పల్లెపల్లెనా ప్రగతి చైతన్యం


Mon,September 16, 2019 01:12 AM

- పల్లెల్లో 30 రోజుల కార్యాచరణ..
- గ్రామస్తులతో కలిసి అధికారుల పాదయాత్రలు, విస్తృత సమావేశాలు
- ప్రాధాన్య క్రమంలో పనుల గుర్తింపు
- పారిశుద్ధ్యం, హరితహారం, వీధిదీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
- వార్షిక, పంచవర్ష ప్రణాళికల రూపకల్పనలో తలమునకలు


కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల పల్లె ప్రణాళిక పండుగలా సాగుతోంది. పల్లెపల్లెనా ప్రగతి చైతన్యం వెల్లివిరుస్తున్నది. అన్ని జీపీల్లోనూ కో ఆప్షన్ స్థాయి సంఘాల సభ్యులను ఎన్నుకొని గ్రామాల్లో పాదయాత్రలు చేస్తూ సమస్యలను జల్లెడ పడుతున్నారు. పారిశుద్ధ్యం, హరితహారం, వీధిదీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి కార్యక్రమాలు ప్రారంభించారు. వార్షిక, పంచవర్ష ప్రణాళికలను రూపొందించుకునేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి ప్రణాళికపై మొదటి రోజు నుంచే గ్రామీణ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ప్రతీ గ్రామ సభలో సీఎంకేసీఆర్ ఇచ్చిన సందేశాన్ని చదివి వినిపించారు. ప్రత్యేక ప్రణాళిక ఉద్దేశాలు, లక్ష్యాలను వివరించారు. గ్రామాలను పరిశుభ్రంగా మార్చుకోవడం, పచ్చదనం పెంచే కార్యక్రమాలను చేపట్టడం, ప్రజల భాగస్వామ్యాన్ని విస్తృతంగా పెంపొందించడం, వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారు చేయడం, నిధుల వినియోగం, ప్రజా ప్రతినిధులు, అధికారుల్లో జవాబుదారీతనం పెంచడం వంటి ప్రధాన లక్ష్యాలతో చేపట్టిన ఈ కార్యక్రమంపై రోజురోజుకూ ప్రజల్లో ఆసక్తి కలుగుతోంది.

గ్రామాల్లో వెల్లివిరుస్తున్న చైతన్యం
పల్లె ప్రగతి ప్రణాళికపై ప్రజల్లో అవగాహన పెరిగింది. పంచాయతీలు, అధికారులు చేపట్టిన విస్తృత ప్రచారంతో తమ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలనే సంకల్పం ప్రతీ గ్రామంలో కనిపిస్తోంది. ఈ నెల 9 నుంచి గ్రామాల్లో అధికారులు, స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఉప సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు, కో ఆప్షన్ సభ్యులు, స్థాయి సంఘాల సభ్యులు పాదయాత్రలు చేపట్టారు. ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు కూడా పాల్గొని ప్రజల్లో ఉత్సాహం నింపుతున్నారు. వీధుల్లో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను గుర్తిస్తున్నారు. ప్రధానాంశాలు పారిశుద్ధ్యంలో కూలిన ఇండ్లు, పాడుపబడిన పశువుల కొట్టాలు, వీధుల్లో పిచ్చిమొక్కల తొలగింపు, పాడుబడిన బావుల పూడ్చివేత, నిరుపయోగ బోర్ల తొలగింపు, మురుగు కాలువలను శుభ్రం చేయడం, సంతలు, మార్కెట్ల ప్రదేశాలను శుభ్రం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రతీ ఇంట్లో తడి, పొడి చెత్తబుట్టల ఏర్పాటు, చెత్తను డంపింగ్ యార్డుల్లోనే వేసేలా స్థానికులను ప్రోత్సహించడం వంటి ప్రధాన అంశాలతో పాటు వైకుంఠ దామాలకు స్థలాలను గుర్తిస్తున్నారు.

ప్రణాళికల తయారీకి సిద్ధం
పత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం, విద్యుత్ సమస్యలపై వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించారు. ప్రణాళిక తయారీలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులతో పాటు తాజాగా ఎన్నుకున్న కో ఆప్షన్ సభ్యులు, నాలుగు రకాల స్థాయి సంఘాల సభ్యులు కీలకం. పాదయాత్రల్లో గుర్తించిన సమస్యలను శ్రమదానాల ద్వారా కూడా పరిష్కరించుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలి. ప్రతీ గ్రామంలో యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామైక్య సంఘాలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసి గ్రామాల్లో శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం అందించిన సూచనల్లో పేర్కొంది. మహిళా సంఘాలను ప్రత్యేకంగా కేటాయించాలని కూడా నిర్ణయించారు.

అధికారుల విస్తృత పర్యవేక్షణ
గ్రామాల్లో నిర్వహిస్తున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను జిల్లా, మండలాల అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. మండలానికి ఒక జిల్లాస్థాయి అధికారిని కూడా ప్రత్యేక అధికారులుగా నియమించారు. వీరు కాకుండా ఎంపీడీవోలు, ఎంపీవోలు కూడా గ్రామాల్లో చేపడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆయా గ్రామాల్లో పర్యటించి కార్యక్రమం అమలు తీరును పరిశీలించి, ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారా..? లేదా.. అని రికార్డులు తనిఖీ చేస్తున్నారు. గ్రామాల్లోని వీధుల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. వీధుల్లో ఉన్న పిచ్చిమొక్కలను శ్రమదానం ద్వారా తొలగించేందుకు ప్రణాళికలు చేసుకోవాలని స్థానిక సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు సూచిస్తున్నారు. స్థానికంగా నిర్వహిస్తున్న నర్సరీలను పరిశీలించి అక్కడ ఎలాంటి మొక్కలు ఉన్నాయి.. 30 రోజుల ప్రణాళికపై గ్రామాల్లోని గోడలపై నినాదాలు రాయాలని, ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యం విస్తృతంగా పెంచాలని, అలాంటప్పుడే గ్రామాల్లో సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయని స్పష్టం చేస్తున్నారు. పాదయాత్రల ద్వారా గుర్తించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు అవసరమైన వార్షిక, పంచవర్ష ప్రణాళికలను గ్రామసభలు ఏర్పాటు చేసి అందరి సమక్షంలో రూపొందించాలని సూచిస్తున్నారు. శ్రమదానంలో యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలని సూచిస్తున్నారు. జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు, డీఈవో వాసంతి, డీపీవో ఆశాలత, డీఆర్‌డీవో జగత్‌కుమార్‌రెడ్డి, డీఎంహెచ్‌వో భాస్కర్‌నాయక్, ఆర్డీవో స్వర్ణలత, కో ఆపరేటిప్ అధికారి మైఖేల్ బొస్, మత్యశాఖ అధికారి వరదారెడ్డి, ఈడీ పులిరాజు, డీఎస్‌డీవో సల్మాభాను, ఐసీడీఎస్ పీడీ శారద గ్రామాల్లో పర్యటించారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles