హుజూర్‌నగర్‌లో.. ఖమ్మం గులాబీ దళం


Wed,October 2, 2019 02:33 AM

-మండలాలకు ఇన్‌చార్జులుగా జిల్లా నాయకులు
-మంత్రి అజయ్ ఆదేశంతో ఉప ఎన్నిక బాధ్యతలు
-ఎమ్మెల్సీ పల్లా నేతృత్వంలో కార్యాచరణ అమలు
-టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయానికి నేతల కృషి
తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతో ఖమ్మం జిల్లాకు చెందిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మార్గదర్శకత్వంలో ఖమ్మం జిల్లా గులాబీ దళం హుజూర్‌నగర్‌కు పయనమైంది. ఈ నెల 21న అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో పోటీచేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం గులాబీ నాయకులు ఆ నియోజకవర్గ పరిధిలో పలు కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గురించి ఓటర్లకు వివరిస్తున్నారు.


(ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ)
టీఆర్‌ఎస్ పార్టీ హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఇన్‌చార్జ్, శాసనమండలి సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి మార్గదర్శకత్వంలో మండలాలు, గ్రామాల బాధ్యతలను తీసుకొని అక్కడే ఉంటూ పార్టీ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. వీరిలో ఖమ్మం జిల్లాకు చెందిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, టీఆర్‌ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు కమర్తపు మురళీ, కేఎంసీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళీప్రసాద్‌లకు కీలక బాధ్యతలను అప్పగించారు. వీరికి తోడుగా పలువురు కార్పొరేటర్లు కూడా గ్రామాలకు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఏఎంసీ మాజీ చైర్మన్ గుండాల కృష్ణలు నియోజకవర్గ స్థాయి సమావేశాలకు హాజరవుతున్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివిధ కుల సంఘాల నాయకులతో నిర్వహించే సమావేశాల్లోనూ పాల్గొననున్నారు.

మండలాలకు ఇన్‌చార్జులుగా ఖమ్మం నేతలు.
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో హుజూర్‌నగర్, నేరేడుచర్ల, గరిడపల్లి, మట్టంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, పాలకీడు మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో మట్టంపల్లి, హుజూర్‌నగర్, నేరేడుచర్ల మండలాలోని అత్యధిక ఓటర్లకు ఖమ్మం నగరంలోని ప్రజలతో బంధుత్వాలు, సంబంధాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గ ఇన్‌చార్జ్ పల్లా రాజేశ్వరరెడ్డి నేరేడుచర్ల మండలానికి టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్‌లను ఇన్‌చార్జులుగా నియమించారు. వీరికి సహాయకులుగా ఖమ్మం 26వ డివిజన్ కార్పొరేటర్ పగడాల నాగరాజు, మరికొంత మంది నాయకులను కేటాయించారు. హుజూర్‌నగర్ రూరల్ మండలానికి టీఆర్‌ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు కమర్తపు మురళీ, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ ప్రసాద్‌లను ఇన్‌చార్జులుగా నియమించారు. వీరిలో కమర్తపు మురళీకి అమరవరం, అంజలిపురం, లింగగిరి, శ్రీనివాసపురం గ్రామాలకు ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈయనకు తోడుగా ఖమ్మం నగర కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్ నాయకులైన ఆళ్ల అంజిరెడ్డి, పాలడగు పాపారావు, నీలం కృష్ణా, కొత్తా నరసింహారావు, మాటేటి నాగేశ్వరరావు, రుద్రగాని ఉపేందర్, కనకం భద్రయ్య, ఊటూకూరి రవికాంత్, బుర్రి వినయ్‌లను నియమించారు. బత్తుల మురళీ పరిధిలోని గ్రామాలకు నాగండ్ల కోటి, శీలంశెట్టి వీరభద్రం, బిక్కసాని జశ్వంత్, మందడపు మనోహర్, మచ్చా నరేందర్, కురాకుల వలరాజు, పోట్ల వీరేందర్‌లను కేటాయించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణకు మట్టంపల్లి మండలంలోని ఏడు గ్రామాల పరిధిలోని 11 బూత్‌లకు ఇన్‌చార్జ్ బాధ్యతలను అప్పగించారు. వీరందరినీ బూత్‌ల వారిగా విభజించి బాధ్యతలను అప్పగించారు.

సైదిరెడ్డి గెలుపే లక్ష్యంగా..
ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులకు హుజూర్‌నగర్ ఉప ఎన్నిక బాధ్యతలను పార్టీ అప్పగించడంతో వారందరూ 4 రోజుల క్రితమే హుజూర్‌నగర్‌కు పయనమయ్యారు. వారికి కేటాయించిన బాధ్యతల్లో నాయకులు నిమగ్నమయ్యారు. ఆయా గ్రామాల ఓటర్లతో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తూ బూత్‌ల వారీగా ప్రజల నాడిని తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తున్నారు. తెలంగాణాలో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు జరుగుతున్న ప్రయోజనాలను కూడా వివరిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కృష్ణా, గోదావరి నదులపై నిర్మించే పలు ప్రాజెక్టుల కారణంగా జరిగే ప్రయోజనాలను రైతులకు చెబుతూ సైదిరెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే రైతుబంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ పథకాలను వివరిస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా నిరుపేద మహిళలకు జరిగే ప్రయోజనాలను చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాలయాల ద్వారా లభించే ఉన్నత చదువుల వల్ల జరిగే ప్రయోజనాలను చెబుతున్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles