నయా లిక్కర్ పాలసీ..


Fri,October 4, 2019 12:30 AM

-నవంబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి
-దరఖాస్తు ఫీజు ఈ సారి రూ.2లక్షలు
-జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజు...
-నాలుగు స్లాబ్‌ల నుంచి ఆరు స్లాబ్‌లకు మార్పు
-నిబంధనలు విడుదల చేసిన ప్రభుత్వం
-దుకాణాల కైవసం కోసం వ్యాపారస్తుల కసరత్తు..


భద్రాచలం, నమస్తే తెలంగాణ అక్టోబర్ 3 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను కూడా విడుదల చేసింది. త్వరలోనే జిల్లాల వారిగా కలెక్టర్లు మద్యం దుకాణాల నోటిఫికేషన్లు వెలువరించనున్నారు. గతేడాది లాగానే ఈ సారి కూడా లాటరీ పద్ధతిలో వ్యాపారస్తులకు షాప్‌లను కేటాయించనున్నారు. గతేడాది రూ.లక్ష దరఖాస్తు ఫీజు ఉండగా, ఈ సారి రూ.2లక్షలకు పెంచారు. జనాభా ప్రాతిపదికపై లైసెన్స్ ఫీజులు వసూలు చేయనున్నారు. నాలుగు స్లాబ్‌ల నుంచి 6 స్లాబ్‌లకు పెంచారు. నవంబర్1 నుంచి కొత్త మద్యం పాలసీ విధానం అమల్లోకి రానుంది. 2021 అక్టోబర్31 వరకు రెండేళ్ల పాటు మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు కేటాయించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చి గురువారం గెజిట్ విడుదల చేసింది. నవంబర్1 నుంచి 2021 అక్టోబర్31వ తేదీ వరకు మద్యం దుకాణాలను నిర్వహించుకోవచ్చు. మద్యం దుకాణాల కోసం నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజును రూ.2లక్షలుగా నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా దుకాణాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి షాప్‌ల లైసెన్స్‌లను కేటాయిస్తారు. కొత్త లిక్కర్ పాలసీ ప్రకారం జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను వసూలు చేయనున్నారు. గతంలో ఉన్న నాలుగు స్లాబ్‌లకు బదులు 6 స్లాబ్‌లుగా మార్చారు. 5వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50లక్షల లైసెన్స్ ఫీజు, 5వేల నుంచి 50వేల వరకు జనాబా ఉన్న ప్రాంతాలకు రూ.55లక్షలు, 50వేల నుంచి లక్ష జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.60లక్షలు, లక్ష నుంచి 50లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతాలకు 65లక్షలు, 5లక్షల నుంచి 20 లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.85లక్షలు, 20లక్షలకు పైగా ఉన్న ప్రాంతాలకు రూ.1కోటి 10లక్షల లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు.

త్వరలో నోటిఫికేషన్..
2017-18, 2018-19 సంవత్సరానికి గాను నిర్వహించిన మద్యం వ్యాపారస్తుల షాప్‌ల లైసెన్స్ సెప్టెంబర్‌తోనే గడువు ముగిసింది. అక్టోబర్1 నుంచే నూతన మద్యం విధానం అమలవ్వాల్సి ఉన్నప్పటికీ పాత లైసెన్స్‌ల గడువును అక్టోబర్31 వరకు ప్రభుత్వం ఇటీవల పొడిగించింది. అయితే నవంబర్1 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇక మద్యం వ్యాపారస్తుల దృష్టి కొత్తషాప్‌లపైనే నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఉభయ జిల్లాల్లో మొత్తం 165 వైన్‌షాప్‌లు, 47 బార్లు ప్రస్తుతం ఉన్నాయి. 2017-18 సంవత్సరంలో 27లక్షల 37వేల 87 లిక్కర్ కేసులు అమ్మకాలు జరిగాయి. 17లక్షల 51వేల 55 బీరు కేసులు విక్రయించారు. వీటి ద్వారా రూ.1243కోట్ల 71లక్షల ఆదాయం ప్రభుత్వానికి లభించింది. 2018-19 సంవత్సరంలో 28లక్షల 37వేల 391 లిక్కర్ కేసులు అమ్మారు. 17లక్షల 3వేల 498 బీరు కేసులు విక్రయించారు. వీటి ద్వారా రూ.1297కోట్ల 98లక్షల ఆదాయం లభించింది. త్వరలోనే జిల్లాల వారిగా నోటిఫికేషన్ కలెక్టర్లు విడుదల చేయనున్నారు. అయితే ఉభయ జిల్లాల్లో మద్యం దుకాణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ వ్యాపారస్తులతో పాటు ఈసారి ఆంధ్రా వ్యాపారస్తులు కూడా ఈ మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆంధ్రాలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వారంతా తెలంగాణ మద్యం దుకాణాలపై కన్నేసినట్లు సమాచారం.

75
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles