తల్లిదండ్రుల చెంతకు పారిపోయిన విద్యార్థులు


Sat,September 14, 2019 11:59 PM

వేంసూరు, సెప్టెంబర్ 14 : ఓ ప్రైవేటు పాఠశాలలోని ఇద్దరు విద్యార్థులు శుక్రవారం రాత్రి హాస్టల్ నుండి ఎవరికి చెప్పకుండా పారిపోయిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.....మండలపరిధిలోని మొద్దులగూడెం గ్రామంలో వివేకానంద ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వంశీ,రాహుల్ అనే ఇద్దరు విద్యార్థులు హాస్టల్‌లో ఉండి విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు విద్యార్థులు శుక్రవారం రాత్రి హాస్టల్‌లో భోజనాలు చేసిన అనంతరం బైటకు వెళ్ళే ప్రయత్నంలో గోడ దూకి పారిపోవడం జరిగింది. కొంత సమయం తర్వాత హాస్టల్ రూంలను పరిశీలించిన సిబ్బంది ఇద్దరు విద్యార్థులు గోడ దూకి పారిపోయినట్లు తోటి విద్యార్థుల ద్వారా తెలుసుకున్న యజమాన్యం వెంటనే ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారాన్ని అందించారు. కాగా ఈ ఇద్దరు విద్యార్థులు జ్వరంతో బాధపడుతూనే హాస్టల్‌లో విశ్రాంతి తీసుకుంటూ తోటి విద్యార్థులతో తాము ఇంటికి వెళుతున్నట్లు చెప్పారు. దీనితో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, బంధువులు అర్ధరాత్రి వరకు ఇళ్ళకు చేరకపోవడంతో వారి కోసం సత్తుపల్లి, తిరువూరు బస్టాండ్, సినిమా హాల్స్‌లో గాలించారు. అయినప్పటికీ వారి జాడ తెలియలేదు. కాగా రెండు రోజుల క్రితం తోటి విద్యార్థులతో విజయవాడ, అమరావతి చూసి రావాలనే చర్చ జరిగినట్లు తెలిసింది.


ఈ నేపథ్యంలో పాఠశాల యజమాన్యం, తల్లిదండ్రులు విజయవాడలో బస్టాండ్, రైల్వే స్టేషన్, పార్కులలో గాలించారు. శనివారం సాయంత్రం వరకు వారి ఆచూకీ కోసం ప్రయత్నించగా విజయవాడ బస్టాండ్‌లో ఇరువురు విద్యార్థులున్నట్లు గుర్తించారు. అప్పటికే వంశీ అనే విద్యార్థి విజయవాడ బస్టాండ్‌లోని ఓ వ్యక్తి ఫోన్ ద్వారా తామిక్కడ ఉన్నట్టు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. విద్యార్థులు తప్పిపోయినట్లు పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు విజయవాడ కంట్రోల్ రూంకి ఫోన్ చేసి పిల్లలను వారి అధీనంలో ఉంచుకోమని కోరారు. వంశీ దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామం కాగా, రాహుల్‌ది వేంసూరు మండలం మొద్దులగూడెం గ్రామం. వెంటనే పాఠశాల యజమాన్య బాధ్యులు నాగేందర్ రెడ్డి తల్లిదండ్రులను తీసుకుని విజయవాడ బయల్దేరి వెళ్ళారు. కాగా పాఠశాలలోని విద్యార్థులు, పాఠశాల యజమాన్యం, సిబ్బంది, గ్రామస్తుల విద్యార్థుల ఆచూకీ దొరికిందని తెలియడంతో వారు ఆనందం వ్యక్తపరిచారు. ఈ రెండు గ్రామాల్లో విద్యార్థుల ఆచూకీ తెలియడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. విజయవాడలోని బస్టాండ్‌లో వారిని కలుసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. పాఠశాల యజమాన్య బాధ్యులు నాగేందర్ రెడ్డి వారిని అక్కున చేర్చుకుని కన్నీంటి పర్యంతమై వారిని తీసుకుని బయల్దేరుతున్నట్లు తెలిపారు

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles