ఆన్‌లైన్ బుకింగ్‌తో తక్కువ ధరకే ఇసుక


Fri,October 11, 2019 11:54 PM

-కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు నూతన ఇసుక పాలసీని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని, ఆన్‌లైన్ బుకింగ్‌తో ప్రజలక తక్కువ ధరకే ఇసుకను అందిస్తున్నట్లు కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని రాయిపాడు, సోములగూడెం నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి ఇసుక విక్రయిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 367 ట్రాక్టర్ ట్రిప్పులకు ఆన్‌లైన్ ద్వారా నమోదు కాగా 254 ట్రిప్పులు రవాణా చేయడం జరిగిందని, మిగిలిన 113 ట్రిప్పులు రవాణా చేయాల్సి ఉన్నట్లు చెప్పారు. ఇసుక రవాణాను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇసుక కేంద్రాల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను జీపీఆర్‌ఎస్ విధానం ద్వారా పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకున్న తదుపరి సంబంధిత రిజిస్ట్రేషన్ చేసుకున్న ట్రాక్టర్ యజమాని సెల్‌ఫోన్‌కు కొనుగోలు దారుని వివరాలు చేర్చబడతాయని చెప్పారు.


ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఆయా రీచ్‌లలో ఇసుక రవాణా చేసేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. సాండ్‌టాక్స్ విధానంలో ఇసుకను తరలించేందుకు ఆసక్తి ఉన్న ట్రాక్టర్ యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ చేసిన ట్రాక్టర్ యజమానులు మాత్రమే ఇసుక రవాణా చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్ విధానం ద్వారా ఇసుక విక్రయాలు చేపట్టడంతో ఆ ప్రాంత యువతకు అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయన్నారు. ఇసుక రవాణా చేసే ట్రాక్టర్‌కు కిలో మీటరుకు రూ.80 చొప్పున చెల్లించాలని, ఈ ధర నిర్ణయింపుపై ట్రాక్టర్ యజమానులతో సమావేశం నిర్వహించి నిర్ణయించామన్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చని చెప్పారు. హెల్ప్‌లైన్ నంబర్లకు 08744-241950, 7680813040 ఫోన్ చేసి తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles