బీటీపీఎస్‌లో యూనిట్-1 సింక్రనైజేషన్ విజయవంతం


Thu,September 19, 2019 11:55 PM

- భద్రాద్రి పవర్‌ప్లాంట్ రాష్ర్టానికి ఉపయోగం..
- సమష్టి కృషితో వచ్చే మార్చి వరకు 4 యూనిట్ల నుంచి పూర్తిస్థాయి విద్యుత్ సరఫరా చేస్తాం
- షెడ్యూల్ ప్రకారం నిర్మాణ పనులు వేగవంతం
- రాష్ట్ర అవసరాలకు విద్యుత్ సరఫరా ఇక్కడి నుంచే..
- జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు


మణుగూరు, నమస్తే తెలంగాణ : సమష్టికృషితో వచ్చే డిసెంబర్ కల్లా 3 యూనిట్లు పూర్తి చేస్తామని, మార్చి కల్లా 4వ యూనిట్ కూడా పూర్తిచేసి అన్ని యూనిట్‌ల నుంచి పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేస్తామని, భద్రాద్రి పవర్‌ప్లాంట్ రాష్ర్టానికి ఎంతో ఉపయోగమని, మొదటి యూనిట్‌లో నిర్వహించిన సింక్రనైజేషన్ విజయవంతమైందని జెన్కో అండ్ ట్రాన్స్‌కో సీఅండ్‌ఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. ఆయన గురువారం మణుగూరు, పినపాక మండలాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 1080(270x 4)మెగావాట్ల సామర్థ్యం గల భద్రాద్రి థర్మల్ పవర్‌స్టేషన్‌లో యూనిట్-1 సింక్రనైజేషన్ స్విచ్ అన్‌చేసి గ్రిడ్‌కు అనుసంధానంను ప్రారంభించారు. అక్కడ జరుగుతున్న మిగతా యూనిట్ల నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి 2015 మార్చి 28న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి సారి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేశారన్నారు. ఇది సీఎం కేసీఆర్ మానస పుత్రిక అన్నారు. ఇప్పటికే భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు పూర్తి కావాలని, ఎన్జీటీ స్టే వలన జాప్యం జరిగిందన్నారు. తిరిగి 2017 ఏప్రిల్ పనులు ప్రారంభించామన్నారు. అదేవిధంగా ఇక్కడ ఎండలు, వర్షాలు కూడా ఎక్కువ ఉన్నాయని అయినప్పటికీ పనులు స్పీడుగా జరుగుతున్నాయని, షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయన్నారు. రూ.8536 కోట్ల పెట్టుబడితో విద్యుత్‌ప్లాంట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.

ఈ ఏడాది డిసెంబర్ కల్లా 3 యూనిట్లు ఫుల్ లోడింగ్ చేస్తామన్నారు. మార్చికల్లా 4వ యూనిట్ పూర్తి చేస్తామన్నారు. అదే విధంగా త్వరలోనే మిగతా 2,3 యూనిట్లలో కూడా సింక్రనైజేషన్ చేస్తామని, పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రాజెక్టు రాష్ర్టానికి, ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భద్రాద్రి విద్యుత్ అవసరం రాష్ర్టానికి ఎంతో ఉంటుందన్నారు. ఈ విద్యుత్ ప్రాజెక్టు పూర్తైతే రాష్టంలో 24 గంటల విద్యుత్ సరఫరాలో ఎంతగానో ఉపయోగం ఉంటుందని, ఇక్కడ బీటీపీఎస్ సీఈ బాలరాజు, జెన్కో డైర్టెకర్లు ఆధ్వర్యంలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, అందరు ఇంజనీర్లు కూడా షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేసేందుకు కష్టపడి పనిచేస్తున్నారన్నారు. ఇక్కడి ఇంజనీర్లు, బీహెచ్‌ఈఎల్ అధికారులు, కార్మిక శ్రామికులు చిత్తశుద్ధితో శ్రమించడం వల్లనే సాధ్యమైందన్నారు. డిసెంబర్ లోపు 4 యూనిట్లు కమీషన్ పూర్తిచేసి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే మార్చి లోపు పూర్తిస్థాయిలో 4 యూనిట్ల నుంచి విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. తొలుత యూనిట్-1లో సింక్రనైజేషన్‌లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్లు ఎం సశ్ఛితానందం, ఏ అజయ్, వెంకటరాజ్యం, టీఆర్‌కే రావు, బీటీపీఎస్ సీఈ పిల్లి బాలరాజు, సీఈ (టీపీసీ) పీవీ శ్రీనివాస్, బీహెచ్‌ఈఎల్ ఈడీ చక్రవర్తి, జనరల్ మేనేజర్ అగర్వాల్, జెన్కోఎస్‌ఈలు మహేందర్, వీరేశం, నాగేశ్వరరావు, జెన్కో, బీహెచ్‌ఈఎల్ ఇంజనీర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సీఅండ్‌ఎండీకి ఘనస్వాగతం..
అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రప్రభుత్వం మణుగూరు, పినపాక మండలాల్లో నిర్మిస్తున్న 1080 (270x 4)మెగావాట్ల సామర్థ్యంగల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో యూనిట్-1లో సింక్రనైజేషన్ ప్రారంభించేందుకు గురువారం విచ్చేసిన జెన్కో అండ్ ట్రాన్స్‌కో సీఅండ్‌ఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుకు జెన్కో అధికారులు, ఇంజనీర్లు, భేల్ అధికారులు, ఇంజనీర్లు ఘనస్వాగతం పలికారు. బీటీపీఎస్ సీఈ పిల్లి బాలరాజు ఆధ్వర్యంలో సీఅండ్‌ఎండీకి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్లు, భేల్ అధికారులు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles