ప్రయాణికులకు అసౌకర్యం కలుగొద్దు


Tue,October 15, 2019 03:05 AM

- పూర్తిస్థాయిలో బస్సులు నడపాలి
- వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి అజయ్‌కుమార్
- ప్రతీ డిపోకు నోడల్ అధికారి
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి
- అద్దె బస్సులు కూడా పూర్తి స్థాయిలో నడపాలి.. ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ప్రాంతాలకు వంద శాతం పూర్తిస్థాయిలో బస్సులను నడపాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్‌శర్మ, కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానీయాతో కలిసి హైద్రాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఆర్టీసీ సమ్మెపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వందశాతం అన్ని గ్రామాలకు బస్సులు నడపడమే ప్రధాన కర్తవ్యంగా జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు ప్రయత్నించాలని మంత్రి అన్నారు. ప్రతి డిపోకు జిల్లాస్థాయి అధికారి నోడల్ అధికారిగా బాధ్యతలు అప్పగించి డ్రైవర్లకు, కండక్టర్లకు బస్సులను అప్పగించే బాధ్యతలను నోడల్ అధికారి ఇవ్వాలని మంత్రి సూచించారు.

అదనంగా డ్రైవర్‌ను, కండక్టర్లను, మెకానిక్‌లను తాత్కాలిక పద్ధతిన తీసుకోవడానికి జిల్లా కలెక్టర్‌లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ నెల 20 నుంచి పాఠశాలలు, కళాశాలలు పునః ప్రారంభమవుతున్నందున విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని మంత్రి తెలిపారు. గత పది రోజులుగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, రవాణాశాఖ అధికారులు సంయుక్తంగా సమన్వయంతో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను నడుపుతున్నప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 50 నుంచి 60 శాతం మాత్రమే బస్సులు నడుస్తున్నాయని, రానున్న రోజుల్లో మరింత స్ఫూర్తితో వందశాతం బస్సులను నడపాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి మాట్లాడుతూ ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంలో భాగంగా జిల్లాలోని ప్రతి బస్ డిపోకు ఒక నోడల్ అధికారిని నియమించాలని కలెక్టర్లకు సూచించారు. అదేవిధంగా వృత్తి నైపుణ్యం కలిగిన డ్రైవర్లను రవాణాశాఖ అధికారులు గుర్తించి విధులకు పంపాలని ఆయన అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసు శాఖ బందోబస్తుతో బస్సులను నడపాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌లు ప్రతిరోజు సాయంత్రం డిపోల వారిగా సమీక్షించాలన్నారు. డిపోలకు నియమించబడిన నోడల్ అధికారులు విధులకు హాజరయ్యే డ్రైవర్లకు, కండక్టర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి అధిక చార్జీలు వసూలు చేయకుండా తగు ఆదేశాలు ఇవ్వాలని ఆయన తెలిపారు. ప్రతి డిపోలో నోడల్ ఆఫీసర్‌తో పాటు అవసరమైన మెకానిక్‌లు, కంప్యూటర్ ఆపరేటర్లను సత్వరమే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులతో పాటు అద్దె బస్సులు కూడా పూర్తిస్థాయిలో నడిపే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్‌లకు సూచించారు.

బస్సుపాసు సౌకర్యం కలిగిన విద్యార్థులు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లలందరికి బస్సుపాసులను అనుమతించే విధంగా డ్రైవర్లకు, కండక్టర్లకు తగు ఆదేశాలు ఇవ్వాలని ఆయన తెలిపారు. అదేవిధంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల కండీషన్‌ను రవాణాశాఖ అధికారులు ధ్రువీకరించాకనే బస్సులను పంపాలన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ప్రాంతాలకు బస్సులను నడిపేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తామని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్సులో ఆర్టీసీ అధికారులు, జిల్లా రవాణాశాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles