవాణా వ్యవస్థను గాడిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే సోమవారం సాయంత్రం రవాణాశాఖ మంత్రి డిపోల్లో నోడల్ అధికారులను నియమించాలని కలెక్టర్లకు ఆదేశించడంతో జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన యుద్దప్రాతిపదికన ఆయా డిపోలకు నోడల్ అధికారులను నియమించారు. దీంతో సోమవారం ఉదయం నుంచి ఆయా డిపోలకు నోడల్ అధికారుల పర్యవేక్షణలో బస్సులు ఎక్కువగా తిరిగాయి. ఖమ్మం డిపోకు జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి, మధిర డిపోకు ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీనివాస్‌రావును సత్తుపల్లి డిపోకు, కల్లూరు ఆర్డీవో శివాజీని నియమించారు. వీరు ఉదయం నుంచే బస్సుల పనితీరును పరిశీలిస్తూ ఆయా డిపో మేనేజర్లకు, జిల్లా ఆర్‌ఎంకు, డీవీఎంలకు ఆదేశాలిస్తూ బస్సులను విజయవంతంగా తిప్పారు. దాంతో పాటు రవాణాశాఖ నుంచి ఖమ్మం డిపోకు నోడల్ అధికారులను నియమించారు. ఖమ్మం డిపోకు ఏఎంవీఐ వెంకటరమణ, మధిర డిపోకు ఏఎంవీఐ వరప్రసాద్, సత్తుపల్లి డిపోకు ఏఎంవీఐ డీ మనోహర్‌లను నియమించారు. వీరికి తాత్కాలిక సిబ్బందులను నియమించే బాధ్యత, డిపో మేనేజర్లకు సలహా సూచనలకు నియమించారు.

డిపోల్లో సీసీ కెమెరాల ఏర్పాటు..
ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా సంస్థ ఆస్తికి నష్టం వాటిల్ల కూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో ఖమ్మం, సత్తుపల్లి, మధిర డిపోలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సమ్మె కారణంగా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఆయా బాధ్యులను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చర్యలు తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు. బస్సులు వెళ్తున్నప్పుడు పోలీస్ ఎస్కార్ట్ ఉందో లేదో, రాత్రి సమయాల్లో ఆందోళనకారులు లోపలికి రాకుండా ఈ కెమెరా ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్టీసీ అధికారులు తెలుపుతున్నారు.

పోలీసు పహారాతో కదిలిన బస్సులు...
ఆర్టీసీ కార్మికుల సమ్మె, జిల్లాలో కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడంతో పోలీస్‌శాఖ అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేసింది. జిల్లాలో రెండు రోజుల పాటు బస్సులు బయటికి రాకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, పోలీస్ పహారాతో బస్సులను నడిపించాలని రవాణాశాఖ మంత్రి పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలివ్వడంతో సీపీ తఫ్సీర్‌ఇక్బాల్ పోలీస్ పహారాను మరింత పెంచుతూ, భద్రతను కట్టుదిట్టం చేశారు. సోమవారం జిల్లాలోని మూడు డిపోలల్లో తిరిగిన బస్సులకు పోలీస్ ఎస్కార్ట్ ద్వారా తిరిగాయి. డిపోల నుంచి బస్సులు బయటికి వచ్చే సమయంలో ప్రత్యేక ఎస్కార్ట్, బస్సుల్లో కానిస్టేబుళ్లను నియమించి బస్సులను బస్టాండ్ వరకు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఖమ్మం డిపోలో పోలీస్‌శాఖ నుంచి నోడల్ ఆఫీసర్‌గా టాస్క్‌ఫోర్స్ ఏసీపీ రెహ్మాన్, మధిర డిపోలో పోలీస్ శాఖ నుంచి నోడల్ ఆఫీసర్‌గా వైరా ఏసీపీ ప్రసన్న కుమార్, సత్తుపల్లి డిపోలో పోలీస్‌శాఖ నుంచి నోడల్ ఆఫీసర్‌గా కల్లూరు ఏసీపీ వెంకటేష్‌ను పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ నియమించారు. గత పది రోజుల నుంచి పోలీస్ బందోబస్తును ఎప్పటికప్పుడు కట్టుదిట్టం చేస్తూ బస్సులను బయటికి పంపే విధంగా వారు చర్యలు తీసుకున్నారు. పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ జిల్లాలో శాంతి భద్రతలను పర్యవేక్షించారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles