హింసకు కుట్ర..


Sat,October 12, 2019 11:55 PM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నా చర్యలు చేపట్టి ప్రజలతో శభాష్‌ అనిపించుకుంటున్న ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. వారి సమ్మె కారణంగా పండుగ సమయంలో ప్రజలకు ఇబ్బందులు రాకూదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. తాత్కాలికంగా డ్రైవర్లను, కండక్టర్లను నియమించి దాదాపు 80శాతం బస్సులను నడిపిస్తున్నారు. తద్వారా తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకునే దసరా పండుగకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం బస్సులు నడిపి ప్రజలతో శభాష్‌ అనిపించుకుంది. మరో వైపు ప్రజాస్వామిక హక్కులను ప్రభుత్వం కాపాడుతుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పహారాను ఏర్పాటు చేశారు. మరోవైపు తాత్కాలిక కండక్టర్లు ప్రయాణికుల నుంచి అసలు చార్జీకంటే అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పోలీసులను అలర్ట్‌ చేశారు. దీంతో పలు జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారులు బస్సులల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.


ఖమ్మం నగరంలో పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ఇక్బాల్‌ సైతం ఆర్టీసీ బస్సులలో తనిఖీలు చేపట్టారు. సమ్మె నేపథ్యంలో ప్రశాంతంగా ప్రత్యామ్నాయ చర్యలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉన్న పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు వాటి అనుబంధ కార్మిక సంఘాల నేతృత్వంలో హింసకు పాల్పడే చర్యలు చేపట్టారు. శనివారం రాత్రి ఖమ్మం నగరంలోని వైరా రోడ్‌, వైరా మండలం నారపనేనిపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వి అద్దాలను ధ్వంసం చేశారు. మరోవైపు ఖమ్మం బస్సు డిపోకు చెందిన దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆయనను వెంటనే కుటుంబ సభ్యులు, పోలీసులు ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగానే కొన్ని కార్మిక సంఘాలకు చెందిన నాయకులు ఆసుపత్రిలోనికి ప్రవేశించి వైద్యులను అడ్డుకున్నారు. చికిత్స చేయకుండా వైద్యులను అడ్డుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అతనికి ఏమైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వంపై నిందవేసే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ప్రతిపక్ష కార్మిక సంఘాల నాయకులు వ్యవహరించడం జరిగిందని సమ్మె చేస్తున్న కార్మికులే పేర్కొనడం గమనార్హం. శ్రీనివాసరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వాసుపత్రి నుంచి నగరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తీసుకువెళ్లారు. దీనిని ఆసరాగా తీసుకుని కాంగ్రెస్‌కు చెందిన కొద్ది మంది నాయకులు ఆసుపత్రి ఎదురుగా వైరా రోడ్డుపై ఆందోళన నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. అక్కడ నుంచి బస్టాండ్‌కు చేరుకుని అక్కడ కూడా రాస్తారోకో చేయడంతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వ సెలవ రోజు కావడం ఉద్యోగులు, సాధారణ ప్రజలు, ప్రయాణికులు వారి ఆందోళనతో పలు ఇబ్బందులకు గురయ్యారు. ఇదే సమయంలో ఆర్టీసీకి చెందిన మరో డ్రైవర్‌ వెంకటేశ్వర్లు కూడా కలెక్టరేట్‌ ఎదురుగా కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు, తోటి కార్మికులు అడ్డుకున్నారు. ఖమ్మంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగోట్టేలా కొన్ని వామపక్ష పార్టీల అనుబంధ సంఘాల నాయకులు కుట్రలు పన్నుతున్నారు.

నాటకీయ పరిణామాల నడుమ హైదరాబాద్‌కు..
ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో రాపర్తినగర్‌లోని తన స్వగృహంలో కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో ఆ ఇంటిపక్కనే నివాసం ఉంటున్న టూటౌన్‌ ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌ వెంటనే వెళ్లి బ్లాంకెట్‌ను కప్పి మంటలను ఆర్పారు. వెంటనే కారులో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వివిధ కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాసుపత్రికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వైద్యులు శ్రీనివాసరెడ్డిని ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్‌ ఇస్తుండగా కార్మిక సంఘాల నాయకులు వైద్యులను అడ్డుకుని చికిత్స చేయవద్దని, ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్తామని ఆందోళనకు దిగారు. వైద్యులు చెబుతున్నప్పటికీ బలవంతంగా అతన్ని కిమ్స్‌కు తీసుకువెళ్తామని చెప్పి బయటికి వచ్చాక మరో ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి కిమ్స్‌ ఆసుపత్రికి శ్రీనివాసరెడ్డిని తరలించారు. వైద్యులు చికిత్స చేసేందుకు సిద్ధపడుతుండటంతో అతని కుమారుడు తాను ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్నానని.. తన తండ్రిని హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పారు. పోలీసులు అందుకు అంగికరించి ప్రత్యేక అంబులెన్స్‌లో శ్రీనివాసరెడ్డిని హైదరాబాద్‌కు తరలించారు. అంబులెన్స్‌ వెంట కూసుమంచి ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ను ప్రత్యేక పోలీస్‌ ఎస్కార్ట్‌లో హైదరాబాద్‌ పంపారు. ఖమ్మం ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీసు అధికారులు బస్సు డిపో, బస్టాండ్‌, ప్రభుత్వ వైద్యశాల, వైరారోడ్‌ తదితర ప్రాంతాలలో బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles