కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలి


Wed,September 18, 2019 12:34 AM

ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 17: భారత పత్తి సంస్థ (సీసీఐ) పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేందుకు గాను ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నగర వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశమందిరంలో జేసీ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మార్కెటింగ్‌శాఖ, వ్యవసాయశాఖ, అగ్నిమాపక, తూనికలు కొలతలు, పోలీస్, తదితరశాఖల అధికారులు హాజరయ్యారు. జిల్లాలో ఈ సంవత్సరం సాగు చేసిన పత్తి విస్తీర్ణం, తద్వారా వచ్చే దిగుబడి తదితర అంశాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఝాన్సీలక్ష్మీకుమారి వివరించారు. అనంతరం జేసీ ఆయా మార్కెట్ కమిటీల కార్యదర్శుల నుంచి వివరాలను అడిగితెలుసుకున్నారు. అక్టోబర్ నెల 15వ తేదీ వరకు మార్కెట్‌కు పత్తిపంట అమ్మకానికి వచ్చే అవకాశం ఉందని జేసీ అన్నారు. మరికొద్ది రోజుల్లోనే సీసీఐకి సంబంధించిన సెంటర్లు ప్రకటించనున్నామన్నారు. ఖమ్మం, నేలకొండపల్లి, మధిర, ఏన్కూరు మార్కెట్లలో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వీటితో పాటు జిల్లాలోని ఆయా జిన్నింగ్ మిల్లుల వద్ద సైతం కొనుగోళ్లు చేపట్టనున్నట్టు చెప్పారు. మార్కెట్లలో తేమశాతం నిర్ధారించే యంత్రాలు, వేబ్రిడ్జిలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. మార్కెట్‌ల పరిధిలో అగ్నిమాఫక యంత్రాలను సిద్ధంగా ఉంచాలలని ఆదేశించారు. ఖమ్మం మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య రాకుండా పోలీస్ అధికారులు తగు కార్యాచరణ చేపట్టాల్సి ఉందన్నారు. పంట నాణ్యత ప్రమాణాలు, సీసీఐ అందించే మద్దతు ధరపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని జేసీ పేర్కొన్నారు. సీసీఐ కొనుగోళ్లకు ముందు మరోమారు సమావేశం నిర్వహించి కొనుగోళ్ల ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డీఎంఓకు సూచించారు.


కొర్రీలు పెట్టకుండా కొనుగోళ్లు చేయాలి : ఏఎంసీ చైర్మన్
రైతుల నుంచి పంట కొనుగోలు చేసే సమయంలో కొర్రీలు పెట్టొద్దని ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ అన్నారు. సాధ్యమైనంతవవరకు రైతులకు ప్రయోజనం చేకూరే రీతిలో విక్రయాలు చేపట్టాలన్నారు. పంట కొనుగోలు చేసి సకాలంలో రైతులకు సొమ్ము చెల్లించాలని సూచించారు. ఖమ్మం మార్కెట్‌కు సంబంధించి అగ్ని మాపక వాహనం తక్షణం మార్కెట్ పరిధిలోకి తీసుకరావాలని ఆయన ఫైర్ అధికారులకు తెలిపారు. సీసీఐ కేంద్రానికి అవసరమైన పరికరాలు, మౌలిక వసతులకు నగర మార్కెట్‌లో లోటు లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి ఆర్ సంతోష్‌కుమార్, తూనికలు కొలతలశాఖ అధికారి ఉమాదేవి, వర్తక సంఘం ప్రధాన కార్యదర్శి గొడవర్తి శ్రీనివాసరావు, త్రీటౌన్ సీఐ శ్రీధర్, ఏడీఏ బీ సరిత, కార్మిక సంఘం నాయకులు నున్నా మాధవరావు, నీలం కృష్ణ, జిల్లాలోని ఆయా మార్కెట్ కమిటీల కార్యదర్శులు, సీసీఐ అధికారులు, ఫైర్ అధికారులు, ఖమ్మం మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles