ప్రగతిపథంలో పల్లెలు..


Sun,October 6, 2019 03:11 AM

-విజయవంతమైన కార్యాచరణ ప్రణాళిక..
-ప్రాధాన్యతాంశాల వారీగా పూర్తయిన పనులు
-జిల్లాను ప్రథమస్థానంలో నిలిపేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ..


పంచాయతీల్లో గ్రామసభలు, అవగాహన ర్యాలీలు..
గ్రామసభలు, అవగాహన ర్యాలీలతో ప్రారంభమైన కార్యాచరణ ప్రణాళిక ప్రాధాన్యతాంశాలను ప్రణాళికా బద్ధంగా తీసుకొని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చారు. వర్షాకాల సీజన్ కారణంగా జిల్లాలో ఇప్పటికే విషజ్వరాలు ప్రబలి పల్లెలు ఆస్పత్రుల బాట పట్టిన నేపథ్యంలో కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆదేశాలతో తొలుత పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి పారిశుధ్యంపై యుద్ధభేరి మోగించారు. ఎవరికి వారు తమ ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకొని ఈగలు, దోమలు, ఇతర వ్యాధికారక కీటకాలు వృద్ధి చెందకుండా శానిటేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో పల్లెలన్నీ మొదటిదఫా కార్యాచరణ పూర్తయి మెరిసిపోతున్నాయి. దసరా నాటికి ప్రత్యేక కార్యాచరణ లక్ష్యంగా పెట్టుకొని చేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పల్లెలన్నీ ప్రత్యేక ప్రణాళికలో మునిగితేలాయి. దసరా ఒక నెల ముందు వచ్చినట్లు సెప్టెంబర్ 6 నుంచి ఊళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రతీ ఇంటి నుంచి ఒక మహిళ శ్రమదానం చేసి గ్రామాలను అభివృద్ధి చేసుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తమ పల్లెలను సక్కని గ్రామాలుగా తీర్చిదిద్దుకునేందుకు ఇదే సదవకాశమని భావించి ఉరకలెత్తిన ఉత్సాహంతో శ్రమదానంతో ముందుకుసాగారు.

ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో శనివారంతో ముగిశాయి. చివరి రోజు ఆయా పంచాయతీల్లో మిగిలిపోయిన పనులను పూర్తి చేశారు. పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. 30 రోజులుగా పంచాయతీల్లో చేపట్టిన కార్యాచరణ ప్రణాళిక పనుల వివరాలను చదివి వినిపించారు. పంచాయతీల అభివృద్ధికి తోడ్పాటును అందించిన గ్రామ పెద్దలు, విజయవంతంగా పూర్తి చేయించేందుకు కృషి చేసిన ప్రత్యేక అధికారులను సన్మానించారు. ప్రతీ గ్రామంలో ప్రజలు భాగస్వామ్యమై తమ ఊరిని తామే బాగు చేసుకుంటామని ముందుకొచ్చి తోడ్పాటు అందించారు. అన్ని పంచాయతీల్లో ప్రధానంగా డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డులను ఏర్పాటు చేశారు. వ్యర్థాల తొలగింపు, శిథిల భవనాల కూల్చివేత, రోడ్లవెంట మొక్కలు నాటడం, ఇంకుడు గుంతల ఏర్పాటు తదితర కార్యక్రమాలు అధికారులు నిర్వహించారు. పల్లె ప్రణాళికలో భాగంగా చివరిరోజు శనివారం జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు శిథిల భవనాలను కూల్చివేత, పడావుపడ్డ బావుల పూడ్చివేత, వ్యర్థాల తొలగింపు, ఇంకుడు గుంతల నిర్మాణంతో పాటు పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించారు. దసరాను అత్యంత శోభాయమానంగా పల్లె ప్రజలు జరుపుకోనున్నారు. చుంచుపల్లి మండలంలోని వెంకటేశ్వరకాలనీలో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. త్వరలోనే గ్రామాభివృద్ధికి తనవంతు సహకారం అందించనున్నట్లు పేర్కొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles