శాస్త్రవేత్తలుగా ఎదగాలి


Tue,September 17, 2019 02:39 AM

ఖమ్మం ఎడ్యుకేషన్ : శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని నేటి బాలలు భావి భారత గొప్ప శాస్త్రవేత్తలు కావాలని ఖమ్మం జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక అన్నారు. ఖమ్మంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్‌లో రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్త్ను 27వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సైన్స్ నేర్చుకునే క్రమంలో విద్యార్థులు ఆసక్తిని కనబర్చి వివిధ విషయాలను కూలంకషంగా అర్థం చేసుకోవాలన్నారు. విద్యార్థులు తడబడకుండా సైన్స్ నేర్చుకునే క్రమంలో ఆనందాన్ని ఆస్వాధించాలన్నారు. తద్వారా శ్రమను, కష్టాన్ని దూరం చేయవచ్చన్నారు. పలు స్థానిక సమస్యలకు శాస్త్రీయ పద్ధతుల్లో పరిష్కారాలు చూపించవచ్చని బాల శాస్త్రవేత్తలను సూచించారు. సైన్స్ ప్రాథమిక సూత్రాలను సరిగ్గా అర్థం చేసుకుని తద్వారా తమ పరిసరాల్లో పరిష్కరించేకు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ పరిశీలకులు గీతా స్వామినాథన్ మాట్లాడుతూ సైన్స్ పరిపూర్ణమైన విషయాలు తెలుసుకొనుటలో విద్యార్థులు సంపూర్ణ స్థాయిలో నిమగ్నమవ్వాలని, ఇందుకు ఎన్‌సీఎస్‌సీ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఎన్‌సీఎస్‌సీ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని, నిర్ణయించిందని, ఇందుకు సహకరించిన తెలంగాణ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు, కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులకు టీఎస్ కాస్ట్ తరఫున ఎన్‌సీఎస్‌సీ సెక్రటరీ పులి రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు.


నూతన ఆవిష్కరణలు చేయాలి : డీఈవో మదన్‌మోహన్
సైన్స్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని నూతన ఆవిష్కరణలు తయారుచేయాలని డీఈవో పొన్నూరు మదన్‌మోహన్ కోరారు. దేశ శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల ప్రతిభను పరిక్షించుకుంటూ మెరుగ్గా రాణించాలని ఆకాంక్షించారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలే అని, అందరికి అవకాశం రాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాలు, దూర, గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులకు అభినందనలు తెలిపారు. 139 ప్రాజెక్టుల్లో జనాభా ప్రాతిపదికన, తెలంగాణ రాష్ట్రం కోటా కింద 13 ప్రాజెక్టులు ఎంపిక అయ్యాయాన్నారు. జాతీయ స్థాయిలో సైతం ప్రతిభ కనబర్చాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 27 నుంచి 31వ తేదీ వరకు కేరళలో నిర్వహించచే జాతీయ స్థాయి ప్రదర్శనలో విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. ప్రాజెక్టులకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన వివిధ యూనివర్సిటీలకు చెందిన 16మంది ప్రొఫెసర్లను సర్టిఫికెట్లు అందజేశారు. రాష్ట్ర స్థాయి సదస్సుకు సహకరించిన హార్వెస్ట్ పాఠశాల కరస్పాండెంట్ పోపూరి రవిమారుత్, ప్రిన్సిపాల్ రామసహాయం పార్వతిరెడ్డిలను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ కాశీనాథ్, డీఎస్‌వో సైదులు, జిల్లా కోఆర్డినేటర్ ఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles