కులం కుంపట్లు


Sat,September 14, 2019 11:58 PM

ఖమ్మం క్రైం, సెప్టెంబర్ 14 : చంద్రాయన్ -2 రాకెట్ ప్రయోగంపై యావత్ ప్రపంచమంతా చంద్రమండలం వైపు చూస్తుంటే...ఖమ్మంలో మాత్రం కులం కుంపట్లతో పంచాయితీలు చేస్తూ సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశం ముందుకు పోతున్నా కులాచార వ్యవహారంలో మాత్రం మార్పు రావడం లేదు. కులం పంచాయితీలు, జరిమానాలు అంటూ ఇంకా దాడులకు తెగపడుతున్నారు. సామాజిక వర్గాల మధ్య పోరు రచ్చకెక్కి భారీ జరిమానాల వరకు దారితీసింది. ఖమ్మం నడిబొడ్డున ఇరువర్గాల పంచాయితీ సంఘటన కలవరపెట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...ఖమ్మం నగరంలోని త్రీటౌన్ ప్రాంతంలో స్థానిక మూడు బొమ్మల సెంటర్‌లో కసాని పరుశురాం (51) రేణుక అనే హోటల్ ద్వారా జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఆ హోటల్‌లో ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళను తిట్టారనే నేపథ్యంతో ఆ మహిళా వర్గానికి చెందిన కులస్తులు ఆ హోటల్ యజమానిపై రూ. 1.50 లక్షల జరిమానాను విధించారు. ఈ క్రమంలో జరిమాన చెల్లించడం లేదని ఆ హోటల్‌కు ఆ మహిళా సామాజిక వర్గానికి చెందిన కులస్తులు ఎవరూ కూడా టిఫిన్, చాయ్‌లు తాగ కూడదని దండోర వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.


అయితే పరుశురాం సోదరుడు కసాని ఐలయ్య ఈ వ్యవహారం పై త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. త్రీటౌన్ పోలీసులు ఇరువర్గాలను పలిపించి హెచ్చరించి పంపించారు. ఈ నేపథ్యంలో కక్షకట్టుకుని మాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అంటూ దాడులకు దిగారు. ఈ నెల 11వ తేదీన గణేష్ నిమజ్జనం రోజున జరిమానాలు వేసిన సామాజిక వర్గానికి చెందిన యువకులైన వల్లెపు రమణ, వేముల సందీప్, బత్తుల క్రాంతిలు కసాని పరుశురాం కొడుకు హరిష్‌పై దాడికి పాల్పడ్డారు. మరుసటి రోజు ఈ విషయాన్ని మూడు బొమ్మల సెంటర్‌కు చెందిన వీరభద్రానికి విషయం చెప్పారు. అతను ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. శుక్రవారం రాత్రి అదే ప్రాంతంలోని ఓ చికెన్ సెంటర్‌లో కొందరు మహిళలు, యువకులు హరిష్, వీరభద్రంపై దాడి చేశారు. ఈ సంఘటనలో వీరభద్రానికి తలకు గాయమైంది. ఈ విషయంపై హరిష్ తండ్రి కసాని పరుశురాం త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హరిష్, వీరభద్రంపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles