పూల సింగిడి


Mon,October 7, 2019 01:42 AM

-కనుల విందుగా సద్దుల బతుకమ్మ సంబురం
-ఆడిపాడిన ఆడపడుచులు
-జిల్లావ్యాప్తంగా కోలాహలం నడుమ బతుకమ్మ నిమజ్జనం
-పాల్గొన్న విప్ రేగా, జడ్పీ చైర్మన్ కోరం, ఎమ్మెల్యేలు వనమా, హరిప్రియ


కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: పూల సింగిడి సందడి చేసింది.. సద్దుల సంబురం కనులవిందు చేసింది.. ఆడపడుచుల ఆనందం ఆకాశాన్నంటింది.. తొమ్మిదిరోజుల పాటు సంబురంగా జరుపుకున్న బతుకమ్మ వేడుకలను ఆడపడుచులు సంబురంగా జరుపుకున్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ సంబురాలు జిల్లాలో తొమ్మిది రోజుల పాటు అంగరంగవైభవంగా జరిగాయి. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకల్లో పాల్గొని చివరిరోజు ప్రకాశం స్టేడియంలో భారీ బతుకమ్మతో వేడుకలు నిర్వహించుకోగా సద్దుల బతుకమ్మ ను జిల్లా మహిళా మణులు భారీ బతుకమ్మలతో ఆడిపాడారు. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీ, మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో పూల సింగిడితో సందడి చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆడపడుచులు పెద్ద ఎత్తున బతుకమ్మ కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. చివరి రోజు ప్రతీ ఇంటా బతుకమ్మను పేర్చి ఇళ్లవాకిళ్ల ఎదుట బతుకమ్మ పాటలతో ఆడిపాడి చివరికి బతుకమ్మ ఘాట్‌ల వద్ద కూడా చిందేశారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మొర్రేడు బతుకమ్మ ఘాట్, రామవరం గోధుమవాగు ఘాట్, రుద్రంపూర్ ప్రగతివనం ధన్బాద్ చెరువు ఘాట్, పాల్వంచ బతుకమ్మ ఘాట్‌ల వద్ద భారీ బతుకమ్మలతో ఆడపడుచులు ఆడారు. ఈబతుకమ్మ ఉత్సవంలో స్థానిక కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ వైస్‌చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావులు ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు.

వేడుకల్లో పాల్గొన్న విప్ రేగా, జడ్పీ చైర్మన్ కోరం, ఎమ్మెల్యేలు వనమా, హరిప్రియ
బతుకమ్మ ఉత్సవంలో చివరిరోజు జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు పాల్గొని సందడి చేశారు. ఆడపడుచులతో ఆడిపాడి సంబురంలో పాల్గొన్నారు. గల్లీల నుంచి పట్నం వరకు చిన్నారుల నుంచి పెద్దల వరకు బతుకమ్మ ఉత్సవాలను కనుల పండువగా జరుపుకున్నారు. ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంతో ప్రభుత్వ శాఖల అధికారులు అన్ని కార్యాలయాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రోజుకొక శాఖ ఉద్యోగులు కార్యాలయాల్లో బతుకమ్మలు పేర్చి డీజే పాటలతో సందడి చేశారు. జిల్లాలోని జిల్లాలోని అశ్వాపురం మండలం మల్లెల మడుగులో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు బతుకమ్మ ఉత్సవంలో పాల్గొనగా, ఇల్లెందు నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌లు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం, పాల్వంచలో జరిగిన వేడుకల్లో జడ్పీ చైర్మన్‌తో పాటు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ వైస్‌చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, ఎంపీపీలు సోనా, బాదావత్ శాంతి, విజయలక్ష్మీ, ఎంపీటీసీ కొల్లు పద్మ, సర్పంచ్ పూనెం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ లగడపాటి రమేష్, వార్డు సభ్యులు, భధ్రాచలంలో టీఆర్‌ఎస్ ఇంచార్జి తెల్లం వెంకట్రావ్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. బతుకమ్మ ఘాట్‌ల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles