బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత

Sat,August 24, 2019 02:08 AM

-బాలల హక్కులపై జాతీయస్థాయిలో ప్రత్యేక బెంచ్‌లు
-చిల్డ్రన్ ఫ్రెండ్లీ నోడల్ జిల్లాగా ఖమ్మం
-జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ ఆర్‌జీ ఆనంద్

మామిళ్లగూడెం: బాలల హక్కుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతగా తీసుకుని సమాజంలో పిల్లలపై జరుగుతున్న వేధింపులను నిరోధించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ ఆర్‌జీ ఆనంద్ సూచించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొదటిసారిగా ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చామని, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బాలల హక్కులు, వారి పరిస్థితిపై బాలల హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం మూడు రోజులు పర్యటించిందన్నారు. రెండు జిల్లాల నుంచి బాధితులు పిర్యాదులు చేసుకునేందుకు, వారి సమస్యలను కమిషన్‌కు వివరించేందుకు వీలుగా జిల్లాలో బెంచ్ ఏర్పాటు చేశామన్నారు. ఈ బెంచ్ జిల్లా సివిల్ కోర్టుస్థాయిలో వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతుందన్నారు. దేశవ్యాప్తంగా జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సూచనల ఆధారంగా 29 రాష్ర్టాలలో పర్యటలను కొనసాగుతున్నాయన్నారు.

ప్రధానంగా నీతి అయోగ్ నివేదికల ఆధారంగా ఎంపిక చేసిన 150 జిల్లాల్లో ముందు కమిషన్ పర్యటన చేస్తుందన్నారు. అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో బాలల హక్కుల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వారికి కల్పిస్తు సౌకర్యాలపై అవగాహణ కల్పించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం బాలలకు కల్పించిన హక్కుల ప్రకారం బాలల హక్కుల చట్టం కింద 42 ఆర్టికల్స్ వారి హక్కులను కాపాడేందుకు పొందుపరిచి ఉన్నాయని, దీనికి అనుగుణంగానే ప్రతి ఒక్కరూ బాలల హక్కులను కాపాడేందుకు కృషి చేయాలన్నారు. పిల్లలు ఎవరూ కూడా నిషేధిత పనులుగాని, చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనడం కాని, లేదా ఇతరులు ఎవరైనా వారు పాల్గొనే విధంగా ప్రోత్సహించడం కూడా బాలల హక్కుల చట్టం ప్రకారం నేరమవుతుందని స్పష్టం చేశారు.

ప్రతి ఒక్కరూ తాము పనిచేస్తున్న కార్యాలయాలు, పరిశ్రమలు ఇతర సామాజిక వేధికలలో బాలలచే వెట్టి చాకీరు చేయించడం కానీ, బాలికలను వేధింపులకు గురిచేయడం సరైనది కాదన్నారు. ఖమ్మం జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించిన బృందానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించి ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఖమ్మం జిల్లాలో వచ్చిన ఫిర్యాదులలో అన్నింటిని పరిశీలించి చర్యలకై జిల్లా కలెక్టర్ ద్వారా సంబంధిత అధికారులకు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, జిల్లా లీగల్‌సెల్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ వినోద్‌కుమార్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్, కొత్తగూడెం జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఖమ్మం జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి, అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడింబా, ఖమ్మం జడ్పీ సీఈవో ప్రియాంక తదితరులున్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles