ఈనెల 13 నుంచి 17వ వరకు సహస్ర చండీయాగం..


Sat,October 5, 2019 01:24 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఈనెల 13వ తేదీ నుంచి 17వ వరకు కల్లూరు మండలంలోని నారాయణపురం గ్రామంలో శృంగేరీ పీఠం వారి ఆధ్వర్యంలో సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నానని, చండీమాత అనుగ్రహం జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలందరిపై ఉండాలని ఈ యాగాన్ని నిర్వహిస్తున్నాని, ప్రజలందరూ హాజరై చండీ మాత దీవెనలు పొందాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చండీయాగం ఫలితం ఉమ్మడి తెలుగు ప్రజల అందరికి చేరాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశ్యంతో ఈయాగం నిర్వహిస్తున్నామన్నారు. 5 రోజుల పాటు జరిగే యాగంలో నాలుగు రాష్ర్టాలకు చెందిన అనేక మంది పీఠాధిపతులు హాజరవుతున్నారని, వారు అందించే ప్రవచనాలను ప్రతి ఒక్కరూ పొందాలని పొంగులేటి ఆకాంక్షించారు. పీఠాధిపతులతో పాటు దేశంలోని అనేక రాష్ర్టాలలో ఉన్న ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, వివిధ వర్గాలకు చెందిన మేథావులు ప్రతి ఒక్కరూ హాజరవుతున్నారని పొంగులేటి పేర్కొన్నారు. 13వ తేదీ నుంచి ప్రతి రోజు ఉదయం 8 గంటలకు యాగం ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు పూర్తవుతుందని, తిరిగి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటలకు ముగుస్తుందన్నారు.


ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కూడా ఆహ్వానించానని ఆయన తప్పకుండా హాజరయ్యే అవకాశం ఉందని పొంగులేటి స్పష్టం చేశారు. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 200ల మంది రుత్వికులు హాజరవుతున్నారని, ఈ యాగం నిర్వహణలో వారందరూ పాలుపంచుకుంటారన్నారు. ఈ సహస్ర చండీ యాగం శృంగేరీ జగద్గురులు శ్రీశ్రీశ్రీ భారతీతీ మహా స్వామి వారు, శ్రీశ్రీశ్రీ విధిశేఖర భారతీ స్వామి వారి సంపూర్ణ కరుణ, కటాక్ష వీక్షణములతో, వారి మార్గదర్శకంలో వంద సప్తశతి హోమము, లక్ష మూలమంత్ర అవనము కొనసాగి అపూర్వ ఫలాలను అందిస్తుందన్నారు. సకల జనులు సౌభాగ్యాన్ని, సుఖసంతోషాలను అందించేందుకే ఈ యాగాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ యాగంలో పాలుపంచుకుని చండీ మాత ఆశీర్వాదాన్ని దీవెనలను పొందాలన్నారు. మేయర్ పాపాలాల్ మాట్లాడుతూ తెలుగు ప్రజల సంక్షేమం, ఆరోగ్యం బాగుండాలని చండీ మాత యాగాన్ని నిర్వహిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానన్నారు. అనంతరం సహస్ర చండీ యాగం పోస్టర్‌ను పొంగులేటి ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, బొర్రా రాజశేఖర్, ఆకుల మూర్తి, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, పొంగులేటి కార్యాలయ ఇన్‌చార్జీ తుంబూరు దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles