మావోయిస్టుల ఇలాకాలో కలెక్టర్ పర్యటన


Thu,September 19, 2019 01:07 AM

చర్ల రూరల్: అది ఛత్తీస్‌ఘడ్‌కు సరిహద్దుగా చర్ల మండల పరిథిలోని దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న ఆదివాసీ గ్రామం కుర్నపల్లి. ఇది తీవ్ర మావోయిస్టు ప్రభావిత కుగ్రామం. ఇక్కడ కిడ్నాప్‌లు, ఎదురుకాల్పులు వంటి సంఘటనలు జరుగుతుంటాయి. మండల కేంద్రమైన చర్లకు సుమారు 30 కిమీ దూరంలో ఉన్న ఈ గ్రామానికి తెలంగాణ ప్రభుత్వం తారురోడ్డు నిర్మించినప్పటికీ వంతెనల నిర్మాణం ఇంకా రెండు వాగులపై పూర్తికాలేదు. అలాంటి మారుమూల మావోయిస్టు ప్రభావిత గ్రామానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలక్టర్ రజత్‌కుమార్ శైనీ బుధవారం ఎలాంటి పోలీసు బందోబస్తు లేకుండా కనీసం మండల అధికారులకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా వాగులు దాటుకుంటూ కుర్నపల్లి వెళ్ళి అక్కడి ఆదివాసీలను ఆశ్చర్య పర్చారు. ఊహకందని విధంగా తమ గ్రామానికి జిల్లా కలక్టర్ వచ్చారని తెలియగానే గ్రామస్థులు సంభ్రమాశ్చర్యాలకు గురైనారు. గ్రామంలో పల్లె ప్రగతిలో చేపట్టిన పారిశుద్య పనులను కలక్టర్ పరిశీలించారు. గ్రామస్థులతో ముచ్చటిస్తూ 30 రోజుల ప్రణాళికలో ఏమేమి పనులు చేస్తున్నారని ఆరా తీశారు. గ్రామంలో సగం మందికి ఇంకా పాసుపుస్తకాలు అందలేదని గిరిజన యువకుడు సోడి నాగేశ్వరరావు పిర్యాదు చేయగా, వెంటనే బయలుదేరి చర్ల తహశీల్దార్ కార్యాలయానికి వస్తే ఎందుకు రాలేదనేది తెలుసుకొని అక్కడే తగు చర్యలు తీసుకుంటానని చెప్పారు.


పాఠశాల హెచ్‌ఎం, అంగన్‌వాడీ టీచర్లతో మాట్లాడి పిల్లల హాజరు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకొన్నారు. పాఠశాల ఆవరణలో దశాబ్దకాలంనాడు అసంపూర్తిగా పనులు నిలిచిపోయి శిథిలావస్థలో ఉన్న భవనాన్ని వెంటనే కూల్చి ఆ రాళ్ళను బురదగుంటల్లో పోయించి గోతులు పూడ్చాలని స్పెషల్ ఆఫీసర్ రాంప్రసాద్‌ని కలక్టర్ ఆదేశించారు. గ్రామస్థులు భాగస్వాములై పల్లె ప్రగతి కార్యక్రమంలో ఊరుని బాగుపర్చుకోవాలని కోరారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఎర్రబోరు, దానవాయిపేట గ్రామాలలో ఆగి పల్లె ప్రగతి పనులు పరిశీలించి గ్రామస్థుల సమస్యలు తెలుసుకొన్నారు. ముందస్తు సమాచారం లేనందున తహశీల్దార్, ఎంపీడీవోలు ఆయన వెంట కుర్నపల్లికి వెళ్ళలేకపోయారు. ఒకవైపు వాగులు, మరోవైపు మావోయిస్టుల సమస్య వలన మారుమూల అటవీగ్రామానికి వెళ్ళిన కలక్టర్ తిరిగివచ్చే వరకు తహశీల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో నవాబ్‌పాషాలు హైటెన్షన్‌తో ఆర్.కొత్తగూడెం జంక్షన్‌లో పడిగాపులు పడ్డారు. కలక్టర్ తిరిగివచ్చాక అందరు ఊపిరి పీల్చుకున్నారు. కుర్నపల్లి నుంచి తిరిగివచ్చిన కలక్టర్ చర్లకు చేరుకొని పల్లె ప్రగతిపై మండల అధికారులతో సమీక్షించారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles